న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్, విద్యుత్ సహా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న మౌలిక సదుపాయాల రంగంలోని వివిధ విభాగాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా వెల్లడించారు. ఇన్‌ఫ్రా రంగానికి తోడ్పాటునిచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రతింపులు జరిపినట్లు ఆయన వివరించారు. వీరిలో పరిశ్రమవర్గాలు, బ్యాంకులు, గృహాల కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు మొదలైన వారు ఉన్నట్లు మిశ్రా తెలిపారు. జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి మండలి (నారెడ్‌కో) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నిల్చిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తోడ్పాటునిచ్చేలా స్ట్రెస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నారెడ్‌కో, రియల్ ఎస్టేట్ సంస్థల సమాఖ్య క్రెడాయ్ మొదలైనవి కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆగస్టు 11న ఆర్థిక మంత్రితో భేటీ అయిన గృహ కొనుగోలుదారుల ఫోరం కూడా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం రూ. 10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయాలని, గృహ కొనుగోలుదారులకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి చేసింది. అటు ఎకానమీ మందగమనంలోకి జారుకుంటున్న సంకేతాల నేపథ్యంలో పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చేలా రూ. 1 లక్ష కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని దేశీ కార్పొరేట్లు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment