
చెన్నై:తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడుకు రావాల్సిన సమగ్రశిక్ష అభియాన్ రూ.2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అడుక్కోవడం లేదన్నారు. మీ తండ్రి సొమ్ము అడగడం లేదని ఫైరయ్యారు.
‘మేమేమీ మీ తండ్రి సంపాదించిన సొమ్ము అడగడం లేదు. మాకు హక్కుగా రావాల్సిన నిధులే మేం అడుగుతున్నాం. తమిళనాడు ప్రజలు కట్టే పన్ను డబ్బులనే మేం అడుతున్నాం. బీజేపీ బెదిరింపులకు భయపడేదే లేదు. తమిళనాడుపై హిందీని రుద్దాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని రెండు భాషల పాలసీ ప్రస్తుతం ప్రమాదంలో పడింది.
ఫాసిస్టు బీజేపీపై ఈ విషయంలో పోరాడేందుకు ప్రతిపక్షం అన్నాడీఎంకే మాతో కలిసి రావాలి. తమిళనాడు ప్రజలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోంది’అని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ) కింద మూడు భాషల పాలసీని అమలు చేసేదాకా తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయనిధి స్పందించారు. గతంలోనూ ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment