భారత్‌లో తొలిసారిగా బియ్యం పాస్తా తయారీ యూనిట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ, ఇన్‌ఫ్రా రంగంలో ఉన్న కేజేఆర్ గ్రూప్ మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఏర్పాటు చేస్తున్న రాగమయూరి మెగా ఫుడ్ పార్క్‌కు ఫిబ్రవరి తొలివారంలో శంకుస్థాపన జరుగనుంది. 124 ఎకరాల్లో వస్తున్న ఈ పార్క్‌కై కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ రూ.50 కోట్ల గ్రాంటును మంజూరు చేసింది. నాబార్డు రూ.47 కోట్ల రుణం ప్రకటించింది. కేజేఆర్ గ్రూప్‌నకు చెందిన రాగమయూరి బిల్డర్స్ రూ.27 కోట్లు ఈక్విటీగా సమకూరుస్తోంది. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రులతోపాటు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ముఖ్య అతిథులుగా వస్తున్నారని గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, పార్కులో డిసెంబర్‌లోగా అన్ని మౌలిక వసతుల ఏర్పాటు పూర్తి అవుతుందని చెప్పారు.
దేశంలో తొలిసారిగా..: ఫుడ్ పార్కులో రాగమయూరి ఫుడ్, బెవరేజెస్ రూ.35 కోట్లతో యాంకర్ యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఇందులో భారత్‌లో తొలిసారిగా బియ్యంతో పాస్తా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం జర్మనీ టెక్నాలజీ వాడుతున్నామని కేజే రెడ్డి తెలిపారు. ‘గంటకు 300 కిలోల తయారీ సామర్థ్యం గల ఈ యూనిట్‌కై రూ.20 కోట్లు వెచ్చిస్తున్నాం. పాస్తాను తొలుత జర్మనీకి ఎగుమతి చేస్తాం. మహబూబ్‌నగర్, కర్నూలులో పండే బియ్యం కొంత తీపిగా ఉంటాయి.
ఇవి పాస్తా తయారీకి మేలైనవి. అరటి పండ్లను పొడిగా చేసే యూనిట్‌ను సైతం నెలకొల్పుతున్నాం. ఇది దక్షిణాదిన తొలి యూనిట్ అవుతుంది. పులివెందుల నుంచి అరటి పండ్లను సేకరిస్తాం. అలాగే శుభమస్తు బ్రాండ్‌లో బియ్యం, దినుసులు, మసాలాలను విక్రయిస్తాం’ అని వెల్లడించారు.
ప్రత్యక్షంగా 10,000 మందికి ఉపాధి..
పార్కు ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 10,000 మందికిపైగా ఉపాధి లభిస్తుంది. అలాగే ఒక లక్ష మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. టమాటా, బొప్పాయి, అరటి, ఉల్లి తదితర పంటలు పండించే రైతులతో నేరుగా ఒప్పందం చేసుకుంటామని గ్రూప్ సీఎండీ తెలిపారు. పార్కులో 60 ప్రాసెసింగ్ యూనిట్ల దాకా వస్తాయని కంపెనీ భావిస్తోంది. మొత్తంగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.