ఇన్‌ఫ్రా, ఎంఎస్‌ఎంఈలకు దన్నుగా ఉండాలి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్‌ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు.
టెక్నాలజీతో కొత్త మార్పులు..
ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్‌ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్‌దే ఉంటోందన్నారు.
అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment