రైతు భూమిలో బ్యాంకు ఫ్లెక్సీ! | Bank flexi in farmers land | Sakshi

రైతు భూమిలో బ్యాంకు ఫ్లెక్సీ!

Jun 14 2024 3:47 AM | Updated on Jun 14 2024 3:47 AM

Bank flexi in farmers land

అప్పు చెల్లించకుంటే వేలం వేస్తామంటూ హెచ్చరిక 

పోల్కంపేట గ్రామ రైతుల ఆందోళన 

అడ్డగోలుగా పెరిగిన వడ్డీ తగ్గించాలని విజ్ఞప్తి 

సాక్షి, కామారెడ్డి/లింగంపేట:  జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంపై బ్యాంకు అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. తనఖా పెట్టిన భూములను వేలం వేస్తామంటూ ఆ భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలోని పోల్కంపేట, పర్మల్ల, శెట్పల్లి సంగారెడ్డి తదితర గ్రామాల రైతులు 2010 ప్రాంతంలో పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. 

కొందరు కొన్ని వాయిదాలు చెల్లించి మానుకోగా, మరికొందరు అసలే చెల్లించలేదు. కొందరు మాత్రం పూర్తిగా చెల్లించారు. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు కొన్నేళ్లుగా రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులిచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. అయితే అప్పులు తీసుకుని పది పదిహేనేళ్లు కావడంతో వడ్డీలు పెరిగిపోయాయి. అప్పట్లో రూ.5 లక్షలు అప్పు తీసుకుంటే ఇప్పుడది రూ.15 లక్షలు దాటింది. 

ఇంత పెద్ద మొత్తం చెల్లించడం రైతులకు భారంగా మారింది. వడ్డీ తగ్గించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అప్పులు చెల్లించడం లేదంటూ బ్యాంకర్లు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. పోల్కంపేటలో ఓ రైతు పొలంలో భూమిని వేలం వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా ఆందోళనకు గురవుతున్నారు. వడ్డీలు తగ్గిస్తే అప్పు తిరిగి చెల్లిస్తామని పేర్కొంటున్నారు. 

చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నాం 
బ్యాంకుకు భూమి తనఖా పెట్టి అప్పు తీసుకున్న రైతు తిరిగి చెల్లించకపోవడమే గాక, ఆ భూమిని అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. బ్యాంకు తనఖాలో ఉన్న భూమిని ఎలా అమ్ముకుంటారు? ఆ భూమిపై బ్యాంకుకే హక్కు ఉంటుంది. 

లింగంపేట మండలంలో దాదాపు 7 వందల మంది రైతులు దీర్ఘకాలిక రుణాలు తీ సుకున్నారు. వారిలో చాలామంది అప్పులు తి రిగి చెల్లించలేదు. సహకార చట్టం ప్రకారం వా రందరికీ నోటీసులిచ్చాం. వారి ఆస్తులను జప్తు చేయడం, లేదా వేలం వేయడం జరుగుతుంది.  – కుమారస్వామి, బ్రాంచి మేనేజర్, ఎన్‌డీసీసీబీ, లింగంపేట  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement