![SEBI introduced MITRA to assist investors in tracking and reclaiming inactive or unclaimed fund folios](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/sebi01.jpg.webp?itok=3F6PXlPs)
యాక్టివ్‌లోలేని లేదా క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇన్వెస్టర్లకు తీపికబురు అందించింది. సదరు ఫండ్ ఫోలియోలను ట్రాక్ చేసేందుకు, వాటిని తిరిగి పొందేందుకు పెట్టుబడిదారులకు సహాయపడటానికి సెబీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (మిత్రా) అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది.
పెట్టుబడుల సమాచారం మిస్ అవ్వడం లేదా తమ పేరుతో చేసిన పెట్టుబడుల గురించి నామినీలకు తెలియకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ట్రాక్ చేయలేకపోతున్నామనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాంటి వారికోసం కొత్తగా ప్రవేశపెట్టిన మిత్రా ఎంతో సహకరిస్తుందని సెబీ తెలిపింది. యాక్టివ్‌లోలేని, క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోల వివరాలను డేటాబేస్ నుంచి శోధించి ‘మిత్రా’ పెట్టుబడిదారులకు సమాచారం అందిస్తుంది. పెట్టుబడుల సమాచారాన్ని విస్మరించినా లేదా ఇతరులు చేసిన ఏవైనా పెట్టుబడులను గుర్తించడానికైనా మిత్రా వేదిక అవ్వనుంది.
ఇదీ చదవండి: రూ.50 నోట్లపై గవర్నర్ సంతకం మార్పు
ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. నాన్ కేవైసీ కంప్లైంట్ ఫోలియోల సంఖ్యను తగ్గిస్తుంది. మోసపూరిత రిడంప్షన్లను అరికడుతుంది. ఫండ్స్, సరైన ఫోలియో ఉన్నప్పటికీ పదేళ్ల పాటు ఎలాంటి నిర్వహణ చేయకపోతే వాటిని నిబంధనల ప్రకారం ఇన్‌యాక్టివ్‌గా పరిగణిస్తారు. అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు (ఏఎంసీలు), రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్‌ఏ), అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ), మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు సహా అందరు భాగస్వాములకు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలని సెబీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment