డిపాజిట్ల పెంపుపైనే దృష్టి | Finance Minister chaired a meeting in Delhi to review Public Sector Banks performance | Sakshi
Sakshi News home page

డిపాజిట్ల పెంపుపైనే దృష్టి

Published Tue, Aug 20 2024 9:20 AM | Last Updated on Tue, Aug 20 2024 9:45 AM

Finance Minister chaired a meeting in Delhi to review Public Sector Banks performance

బ్యాంకు చీఫ్‌లకు ఆర్థికమంత్రి దిశానిర్దేశం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) డిపాజిట్‌ వృద్ధిని మెరుగుపరచాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ఆర్థికమంత్రి ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో బ్యాంకింగ్‌ పనితీరు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గత కొన్ని నెలల్లో రుణ వృద్ధి కంటే డిపాజిట్ల పరుగు 300–400 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) వెనుకబడి ఉంది. ఇలాంటి పరిస్థితి బ్యాంకులకు అసెట్‌–లయబిలిటీ (రుణాలు–డిపాజిట్లు) అసమతుల్యతను సృష్టిస్తోంది.
  
ప్రత్యామ్నాయ పెట్టుబడులపై ఆసక్తి వల్లే...

ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు గృహ పొదుపులు మారడంవల్లే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి రేటు పడిపోతోందన్న ఆందోళనలు ఉన్నాయి.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా ఇటీవలే స్వయంగా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ విస్తారమైన బ్రాంచ్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం, అలాగే వినూత్న ఉత్పత్తులు, సేవల ద్వారా డిపాజిట్లను సమీకరించాలని ఆయన కోరారు. ‘పెరుగుతున్న క్రెడిట్‌ డిమాండ్‌ను తీర్చడానికి బ్యాంకులు స్వల్పకాలిక నాన్‌–రిటైల్‌ డిపాజిట్లు, ఇతర సాధనాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. డిపాజిట్లు పెరక్కపోవడం బ్యాంకింగ్‌ వ్యవస్థను నిర్మాణాత్మక లిక్విడిటీ సమస్యలకు గురిచేసే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు. రిటైల్‌ కస్టమర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయని పేర్కొన్న ఆయన, ఫలితంగా బ్యాంకులు రుణ వృద్ధికి వెనుకంజలో ఉన్న డిపాజిట్లతో నిధుల విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌లతో ఆరి్థకమంత్రి డిపాజిట్లపైనే ప్రత్యేకించి దిశా నిర్దేశం చేయడం గమనార్హం. ఈ సమావేశంలో చర్చనీయాంశలను ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.  

సమీక్షా సమావేశ ముఖ్యాంశాలు.. 

  • 2024–25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన మొదటి సమీక్ష సమావేశం ఇది.  

  • ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, పీఎం సూర్య ఘర్, పీఎం విశ్వకర్మ యోజనతోసహా ప్రభుత్వం వివిధ ప్రధాన పథకాల అమలులో బ్యాంకుల ఆరి్థక పనితీరు, పురోగతిని ఆర్థిక మంత్రి సమీక్షించారు.

  • కోర్‌ బ్యాంకింగ్‌ వ్యాపారంపై దృష్టి సారించాలని, వినూత్న ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా డిపాజిట్‌ వృద్ధి వేగాన్ని పెంచాలని బ్యాంకుల చీఫ్‌ను ఆర్థిక మంత్రి కోరారు.

  • సమర్థవంతమైన కస్టమర్‌ సేవల డెలివరీ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు  తమ కస్టమర్‌లతో మెరుగైన సంబంధాలను కలిగి ఉండాలని సీతారామన్‌ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ–అర్బన్‌ ప్రాంతాలలో ఉద్యోగులు తమ కస్టమర్లతో కనెక్ట్‌ అయ్యేలా చూడాలని ఆమె బ్యాంకులను కోరారు.

  • వడ్డీ రేటు విషయంలో ఆర్‌బీఐ బ్యాంకింగ్‌కు స్వేచ్ఛనిచ్చిందని, ఆ స్వేచ్ఛను ఉపయోగించి బ్యాంకులు డిపాజిట్లను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలని ఆమె సూచించారు.  

  • సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన ఆందోళనలు, ఆర్థిక రంగానికి ఎదురయ్యే నష్టాలపై కూడా ఈ సమీక్షా సమావేశం చర్చించింది.  

  • మోసం, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన సమస్యలు అలాగే మొండిబకాయిల సమస్యల పరిష్కారానికి సంబంధించి నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) పురోగతికి వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.

ప్రభుత్వ బ్యాంకుల పనితీరుపై హర్షం

2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం రూ. 1.4 లక్షల కోట్లను దాటింది. దాదాపు రూ.1 లక్ష కోట్ల అధిక బేస్‌పై గత ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కలిసి  2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.1,04,649 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. ఎక్స్ఛేంజీల్లో ప్రచురితమైన సంఖ్యల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ.141,203 కోట్ల మొత్తం లాభంలో మార్కెట్‌ లీడర్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వాటానే 40 శాతానికి పైగా ఉంది. ఎస్‌బీఐ ఆర్జిత లాభం రూ.61,077 కోట్లయితే, వార్షిక వృద్ధి 22 శాతం. 2022–23లో ఈ వృద్ధి రూ.50,232 కోట్లు. 2023–24 ఆరి్థక సంవత్సరం అన్ని వ్యాపార అంశాల్లో బ్యాంకింగ్‌ మెరుగైన పనితీరును ప్రదర్శించడంపట్ల తాజా సమీక్షా సమావేశంలో హర్షం వ్యక్తం అయ్యింది. నికర మొండిబకాయిలు 0.76 శాతానికి తగ్గడం, మూలధన నిష్పత్తి తగిన స్థాయిలో 15.15 శాతంగా నమోదుకావడం, నికర వడ్డీ మార్జిన్లు (ఎన్‌ఐఎం) 3.22 శాతంగా నమోదుకావడం, షేర్‌ హోల్డర్లకు రూ.27,830 కోట్ల డివిడెండ్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ సానుకూల అంశాలు మార్కెట్ల నుండి మూలధనాన్ని సేకరించే విషయంలో ప్రభుత్వ బ్యాంకుల సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచాయని సమీక్షా సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో డీఎఫ్‌ఎస్‌ సెక్రటరీ వివేక్‌ జోషి, సెక్రటరీ డిజిగ్నేటెడ్‌ ఎం నాగరాజు,  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ (డీఎఫ్‌ఎస్‌) సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

అధిక వడ్డీ మార్గాలపై యువత దృష్టి: ఎస్‌బీఐ

దేశంలోని యువ జనాభా బ్యాంకింగ్‌ డిపాజిట్లపై కాకుండా అధిక వడ్డీరేటు లభించే ఇతర మార్గాలను అన్వేషిస్తోందని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్థికవేత్తల నివేదిక తాజాగా పేర్కొంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలోని దాదాపు సగం టర్మ్‌ డిపాజిట్లు సీనియర్‌ సిటిజన్‌లవేనని పేర్కొన్న నివేదిక, రుణ వృద్ధి రేటుతో పోటీగా డిపాజిట్ల వృద్ధి రేటుకు దోహదపడ్డానికి డిపాజిట్లపై పన్ను విధానంలో మార్పులు అవసరమని స్పష్టం చేసింది. కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే, డిపాజిట్ల వృద్ధి రూ.61 లక్షల కోట్లయితే, రుణ వృద్ధి 59 లక్షల కోట్లుగా ఉందని పేర్కొనడం గమనార్హం. గడచిన 26 నెలల్లో డిపాజిట్ల స్పీడ్‌ మందగమనం ఉందని ఆర్‌బీఐ 2024 జూన్‌లో విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ, గడచిన కాలం చూస్తే మూడు నుంచి నాలుగేళ్లు డిపాజిట్ల వృద్ది రేటుకన్నా, రుణ వృద్ధి స్పీడ్‌గా ఉన్న చరిత్ర ఉందని నివేదిక పేర్కొంది. ఈ లెక్కన తాజా పరిస్థితి (డిపాజిట్ల మందగమనం) 2025 జూన్‌–అక్టోబర్‌ మధ్య ముగిసే అవకాశం ఉందని అంచనావేసింది.  

తాజా డిపాజిట్‌–రుణ పరిస్థితి ఇదీ..

ఈ ఏడాది జూలై 12 నాటికి వార్షికంగా చూస్తే, బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 11 శాతానికి పరిమితమైంది. అయితే, రుణ వృద్ధి మాత్రం 14 పైగా శాతంగా నమోదైంది. దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణ, డిపాజిట్‌ వృద్ధిలో ఇంత తేడా రావడం గడిచిన 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుత తక్కువ వడ్డీ రేట్లతో రిటైల్‌ డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు కష్టతరంగా మారిందన్నది ప్రధాన  విశ్లేషణ.  

ఆర్‌ఆర్‌బీల సేవలు పెరగాలి

సూక్ష్మ, లఘు, మధ్య, చిన్న తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రొడక్టులను రూపొందించాలని ప్రాంతీయ గ్రామీ ణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ), వాటి స్పాన్సర్డ్‌ బ్యాంకుల సీఈఓలకు ఆర్థిక మంత్రి ఈ సమీక్షా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. వాటికి రుణ లభ్యత సకాలంలో లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రుణ ఫోర్ట్‌ఫోలియోను పెంచడానికి అపారమైన అవకాశాలు ఉన్న వస్త్ర, చెక్క ఫర్నీచర్‌, తోలు, ఆహార ప్రాసెసింగ్‌ వంటి  చిన్న సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. అలాగే సాంకేతిక రంగంలో పురోగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలనీ ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement