న్యూఢిల్లీ: కేంద్రం అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) లాభాలు గత తొమ్మిదేళ్లలో మూడు రెట్లు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడేలా భవిష్యత్‌లోనూ ఈ ధోరణిని పీఎస్‌బీలు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,270 కోట్లుగా ఉన్న పీఎస్‌బీల లాభాలు 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయి.
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఈ విజయాలను చూసి పొంగిపోతూ పీఎస్‌బీలు అలసత్వం వహించరాదని, అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలను, నియంత్రణ సంస్థ నిబంధనలను, పటిష్టమైన అసెట్–లయబిలిటీ .. రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలను పాటిస్తూ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆమె సూచించారు. గతంలో ఇటు బ్యాంకులు అటు కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లూ ఒత్తిడిలో ఉండేవని .. ప్రస్తుతం అటువంటి పరిస్థితి నుంచి బైటపడ్డాయని మంత్రి చెప్పారు.
బ్యాంకుల అసెట్లపై రాబడులు, నికర వడ్డీ మార్జిన్లు, ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి మొదలైనవన్నీ మెరుగుపడ్డాయన్నారు. రుణాల వినియోగం జాతీయ సగటుకన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలపై, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై, బ్యాంకులు ప్రధానంగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. అలాగే, ప్రత్యేక డ్రైవ్‌లు, ప్రచార కార్యక్రమాల ద్వారా మహిళా సమ్మాన్ బచత్ పత్రాలకు ప్రాచుర్యం కలి్పంచాలని చెప్పారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాల కోసం ఉద్దేశించిన నిధులను గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి బదలాయించడం కాకుండా, ఆయా లక్ష్యాల సాధన కోసం పూర్తి స్థాయిలో వినియోగించడంపై దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment