ఈ సువర్ణావకాశాన్ని వదులుకోవద్దు..
భారత కార్పొరేట్లకు ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేలా భారత్ పరుగులు తీస్తోందని.. దీంతో ప్రపంచ స్థాయి దిగ్గజ ఇన్వెస్టర్లందరూ భారత్‌లో పెట్టుబడులకు ఉవి్వళ్లూరుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత కార్పొరేట్లు ఈ ‘వికసిత్ భారత్‘ ప్రస్థానంలో సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.
బడ్జెట్ తదనంతరం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో ఏర్పాటు చేసిన ‘వికసిత్ భారత్ దిశగా పయనం’ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘నేడు ప్రపంచమంతా భారత్ వృద్ధితో పాటు మీ (పారిశ్రామిక వర్గాలు) వైపే చూస్తోంది. ప్రపంచ ప్రగతికి భారత్ మూల స్తంభంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ప్రపంచ నాయకుల్లో సైతం భారత్ పట్ల పూర్తి ఆశావాదం నెలకొంది. భారతీయ పారిశ్రామిక రంగానికి ఇదో సువర్ణావకాశం, దీన్ని మనం వదులుకోకూడదు’ అని మోదీ చెప్పారు.
వృద్ధి జోరు.. ధరలకు కళ్లెం
ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమనంతో పాటు భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వృద్ధి జోరు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం ద్వారా భారత్ వృద్ధి, స్థిరత్వాలకు దిక్సూచిగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ఇప్పుడు 8 శాతం జీడీపీ వృద్ధితో పురోగమిస్తోంది. దీన్ని ప్రకారం చూస్తే, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ప్రస్తుత ఐదో స్థానం నుంచి మూడో ర్యాంకుకు చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
ఈ ఘనతను తన మూడో విడత హయాంలోనే సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం, సంతృప్త స్థాయి విధానం, జీరో ఎఫెక్ట్–జీరో డిఫెక్ట్, ఆత్మనిర్భర్ భారత్ లేదా వికసిత్ భారత్ ప్రతిజ్ఙ అనేవి నేషన్ ఫస్ట్ విషయంలో మా నిబద్ధతకు నిదర్శనం’ అని మోదీ వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, వర్ధమాన రంగాల్లో ప్రపంచ శక్తిగా నిలిపేందుకు దేశీ పారిశ్రామిక రంగం ప్రభుత్వంతో పోటీ పడాలని చెప్పారు.
ఉద్యోగ కల్పనపైనే బడ్జెట్లో దృష్టి...
కోట్లాదిగా ఉద్యోగాలిచ్చే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో పలు చర్యలు తీసుకున్నామని మోదీ గుర్తు చేశారు. ఇండస్ట్రీ 4.0 ప్రమాణాల మేరకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించిందన్నారు. భారత్ 1.4 లక్షల స్టార్టప్‌లకు నిలయం. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా వంటి స్కీమ్‌లతో 8 కోట్ల మంది కొత్త వ్యాపారాలను మొదలుపెట్టారని చెప్పారు. 4 కోట్ల మంది యువతకు మేలు చేకూర్చేలా రూ.2 లక్షల కోట్లతో పీఎం ప్యాకేజీని బడ్జెట్లో ప్రకటించామన్నారు. దేశంలోని 100 జిల్లాల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉండే ఇన్వెస్ట్‌మెంట్ పార్కులను నెలకొల్పనున్నామని, ఈ 100 నగరాలు వికసిత్ భారత్‌లో నయా కేంద్రాలుగా ఆవిర్భవించనున్నట్లు ప్రధాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment