infra sector
-
భారత్ అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. టెక్నాలజీతో కొత్త మార్పులు.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్‌ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్‌దే ఉంటోందన్నారు.అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
రెండో రోజూ అమ్మకాలే..!
ముంబై: ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెరుగుతున్న కరోనా కేసుల భయం భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఫలితంగా బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్ఫ్రా రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 173 పాయింట్లు నష్టపోయి 39,750 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 11,700 దిగువున 11,671 వద్ద నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి క్షీణత కొనసాగడం, బ్లూచిప్ కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్ మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ గడువు ముగియడంతో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. రూపాయి పతనంతో ఒక్క ఐటీ షేర్లు స్వల్పంగా లాభాలను ఆర్జించగలిగాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,524 – 40,011 రేంజ్ కదలాడింది. నిఫ్టీ 11,606 – 11,744.15 పరిధిలో ఊగిసలాడింది. దేశీయ స్టాక్ మార్కెట్ దృష్టి ఇప్పుడు కంపెనీల క్యూ2 ఫలితాల నుంచి అంతర్జాతీయ పరిణామాల వైపు మళ్లింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తిరిగి పెరగడం, అమెరికా ఎన్నికలపై, ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనపై సందిగ్ధత కొనసాగడం లాంటి ప్రతికూలాంశాలు ఇప్పుడిప్పుడే రికవరి అవుతున్న ఆర్థిక వ్యవస్థలో ఆందోళనలను రేకెత్తించాయి. ఈక్విటీల్లో నెలకొన్న బలహీనత స్వల్పకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీల ప్రకటనలతో పాటు వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో మార్కెట్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. బలహీనంగా ప్రపంచమార్కెట్లు... అమెరికా అనిశ్చితులతో పాటు రోజు వారీగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రపంచమార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. కోవిడ్–19 కేసుల కట్టడికి యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో పాటు పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధించారు. లాక్డౌన్ విధింపుతో ఆర్థిక వృద్ధి ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లను కలవరపెట్టాయి. ఫలితంగా గురువారం ఆసియాలో ఒక్క చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల ఇండెక్స్‌లు 0.5% నుంచి 1% నష్టంతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు అరశాతం క్షీణించాయి. 5% నష్టపోయిన ఎల్ అండ్ టీ షేరు ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) షేరు గురువారం 5 శాతం పతనమైంది. క్యూ2 ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకదశలో 6 శాతం క్షీణించి రూ.927 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 5% పతనంతో రూ.935 వద్ద స్థిరపడింది. -
ఇక రెండుగా ఐబీఎం..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఐబీఎం తన వ్యాపార కార్యకలాపాలను రెండుగా విభజించనుంది. ఇందులో భాగంగా మేనేజ్డ్ ఇన్ఫ్రా సేవల విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయనుంది. ఇకపై ఐబీఎం పూర్తిగా హైబ్రీడ్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వ్యాపారాలపై దృష్టి పెట్టనుండగా, రెండో సంస్థ సర్వీస్ డెలివరీ, ఆటోమేషన్ తదితర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియ 2021 ఆఖరు నాటికి పూర్తి కావచ్చని అంచనా. తాత్కాలికంగా ’న్యూకో’ పేరుతో వ్యవహరిస్తున్న ఇన్ఫ్రా సేవల విభాగానికి భారత్‌లోని ఉద్యోగుల్లో సుమారు మూడో వంతు సిబ్బందిని బదలాయించనున్నట్లు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ తెలిపారు. 2019 ఆఖరు నాటికి ఐబీఎంలో మొత్తం 3.83 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. దేశాలవారీగా ఉద్యోగుల సంఖ్యను కంపెనీ వెల్లడించనప్పటికీ.. భారత్‌లో సుమారు 1 లక్ష పైచిలుకు సిబ్బంది ఉంటారని అంచనా. -
ఇన్ఫ్రా పెట్టుబడులు జోరందుకోవాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్నామని, వృద్ధికి ఊతమిచ్చేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా వైరస్ సంక్షోభంతో సతమతమవుతున్న ఇన్ఫ్రా రంగాన్ని మళ్లీ వృద్ధి బాట పట్టించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమవర్గాలకు సూచించారు. గతంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు తరహాలో మెగా ఇన్ఫ్రా ప్రాజెక్టులతో ఎకానమీకి గణనీయంగా తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. ‘తూర్పు–పశ్చిమ, ఉత్తరాది–దక్షిణాది మధ్య ఎక్స్‌ప్రెస్‌వే, హై స్పీడ్ రైల్ కారిడార్లు మొదలైన వాటి రూపంలో ఈ ప్రాజెక్టులు ఉండచ్చు. ఇలాంటి రెయిల్, రోడ్ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో వాటి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు, ఎకానమీలోని ఇతర రంగాలకు కనెక్టివిటీ లభిస్తుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సాకారానికి ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు... రెండూ కీలకమే‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ చెప్పారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం దేశీయంగా 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 4.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ..: ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఇతరత్రా అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. వన్–టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ, కార్పొరేట్ బాండ్లను ఆర్బీఐ నేరుగా కొనుగోలు చేయాలన్న పరిశ్రమ వర్గాల సిఫార్సులను దృష్టిలో ఉంచుకున్నామని, సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ‘ఆర్బీఐ చాలా అప్రమత్తంగా ఉంది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. అవసరమైనప్పుడు.. తగిన చర్యలు తీసుకోవడంలో సందేహించే ప్రసక్తే లేదు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు తోడ్పాటునిచ్చే అంశంలో ఆర్బీఐ వ్యవహరించిన తీరు మీకు తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ క్రియాశీలకంగానే వ్యవహరిస్తుంది‘ అని దాస్ తెలిపారు. కరోనా పరిణామాలతో మొండిబాకీలు పెరిగి, సమస్య మరింత జటిలమయ్యే దాకా చూస్తూ కూర్చోకుండా బ్యాంకులు .. మరింత మూలధనాన్ని సమకూర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని దాస్ సూచించారు. వ్యవ’సాయం’.. ఇటీవలి సంస్కరణలతో వ్యవసాయ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నాయని దాస్ చెప్పారు. ఫలితంగా ఉపాధి కల్పనకు, రైతుల ఆదాయాలు పెరిగేందుకు మరింతగా ఊతం లభించగలదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చీకట్లో చిరుదివ్వెల్లాగా ఉన్నాయని అభివర్ణించారు. ఇక, భారత్ ప్రస్తుతం మిగులు విద్యుత్ దేశంగా.. పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతోందని దాస్ చెప్పారు. మొత్తం విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక విద్యుత్ వాటాను 2030 నాటికల్లా 40 శాతానికి పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందని.. దీనివల్ల బొగ్గు దిగుమతుల బిల్లులు తగ్గుతాయని.. ఉపాధి అవకాశాల కల్పన జరగగలదని ఆయన పేర్కొన్నారు. వృద్ధి చోదకంగా ఐసీటీ.. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ).. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్ ప్రగతి చోదకంగా నిలుస్తోందని గవర్నర్ చెప్పారు. గతేడాది స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఐసీటీ వాటా 8 శాతానికి చేరిందని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగంగా నిల్చిందని పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊతమిస్తోందని, పలు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) సాధించడం ద్వారా ఇన్నోవేషన్ హబ్‌గా భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయని దాస్ తెలిపారు. మారటోరియం పొడిగించొద్దు: హెచ్డీఎఫ్సీ పరేఖ్ రుణాల చెల్లింపుపై మారటోరియంను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో దీని గడువును మరింత పొడిగించొద్దంటూ రిజర్వ్ బ్యాంక్‌ను హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కోరారు. రుణాలు కట్టే సామర్థ్యాలున్నప్పటికీ కొన్ని సంస్థలు.. మారటోరియం స్కీమును అడ్డం పెట్టుకుని చెల్లించడం లేదని తెలిపారు. దీనివల్ల ఆర్థిక రంగానికి .. ముఖ్యంగా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకి సమస్యలు వస్తున్నాయని సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్‌కు తెలిపారు. కరోనా వైరస్ దెబ్బతో ఆదాయాలు కోల్పోయిన వారికి ఊరటనిచ్చేలా రుణాల ఈఎంఐలను చెల్లించేందుకు కాస్త వ్యవధినిస్తూ ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆరు నెలల పాటు మారటోరియం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 31తో గడువు తీరిపోతుండటంతో .. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడనందున మారటోరియం వ్యవధిని మరింతగా పెంచాలంటూ అభ్యర్థనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరేఖ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, పరేఖ్ సూచనను పరిశీలిస్తామని, ఇప్పటికిప్పుడు మాత్రం దీనిపై ఏమీ చెప్పలేనని దాస్ పేర్కొన్నారు. -
ఇన్ఫ్రాకు ప్రత్యేక ఫండ్!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్, విద్యుత్ సహా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న మౌలిక సదుపాయాల రంగంలోని వివిధ విభాగాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా వెల్లడించారు. ఇన్ఫ్రా రంగానికి తోడ్పాటునిచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రతింపులు జరిపినట్లు ఆయన వివరించారు. వీరిలో పరిశ్రమవర్గాలు, బ్యాంకులు, గృహాల కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు మొదలైన వారు ఉన్నట్లు మిశ్రా తెలిపారు. జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి మండలి (నారెడ్కో) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నిల్చిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తోడ్పాటునిచ్చేలా స్ట్రెస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నారెడ్కో, రియల్ ఎస్టేట్ సంస్థల సమాఖ్య క్రెడాయ్ మొదలైనవి కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆగస్టు 11న ఆర్థిక మంత్రితో భేటీ అయిన గృహ కొనుగోలుదారుల ఫోరం కూడా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం రూ. 10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయాలని, గృహ కొనుగోలుదారులకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి చేసింది. అటు ఎకానమీ మందగమనంలోకి జారుకుంటున్న సంకేతాల నేపథ్యంలో పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చేలా రూ. 1 లక్ష కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని దేశీ కార్పొరేట్లు డిమాండ్ చేస్తున్నారు. -
ఇన్ ఫ్రాకు బూస్ట్
రూ. 2.21 లక్షల కోట్ల కేటాయింపు న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే క్రమంలో.. బడ్జెట్లో ఇన్ఫ్రా రంగానికి రూ. 2.21 లక్షల కోట్లు కేటాయించారు అరుణ్ జైట్లీ. వృద్ధికి అవరోధాల తొలగింపునకు చర్యలు, సంస్కరణలతో పాటు అదనపు నిధుల ఊతంతో ఇన్ఫ్రా రంగం మెరుగుపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్రియాశీలక చర్యలతో 2015లో అత్యధిక సంఖ్యలో రహదారుల కాంట్రాక్టులు ఇవ్వడం జరిగిందని, వృద్ధిని సూచిస్తూ వాహన విక్రయాలు సైతం అత్యధికంగా నమోదయ్యాయని జైట్లీ చెప్పారు. 2016-17కి సంబంధించి ఇన్ఫ్రాకు మొత్తం రూ. 2.21 లక్షల కోట్లు కేటాయించగా, ఇందులో సింహభాగం రూ. 2.18 లక్షల కోట్లు రహదారులు, రైల్వేలకే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిల్చిపోయిన 70 రహదారి ప్రాజెక్టుల్లో దాదాపు 85 శాతం ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కాయని పేర్కొన్నారు. దాదాపు 8,003 కి.మీ. ఈ ప్రాజెక్టుల పెట్టుబడుల విలువ సుమారు రూ. 1 లక్ష కోట్లు ఉంటుందన్నారు. జాతీయ రహదారుల భారీగా నిధులు కేటాయించారు. ఇన్ఫ్రాకు కూడా కొత్తగా క్రెడిట్ రేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. అటు పోర్టులకు ఊతమిచ్చేలా సాగర్మాలా ప్రాజెక్టుకు రూ. 8,000 కోట్లు కేటాయించారు. ప్రజా రవాణా వ్యవస్థకు మెరుగులు.. ప్రజా రవాణా వ్యవస్థలో పర్మిట్ల చట్టాలను తొలగించ డం మధ్యకాలిక లక్ష్యంగా జైట్లీ పేర్కొన్నారు. సామాన్య ప్రయాణీకుల సౌలభ్యం కోసం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి.. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వివిధ రూట్లలో బస్సులను నడపేందుకు అనుమతులిచ్చేలా మోటార్ వెహికల్ చట్టాల్లో మార్పులు తేనున్నట్లు ఆయన చెప్పారు. దీనితో ఈ విభాగంలో పెట్టుబడుల రాకతో పాటు యువతకు ఉపాధి కల్పన, స్టార్టప్ వ్యాపారవేత్తల అభివృద్ధి తదితర సానుకూల పరిణామాలు చోటు చేసుకోగలవన్నారు. -
భారత్‌లో తొలిసారిగా బియ్యం పాస్తా తయారీ యూనిట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ, ఇన్ఫ్రా రంగంలో ఉన్న కేజేఆర్ గ్రూప్ మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఏర్పాటు చేస్తున్న రాగమయూరి మెగా ఫుడ్ పార్క్‌కు ఫిబ్రవరి తొలివారంలో శంకుస్థాపన జరుగనుంది. 124 ఎకరాల్లో వస్తున్న ఈ పార్క్కై కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ రూ.50 కోట్ల గ్రాంటును మంజూరు చేసింది. నాబార్డు రూ.47 కోట్ల రుణం ప్రకటించింది. కేజేఆర్ గ్రూప్‌నకు చెందిన రాగమయూరి బిల్డర్స్ రూ.27 కోట్లు ఈక్విటీగా సమకూరుస్తోంది. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రులతోపాటు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ముఖ్య అతిథులుగా వస్తున్నారని గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, పార్కులో డిసెంబర్‌లోగా అన్ని మౌలిక వసతుల ఏర్పాటు పూర్తి అవుతుందని చెప్పారు. దేశంలో తొలిసారిగా..: ఫుడ్ పార్కులో రాగమయూరి ఫుడ్, బెవరేజెస్ రూ.35 కోట్లతో యాంకర్ యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఇందులో భారత్‌లో తొలిసారిగా బియ్యంతో పాస్తా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం జర్మనీ టెక్నాలజీ వాడుతున్నామని కేజే రెడ్డి తెలిపారు. ‘గంటకు 300 కిలోల తయారీ సామర్థ్యం గల ఈ యూనిట్‌కై రూ.20 కోట్లు వెచ్చిస్తున్నాం. పాస్తాను తొలుత జర్మనీకి ఎగుమతి చేస్తాం. మహబూబ్‌నగర్, కర్నూలులో పండే బియ్యం కొంత తీపిగా ఉంటాయి. ఇవి పాస్తా తయారీకి మేలైనవి. అరటి పండ్లను పొడిగా చేసే యూనిట్‌ను సైతం నెలకొల్పుతున్నాం. ఇది దక్షిణాదిన తొలి యూనిట్ అవుతుంది. పులివెందుల నుంచి అరటి పండ్లను సేకరిస్తాం. అలాగే శుభమస్తు బ్రాండ్‌లో బియ్యం, దినుసులు, మసాలాలను విక్రయిస్తాం’ అని వెల్లడించారు. ప్రత్యక్షంగా 10,000 మందికి ఉపాధి.. పార్కు ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 10,000 మందికిపైగా ఉపాధి లభిస్తుంది. అలాగే ఒక లక్ష మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. టమాటా, బొప్పాయి, అరటి, ఉల్లి తదితర పంటలు పండించే రైతులతో నేరుగా ఒప్పందం చేసుకుంటామని గ్రూప్ సీఎండీ తెలిపారు. పార్కులో 60 ప్రాసెసింగ్ యూనిట్ల దాకా వస్తాయని కంపెనీ భావిస్తోంది. మొత్తంగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. -
ఐదు కంపెనీలను కొంటున్న బీఎస్ లిమిటెడ్
⇒ ఈ కంపెనీల విలువ రూ. 937 కోట్లుగా అంచనా ⇒ విద్యుత్ సరఫరా ఇన్ఫ్రా రంగంలో అతిపెద్ద కంపెనీగా అవతరణ ⇒ ఈ ఏడాది 7% వృద్ధితో రూ. 75 కోట్లకు చేరిన నికరలాభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ సరఫరా, పంపిణీలకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యాపారంలో ఉన్న బీఎస్ లిమిటెడ్ భారీ కొనుగోళ్లకు తెరతీసింది. వ్యాపార విస్తరణలో భాగంగా మొత్తం ఐదు కంపెనీలను రూ. 937 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు బీఎస్ లిమిటెడ్ ప్రకటించింది. విద్యుత్ సరఫరా, పంపిణీకి కావల్సిన స్తంభాలు, స్టీల్ స్ట్రక్చర్స్, ట్రాన్సిమిషన్ హార్డ్‌వేర్, యాంటీ థెప్ట్ పరికరాలను తయారు చేసే ఐదు సంస్థలను కొనుగోలు చేయడానికి బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అగర్వాల్ స్టీల్స్ స్ట్రక్చర్స్ ఇండియా, డురాఫాస్ట్ ఆటోమోటివ్, ఎన్హెచ్ఎస్ మెటల్స్, రాజేష్ సంథి ఇన్ఫ్రాస్, మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను బీఎస్ లిమిటెడ్ కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోళ్లకు ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ఈ కంపెనీల కొనుగోళ్ల ద్వారా విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాల వ్యాపారంలో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందించే సంస్థగా బీఎస్ లిమిటెడ్ చేరిందని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేష్ అగర్వాల్ తెలిపారు. దీంతో రైల్వే విద్యుద్దీకరణతో పాటు పెద్ద బిడ్డింగ్ల్లో పాల్గొనే సామర్థ్యం కంపెనీకి సమకూరిందన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అగర్వాల్ తెలిపారు. ఆదాయంలో 15 శాతం వృద్ధి మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నికర లాభంలో 15% వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 70 కోట్లుగా ఉన్న నికరలాభం సమీక్షా కాలంలో రూ. 75 కోట్లకు చేరిం ది. ఇదే కాలానికి ఆదాయం రూ. 15% వృద్ధితో రూ. 2,321 కోట్ల నుంచి రూ. 2,673 కోట్లకు పెరిగింది. -
ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ సూచీలు గరిష్ట స్థాయిల్లో కదులుతున్నప్పటికీ లార్జ్‌క్యాప్ షేర్లతో పోలిస్తే అనేక మిడ్ క్యాప్ షేర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. ఎన్నికల అనంతరం కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వస్తే ఇన్ఫ్రా రంగం బాగా పుంజుకునే అవకాశాలున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ వినయ్ శర్మ తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన డివిడెండ్ ఈల్డ్ పథకం వివరాలను తెలియచేయడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకి గడ్డుకాలం తొలగినట్లే అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం సంస్కరణలను కొనసాగిస్తూ, జీఎస్టీ, ఆదాయపు పన్నుల్లో మార్పులు తీసుకొస్తే ఈ ఏడాది కూడా మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తాయన్నారు. ఇంకా ఏమన్నారంటే.... దిగిరాకపోతే కష్టమే.. వడ్డీరేట్లు దిగిరాకపోతే అది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లు దిగివచ్చే అవకాశాలు కనిపించడం లేదని దీనికితోడు ఎలినెనో మార్కెట్లను మరింత భయపెడుతోందన్నారు. ఎలినెనో వల్ల వర్షాభావం ఏర్పడితే దేశీయ వినియోగంపై దెబ్బతింటుందని శర్మ తెలిపారు. కాని ఇప్పుడే ఎలినెనో ప్రభావం ఏ మేరకు ఉంటుందో చెప్పలేమని, ద్రవ్యోల్బణం తగ్గి 5-6 నెలలు స్థిరంగా ఉంటే కాని వడ్డీరేట్లు తగ్గే అవకాశం లేదన్నారు. అమ్ముతూనే ఉన్నారు.. మార్కెట్లు గరిష్ట స్ధాయిలో ఉన్నప్పటికీ దేశీయంగా చిన్న ఇన్వెస్టర్లు ఇప్పటికీ మార్కెట్లకు దూరంగానే ఉంటున్నట్లు శర్మ పేర్కొన్నారు. సూచీలు బాగా పెరిగిన తర్వాత గతంకంటే పరిస్థితి కొద్దిగా మెరుగైనప్పటికీ దేశీయ ఫండ్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పట్లో కొత్త పథకాలు లేవు ఇప్పటికే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పోర్ట్‌ఫోలియోలో అనేక రకాల పథకాలు ఉండటంతో కొత్త తరహా ఈక్విటీ ఫండ్స్ ప్రవేశపెట్టే ఆలోచన లేదని శర్మ స్పష్టం చేశారు. ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన డివిడెండ్ ఈల్డ్ విభాగంలో ఇక్కడ తక్కువ పథకాలు అందుబాటులో ఉండటంతో దీనిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ కింద కేవలం రూ.6,000 కోట్ల ఆస్తులు మాత్రమే నిర్వహణలో ఉన్నాయని, ఈ విభాగం మరింత వృద్ధి చెందడానికి అవకాశాలున్నాయన్నారు. డివిడెండ్ ఈల్డ్ ఫండ్ అత్యధికంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీలను ఎంపిక చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. నిఫ్టీ డివిడెండ్ ఆపర్చునిటీస్ ఇండెక్స్ ప్రామాణికంగా పనిచేసే ఈ పథకంలో ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 80 శాతం నిఫ్టీ ఇండెక్స్ షేర్లకే కేటాయించనున్నట్లు శర్మ తెలిపారు. ఏప్రిల్ 25న ప్రారంభమైన ఈ న్యూ ఫండ్ ఆఫర్ మే 9న ముగుస్తుంది, ఈ సమయంలో రూ.700 - 800 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శర్మ తెలిపారు.