న్యూఢిల్లీ: రుణాల పెరుగుదల డిపాజిట్ వృద్ధిని మించిపోతోందని, ఇది బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతా) సవాళ్లకు దారితీయవచ్చని ఫిక్కీ–ఐబీఏ నివేదిక ఒకటి పేర్కొంది. రుణ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను పెంచడం అలాగే రుణ రేటును తక్కువగా ఉంచడం బ్యాంకుల ఎజెండాలో అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) విభాగం వాటా తగ్గినట్లు సర్వేలో పాల్గొన్న బ్యాంకుల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ తెలియజేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు సహా మొత్తం 22 బ్యాంకులు (మొత్తం అసెట్ పరిమాణంలో వీటి వాటా 67 శాతం) ఈ సర్వేలో పాల్గొన్నాయి. 2024 జనవరి నుంచి జూన్ మధ్య జరిగిన ఈ 19వ దఫా ఫిక్కీ–ఐబీఏ సర్వే నివేదికలో వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్ని..
- 2024 ప్రథమార్థంలో 80 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు కాసా డిపాజిట్ల వాటా తగ్గుదలను నమోదుచేసుకోగా, సగానికి పైగా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇదే విషయాన్ని తెలిపాయి. అయితే అధిక, ఆకర్షణీయమైన రేట్ల కారణంగా టర్మ్ డిపాజిట్లు వేగం పుంజుకున్నాయి.
- సర్వేలో 71% బ్యాంకులు గత ఆరు నెలల్లో మొండిబకాయిల స్థాయిలు తగ్గిన్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల రేటు 90 శాతంగా ఉంటే, ప్రైవేటు రంగ బ్యాంకుల రేటు 67 శాతంగా ఉంది.
- మౌలిక సదుపాయాలు, లోహాలు, ఇనుము, ఉక్కు వంటి రంగాల్లో వృద్ధికి తగినట్లుగా దీర్ఘకాలిక రుణ డిమాండ్ కనబడుతోంది. ప్రత్యేకించి మౌలిక విభాగం పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ రంగానికి రుణ డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు సర్వేలో 77% బ్యాంకులు వెల్లడించాయి.
- బ్యాంకులు– ఫిన్‌టెక్ కంపెనీల మధ్య భాగస్వామ్యం– నూతన ఆవిష్కరణలు, సేవల విస్తృతి, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవడం వంటి సానుకూల చర్యలకు దోహదపడుతుంది.
ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్
- ఏటీఎం చానెల్ నిర్వహణ విషయంలో వ్యయాలు తగ్గాలి. వ్యూహాత్మక స్థానాలను ఎంచుకోవడం, ఏటీఎం లావాదేవీల కోసం ఇంటర్‌ఛేంజ్ ఫీజులను పెంచడం, వ్యయాలు– ప్రయోజనాలను విశ్లేషించడం, సాంకేతికతను పెంచడం వంటి పలు కీలక సూచనలను బ్యాంకర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment