రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్నామని, వృద్ధికి ఊతమిచ్చేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా వైరస్ సంక్షోభంతో సతమతమవుతున్న ఇన్‌ఫ్రా రంగాన్ని మళ్లీ వృద్ధి బాట పట్టించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమవర్గాలకు సూచించారు. గతంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు తరహాలో మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులతో ఎకానమీకి గణనీయంగా తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.
‘తూర్పు–పశ్చిమ, ఉత్తరాది–దక్షిణాది మధ్య ఎక్స్‌ప్రెస్‌వే, హై స్పీడ్ రైల్ కారిడార్లు మొదలైన వాటి రూపంలో ఈ ప్రాజెక్టులు ఉండచ్చు. ఇలాంటి రెయిల్, రోడ్ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో వాటి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు, ఎకానమీలోని ఇతర రంగాలకు కనెక్టివిటీ లభిస్తుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సాకారానికి ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు... రెండూ కీలకమే‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ చెప్పారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం దేశీయంగా 2030 నాటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 4.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు.
ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ..: ఇన్‌ఫ్రా రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఇతరత్రా అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. వన్–టైమ్ రుణాల పునర్‌వ్యవస్థీకరణ, కార్పొరేట్ బాండ్లను ఆర్‌బీఐ నేరుగా కొనుగోలు చేయాలన్న పరిశ్రమ వర్గాల సిఫార్సులను దృష్టిలో ఉంచుకున్నామని, సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
‘ఆర్‌బీఐ చాలా అప్రమత్తంగా ఉంది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. అవసరమైనప్పుడు.. తగిన చర్యలు తీసుకోవడంలో సందేహించే ప్రసక్తే లేదు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు తోడ్పాటునిచ్చే అంశంలో ఆర్‌బీఐ వ్యవహరించిన తీరు మీకు తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ క్రియాశీలకంగానే వ్యవహరిస్తుంది‘ అని దాస్ తెలిపారు. కరోనా పరిణామాలతో మొండిబాకీలు పెరిగి, సమస్య మరింత జటిలమయ్యే దాకా చూస్తూ కూర్చోకుండా బ్యాంకులు .. మరింత మూలధనాన్ని సమకూర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని దాస్ సూచించారు.
వ్యవ’సాయం’..
ఇటీవలి సంస్కరణలతో వ్యవసాయ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నాయని దాస్ చెప్పారు. ఫలితంగా ఉపాధి కల్పనకు, రైతుల ఆదాయాలు పెరిగేందుకు మరింతగా ఊతం లభించగలదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చీకట్లో చిరుదివ్వెల్లాగా ఉన్నాయని అభివర్ణించారు. ఇక, భారత్ ప్రస్తుతం మిగులు విద్యుత్ దేశంగా.. పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతోందని దాస్ చెప్పారు. మొత్తం విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక విద్యుత్ వాటాను 2030 నాటికల్లా 40 శాతానికి పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందని.. దీనివల్ల బొగ్గు దిగుమతుల బిల్లులు తగ్గుతాయని.. ఉపాధి అవకాశాల కల్పన జరగగలదని ఆయన పేర్కొన్నారు.
వృద్ధి చోదకంగా ఐసీటీ..
ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ).. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్ ప్రగతి చోదకంగా నిలుస్తోందని గవర్నర్ చెప్పారు. గతేడాది స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఐసీటీ వాటా 8 శాతానికి చేరిందని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగంగా నిల్చిందని పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊతమిస్తోందని, పలు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) సాధించడం ద్వారా ఇన్నోవేషన్ హబ్‌గా భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయని దాస్ తెలిపారు.
మారటోరియం పొడిగించొద్దు: హెచ్‌డీఎఫ్‌సీ పరేఖ్
రుణాల చెల్లింపుపై మారటోరియంను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో దీని గడువును మరింత పొడిగించొద్దంటూ రిజర్వ్ బ్యాంక్‌ను హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కోరారు. రుణాలు కట్టే సామర్థ్యాలున్నప్పటికీ కొన్ని సంస్థలు.. మారటోరియం స్కీమును అడ్డం పెట్టుకుని చెల్లించడం లేదని తెలిపారు. దీనివల్ల ఆర్థిక రంగానికి .. ముఖ్యంగా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకి సమస్యలు వస్తున్నాయని సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్‌కు తెలిపారు.
కరోనా వైరస్ దెబ్బతో ఆదాయాలు కోల్పోయిన వారికి ఊరటనిచ్చేలా రుణాల ఈఎంఐలను చెల్లించేందుకు కాస్త వ్యవధినిస్తూ ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆరు నెలల పాటు మారటోరియం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 31తో గడువు తీరిపోతుండటంతో .. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడనందున మారటోరియం వ్యవధిని మరింతగా పెంచాలంటూ అభ్యర్థనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరేఖ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, పరేఖ్ సూచనను పరిశీలిస్తామని, ఇప్పటికిప్పుడు మాత్రం దీనిపై ఏమీ చెప్పలేనని దాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment