ఇన్ ఫ్రాకు బూస్ట్
రూ. 2.21 లక్షల కోట్ల కేటాయింపు
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే క్రమంలో.. బడ్జెట్‌లో ఇన్‌ఫ్రా రంగానికి రూ. 2.21 లక్షల కోట్లు కేటాయించారు అరుణ్ జైట్లీ. వృద్ధికి అవరోధాల తొలగింపునకు చర్యలు, సంస్కరణలతో పాటు అదనపు నిధుల ఊతంతో ఇన్‌ఫ్రా రంగం మెరుగుపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్రియాశీలక చర్యలతో 2015లో అత్యధిక సంఖ్యలో రహదారుల కాంట్రాక్టులు ఇవ్వడం జరిగిందని, వృద్ధిని సూచిస్తూ వాహన విక్రయాలు సైతం అత్యధికంగా నమోదయ్యాయని జైట్లీ చెప్పారు.
2016-17కి సంబంధించి ఇన్‌ఫ్రాకు మొత్తం రూ. 2.21 లక్షల కోట్లు కేటాయించగా, ఇందులో సింహభాగం రూ. 2.18 లక్షల కోట్లు రహదారులు, రైల్వేలకే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిల్చిపోయిన 70 రహదారి ప్రాజెక్టుల్లో దాదాపు 85 శాతం ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కాయని పేర్కొన్నారు. దాదాపు 8,003 కి.మీ. ఈ ప్రాజెక్టుల పెట్టుబడుల విలువ సుమారు రూ. 1 లక్ష కోట్లు ఉంటుందన్నారు. జాతీయ రహదారుల భారీగా నిధులు కేటాయించారు. ఇన్‌ఫ్రాకు కూడా కొత్తగా క్రెడిట్ రేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. అటు పోర్టులకు ఊతమిచ్చేలా సాగర్‌మాలా ప్రాజెక్టుకు రూ. 8,000 కోట్లు కేటాయించారు.
ప్రజా రవాణా వ్యవస్థకు మెరుగులు..
ప్రజా రవాణా వ్యవస్థలో పర్మిట్ల చట్టాలను తొలగించ డం మధ్యకాలిక లక్ష్యంగా జైట్లీ పేర్కొన్నారు. సామాన్య ప్రయాణీకుల సౌలభ్యం కోసం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి.. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వివిధ రూట్లలో బస్సులను నడపేందుకు అనుమతులిచ్చేలా మోటార్ వెహికల్ చట్టాల్లో మార్పులు తేనున్నట్లు ఆయన చెప్పారు. దీనితో ఈ విభాగంలో పెట్టుబడుల రాకతో పాటు యువతకు ఉపాధి కల్పన, స్టార్టప్ వ్యాపారవేత్తల అభివృద్ధి తదితర సానుకూల పరిణామాలు చోటు చేసుకోగలవన్నారు.