పడేసిన ఫెడ్‌ ! | Sensex tumbles 323 pts as global markets reel on Fed outlook | Sakshi
Sakshi News home page

పడేసిన ఫెడ్‌ !

Published Fri, Sep 18 2020 6:45 AM | Last Updated on Fri, Sep 18 2020 6:45 AM

Sensex tumbles 323 pts as global markets reel on Fed outlook - Sakshi

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ అదనపు తాయిలాలను ప్రకటించకపోవడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా గురువారం పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 14  పైసలు క్షీణించి 73.66కు చేరడం, రిలయన్స్, టీసీఎస్‌ వంటి ఇండెక్స్‌ షేర్లలో అమ్మకాలు జరగడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి.  సెన్సెక్స్‌ 323 పాయింట్లు పడి 38,980 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 11,516 పాయింట్ల వద్ద ముగిశాయి.

మరో మూడేళ్లు సున్నా స్థాయిలోనే....
కీలకమైన వడ్డీరేట్లు మరో మూడేళ్లపాటు సున్నా స్థాయిలోనే కొనసాగుతాయని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలిచ్చింది. అదనపు ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వకపోవడం, పైగా భవిష్యత్తు  ఆర్థిక స్థితిగతుల అంచనాలపై తీవ్రమైన అనిశ్చితి నెలకొందని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమి పావెల్‌ వ్యాఖ్యానించారు. ఈ ప్రతికూల వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. ఆసియా మార్కెట్లు 1 శాతం మేర నష్టపోగా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.  

రోజంతా నష్టాలే....
ఆసియా మార్కెట్ల పతన ప్రభావంతో మన మార్కెట్‌ కూడా నష్టాల్లోనే మొదలైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. చివరి గంటలో అమ్మకాలు మరింత జోరుగా పెరిగాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, మార్కెట్‌ అనిశ్చితిగానే ఉంటుందని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.  

► బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.6,006 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
► దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, ఎస్‌ఆర్‌ఎఫ్‌ తదితర షేర్లు  ఈ జాబితాలో ఉన్నాయి.
► మార్కెట్‌ నష్టపోయినా, 288 షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. రామ్‌కో సిస్టమ్స్,  గంధిమతి అప్లయెన్సెస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.817ను తాకిన ఈ షేర్‌ చివరకు 2.3 శాతం లాభంతో రూ.808 వద్ద ముగిసింది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్‌ 13 శాతం లాభపడింది.  
► డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.4,845ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.4,826 వద్ద ముగిసింది.

ఒక్క రోజులో రూ.లక్ష కోట్లు ఆవిరి
నష్టాల కారణంగా ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.1,03,248 కోట్ల మేర తగ్గిపోయింది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ గురువారం ముగింపు నాటికి రూ.159,04,785 కోట్లుగా ఉంది. ‘‘మార్కెట్లు బుధవారం గడించిన లాభాలన్నింటినీ కోల్పోయాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా రోజులో కనిష్టాల వద్ద ముగిశాయి. ఆర్థిక రికవరీ విషయమై యూఎస్‌ ఫెడ్‌ ఆందోళన వ్యక్తం చేయడం మన మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యేందుకు దారి చూపింది. బెంచ్‌ మార్క్‌ సూచీలు రోజులో పలు విడతలు రికవరీకి ప్రయత్నించినప్పటికీ ఎగువ స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా కనిష్టానికి చేరాయి’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. ఆర్థిక రికవరీపై అనిశ్చితిని యూఎస్‌ ఫెడ్‌ వ్యక్తీకరించడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు చాయిస్‌ బ్రోకింగ్‌ ఈడీ సుమీత్‌ బగాడియా సైతం తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement