
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఛావా తెలుగు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఛావాను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంపై అరవింద్ ఎలా రియాక్ట్ అయ్యారని మీడియా ప్రతినిధులు బన్నీవాసును ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అల్లు అరవింద్ ప్రస్తుతం కేరళలో ఉన్నారని తెలిపారు. ట్రీట్‌మెంట్ కోసం ఆయన కేరళ వెళ్లారని వెల్లడించారు.
అయితే ఆయన కేవలం వెల్‌నెస్ సెంటర్‌లో చికిత్స కోసం వెళ్లారని బన్నీ వాసు అన్నారు. బరువు తగ్గేందుకు ప్రకృతి వైద్య చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. ఛావా నిర్మాతలతో మాట్లాడి తెలుగు రిలీజ్ చేసేందుకు ప్రయత్నించాలని అరవింద్ చెప్పారని తెలిపారు. ఆయన డైరెక్షన్‌లోనే ఛావాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా.. బాలీవుడ్ మూవీ ఛావాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్, యేసుబాయిగా రష్మిక మందన్నా నటించారు. గతనెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలవడంతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.