గత 30 రోజుల్లో క్లయింట్ ఎలాంటి లావాదేవీలను చేపట్టని సందర్భంలో తదుపరి సెటిల్‌మెంట్‌లో మూడు రోజుల్లోగా ఖాతాలోని నిధులను వెనక్కి ఇవ్వవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రతిపాదించింది. ఖాతాల నెలవారీ రన్నింగ్ సెటిల్‌మెంట్ సైకిల్‌కు సంబంధించి స్టాక్ బ్రోకర్లకు సెబీ తాజా మార్గదర్శకాలను ప్రతిపాదించింది.
రానున్న సెటిల్‌మెంట్ రోజులకు ఇది వర్తించనున్నట్లు కన్సల్టేషన్ పేపర్‌లో పేర్కొంది. దీనికి క్వార్టర్లీ సెటిల్‌మెంట్‌గా సైతం పిలిచే సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్ల పరిరక్షణతోపాటు.. సరళతర బిజినెస్ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ తాజా మార్గదర్శకాలకు ప్రతిపాదించింది. వెరసి క్లయింట్ల నిధుల సెటిల్‌మెంట్‌ను తప్పనిసరి చేయనుంది. ఈ అంశాలపై ఈ నెల 26వరకూ సెబీ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది.
ఇదిలా ఉండగా అనామక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లభించే అన్‌లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్‌తో జాగ్రత్తగా ఉండాలని, వాటికి జోలికి వెళ్లొద్దని ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. ఈ అన్‌రిజిస్టర్డ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఎటువంటి నియంత్రణా ఉండదని, మదుపరుల రక్షణ వ్యవస్థ కూడా లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.
కంపెనీల చట్టం 2013ను ఉల్లంఘిస్తూ 200లకుపైగా ఇన్వెస్టర్లకు అన్‌లిస్టెడ్ సెక్యూరిటీస్‌ను అక్రమ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయని సెబీ గుర్తించింది. ఈ క్రమంలోనే మదుపరులను అప్రమత్తం చేసింది. వీటిలో పెట్టుబడులు పెడితే చాలా ప్రమాదమని గుర్తుచేసింది. లిస్టెడ్ డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఆథరైజ్డ్ స్టాక్‌బ్రోకర్లు నిర్వహించే రిజిస్టర్డ్ ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫామ్స్‌ల్లోకి మాత్రమే వెళ్లాలని సెబీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment