ముంబై: ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెరుగుతున్న కరోనా కేసుల భయం భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఫలితంగా బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్‌ఫ్రా రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 173 పాయింట్లు నష్టపోయి 39,750 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 11,700 దిగువున 11,671 వద్ద నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి క్షీణత కొనసాగడం, బ్లూచిప్ కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్ మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ గడువు ముగియడంతో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. రూపాయి పతనంతో ఒక్క ఐటీ షేర్లు స్వల్పంగా లాభాలను ఆర్జించగలిగాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,524 – 40,011 రేంజ్ కదలాడింది. నిఫ్టీ 11,606 – 11,744.15 పరిధిలో ఊగిసలాడింది.
దేశీయ స్టాక్ మార్కెట్ దృష్టి ఇప్పుడు కంపెనీల క్యూ2 ఫలితాల నుంచి అంతర్జాతీయ పరిణామాల వైపు మళ్లింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తిరిగి పెరగడం, అమెరికా ఎన్నికలపై, ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనపై సందిగ్ధత కొనసాగడం లాంటి ప్రతికూలాంశాలు ఇప్పుడిప్పుడే రికవరి అవుతున్న ఆర్థిక వ్యవస్థలో ఆందోళనలను రేకెత్తించాయి. ఈక్విటీల్లో నెలకొన్న బలహీనత స్వల్పకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీల ప్రకటనలతో పాటు వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో మార్కెట్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
బలహీనంగా ప్రపంచమార్కెట్లు...
అమెరికా అనిశ్చితులతో పాటు రోజు వారీగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రపంచమార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. కోవిడ్–19 కేసుల కట్టడికి యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో పాటు పలు దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు. లాక్‌డౌన్ విధింపుతో ఆర్థిక వృద్ధి ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లను కలవరపెట్టాయి. ఫలితంగా గురువారం ఆసియాలో ఒక్క చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల ఇండెక్స్‌లు 0.5% నుంచి 1% నష్టంతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు అరశాతం క్షీణించాయి.
5% నష్టపోయిన ఎల్ అండ్ టీ షేరు
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) షేరు గురువారం 5 శాతం పతనమైంది. క్యూ2 ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకదశలో 6 శాతం క్షీణించి రూ.927 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 5% పతనంతో రూ.935 వద్ద స్థిరపడింది.
రెండో రోజూ అమ్మకాలే..!
Published Fri, Oct 30 2020 5:15 AM | Last Updated on Fri, Oct 30 2020 5:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment