యూరప్‌లో రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌లు విధిస్తారనే భయాలు చెలరేగాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో 2 లక్షల కోట్ల డాలర్ల మేర అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా భారీగానే నష్టపోయింది. సెన్సెక్స్ 38 వేల పాయింట్ల ఎగువన నిలదొక్కుకోగలిగినా, నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు పడిపోయింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 812 పాయింట్ల నష్టంతో 38,034 పాయింట్ల వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు పతనమై 11,251 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 2 శాతం మేర క్షీణించాయి.
1,052 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్....
ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ బలహీనంగానే మొదలైంది. మధ్య మధ్యలో లాభాల్లోకి వచ్చినా, ఎక్కువ భాగం నష్టాల్లోనే ట్రేడైంది. యూరప్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఆరంభం కావడంతో మధ్యాహ్నం తర్వాత అమ్మకాల జోరు పెరిగింది. చివరి గంటలో నష్టాలు బాగా పెరిగాయి. ఒక దశలో 145 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, మరోదశలో 907 పాయింట్ల మేర పతనమైంది. మొత్తం మీద రోజంతా 1,052 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు– కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి.
► ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ 9 శాతం నష్టంతో రూ.560 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే కావడం గమనార్హం.
► మార్కెట్ భారీగా నష్టపోయినా దాదాపు 140 షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, వీఎస్‌టీ టిల్లర్స్, మైండ్ ట్రీ, లారస్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఎందుకీ పతనం..
బ్యాంకుల్లో భారీగా అక్రమ లావాదేవీలు...!
ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంక్‌లు 2 లక్షల కోట్ల డాలర్ల మేర అక్రమ లావాదేవీలకు పాల్పడ్డాయని ఇంటర్నేషనల్ కన్సార్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్(ఐసీఐజే) వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు పుట్టాయి. ఇక భారత్ విషయానికొస్తే, 2010–17 మధ్య ఇలాంటి అక్రమ లావాదేవీలు 400కు పైగా జరిగాయని వీటి విలువ వంద కోట్ల డాలర్ల మేర ఉంటుందని అమెరికాకు చెందిన ఫిన్‌సెన్(ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్) పేర్కొంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదం, డ్రగ్స్, ఆర్థిక అవకతవకలు తదితర అక్రమ లావాదేవీలు జరిగాయని పేర్కొంది. ఈ లావాదేవీల కారణంగా దేశంలోకి 48 కోట్ల డాలర్లు అక్రమంగా వచ్చాయని, 40 కోట్ల డాలర్లు వెళ్లాయని ఫిన్‌సెన్ పేర్కొంది. దాదాపు భారత్‌లోని అన్ని బ్యాంకులకు ఈ లావాదేవీల్లో ప్రమేయం ఉందన్న వార్తల కారణంగా బ్యాంక్ షేర్లు బాగా నష్టపోయాయి.
యూరప్‌లో మళ్లీ లాక్‌డౌన్!
రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో డెన్మార్క్, గ్రీస్, స్పెయిన్ దేశాల్లో తాజాగా ఆంక్షలు విధించారు. మరోవైపు రోజుకు 6,000 మేర కరోనా కేసులు నమోదవుతుండటంతో (మన దేశంలో రోజుకు లక్ష కరోనా కేసులు వస్తున్నాయి) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వచ్చాయి. దీంతో బెంబేలెత్తిన యూరప్ ఇన్వెస్టర్లు బ్యాంక్, టూరిజమ్, వినియోగ రంగ షేర్లను తెగనమ్మారు. ఆసియా మార్కెట్లు 1 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. ఆరంభంలోనే 3 శాతం మేర క్షీణించిన యూరప్ మార్కెట్లు చివరకు 4 శాతం నష్టాల్లో ముగిశాయి.
ప్రపంచ మార్కెట్ల పతనం...
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు ఆవిరి కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. అమెరికా తదుపరి సుప్రీంకోర్ట్ జడ్జి ఎవరనే విషయంలో డెమోక్రాట్లకు, రిపబ్లికన్‌లకు మధ్య పోరు తప్పదనే భయాలతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
నివురుగప్పిన నిప్పులా సరిహద్దు ఉద్రిక్తతలు...
సరిహద్దు ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తాజాగా భారత్–చైనాల మధ్య చర్చలు ప్రారంభమైనా, సరిహద్దుల్లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని, ఈ పరిస్థితి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోందని నిపుణులు అంటున్నారు.
పై స్థాయిల్లో లాభాల స్వీకరణ
ఈ గురువారమే ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటం, నిఫ్టీ కీలకమైన 11,500 పాయింట్ల రేంజ్‌లో ఉండటంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.
రూ. 4.23 లక్షల కోట్ల సంపద ఆవిరి...
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.4.23 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,23,140 కోట్లు దిగజారి రూ.154.76 లక్షల కోట్లకు
పడిపోయింది.
విలువలు అధికంగా ఉన్నాయ్..
షేర్ల విలువలు అసమంజసమైన స్థాయిల్లో ఉన్నాయని, ఈ విలువలను షేర్లు నిలుపుకోలేవన్న ఆందోళన నెలకొన్నదని జియోజిత్ ఫైనాన్షి యల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. కొంత కాలం పాటు మార్కెట్ అనిశ్చితిగానే ఉంటుందని, ఒడిదుడుకులు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment