ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్‌ఎఫ్‌బీ) రుణ వృద్ధి 25–27 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 28 శాతంగా నమోదైంది. ఎస్‌ఎఫ్‌బీలు విభాగాలవారీగా, భౌగోళికంగా కార్యకలాపాలు విస్తరిస్తే రుణ వృద్ధి మెరుగుపడుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదిక పేర్కొంది.
క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఎస్‌ఎఫ్‌బీల మూలధన నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్పటికీ తక్కువ వ్యయాలతో డిపాజిట్లను సేకరించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో రుణ వృద్ధికి అవసరమయ్యే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ, డిపాజిట్‌యేతర వనరులను అన్వేషిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా ఉన్న సూక్ష్మరుణాలతో పాటు తనఖాలు, అన్‌సెక్యూర్డ్ రుణాలు మొదలైన కొత్త మార్గాల్లో రుణ వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు చిన్న బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని నివేదిక తెలిపింది. కొత్త అసెట్స్ విభాగాల్లో రుణ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 40 శాతం వరకు ఉండొచ్చని, సంప్రదాయ విభాగాల్లో ఇది 20 శాతంగా ఉండొచ్చని సంస్థ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు.
ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ కస్టమర్లకు యాపిల్ కంటెంట్
మరిన్ని విశేషాలు..
నెట్‌వర్క్‌పరంగా ఎస్‌ఎఫ్‌బీల బ్రాంచీల సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి రెట్టింపై 7,400కి చేరింది.
తూర్పు రాష్ట్రాల్లో శాఖల సంఖ్య అత్యధికంగా ఉంది. 2019 మార్చి నాటికి మొత్తం శాఖల్లో తూర్పు రాష్ట్రాల్లో 11 శాతం ఉండగా ప్రస్తుతం ఇది 15 శాతానికి పెరిగింది. సగానికి పైగా శాఖలు, గణనీయంగా వృద్ధి అవకాశాలున్న గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బ్యాంకింగ్ రంగానికి పూర్తి భిన్నంగా, ఎస్‌ఎఫ్‌బీల్లో రుణ వృద్ధికన్నా బల్క్ డిపాజిట్ల వృద్ధి 30 శాతం అధికంగా నమోదైంది.
2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ డిపాజిట్లు 22 శాతమే. చౌకగా ఉండే కరెంట్–సేవింగ్స్ డిపాజిట్ల వాటా 35 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది.
ఎస్‌ఎఫ్‌బీలు టర్మ్ డిపాజిట్లపై ఆధారపడటం ఇకపైనా కొనసాగనుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీ లోన్ల విభాగంలో రూ.6,300 కోట్ల లావాదేవీలు జరగ్గా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,000 కోట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment