కొత్త ఏడాదిలో తొలి నష్టం | Sensex snaps 10-day winning run | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో తొలి నష్టం

Published Thu, Jan 7 2021 3:46 AM | Last Updated on Thu, Jan 7 2021 3:46 AM

Sensex snaps 10-day winning run - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో భారత స్టాక్‌ మార్కెట్‌ కొత్త ఏడాదిలో తొలిసారి నష్టాలతో ముగిసింది. అధిక వెయిటేజీ రిలయన్స్‌ షేరుతో పాటు ఐటీ, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల పదిరోజుల రికార్డు ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ డిసెంబర్‌లో 52.3గా నమోదై మూడునెలల కనిష్టానికి చేరుకోవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం స్థిరంగా అమ్మకాలు జరగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 264 పాయింట్లను కోల్పోయి 48,174 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 14,164 వద్ద నిలిచింది.

మార్కెట్‌ పతనంలోనూ మెటల్, ప్రైవేట్‌ రంగ బ్యాంక్, రియల్టీ, మీడియా షేర్లు రాణించాయి. మెరుగైన ఆర్థిక గణాంకాల నమోదుతో వ్యవస్థలో చురుగ్గా కార్యకలాపాలు జరగవచ్చనే అంచనాలతో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. క్యూ3లో కొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల రుణ వృద్ధి గణనీయంగా పెరిగిందని గణాంకాలు వెలువడంతో ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్‌ మారకంలో రూపాయి 6 పైసలు బలపడటం కాస్త కలిసొచ్చే అంశంగా ఉంది.  మరోవైపు పలు దేశాల ఈక్విటీ సూచీలు గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో  కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం జరిగింది. ఫలితంగా ఆసియాలో జపాన్‌తో సహా ప్రధాన దేశాల మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా పతనంలో ప్రారంభమై క్రమంగా నష్టాలను పూడ్చుకున్నాయి.

టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌.. టాటా దరఖాస్తు రూ. 9,997 కోట్లు
టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియలో ఆ కంపెనీ ప్రమోటర్‌ టాటా సన్స్‌ భారీ స్థాయిలో దరఖాస్తు చేసింది. టీసీఎస్‌ కంపెనీ రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ (తిరిగి కొనుగోలు) చేయనున్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా మొత్తం 5.33 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.3,000 ధరకు టీసీఎస్‌ కొనుగోలు చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా టీసీఎస్‌లో ఏకైక అత్యధిక వాటా గల టాటా సన్స్‌ కంపెనీ 3.33 కోట్ల షేర్లకు టెండర్‌ వేసింది. వీటి విలువ రూ.9,997 కోట్లని అంచనా.  గత నెల 18న మొదలైన ఈ షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 1న ముగసింది. గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి టీసీఎస్‌ నగదు నిల్వలు రూ.58,500 కోట్లు.  టీసీఎస్‌  2017, 2018ల్లో రూ.16,000 కోట్ల మేర షేర్లను బైబ్యాక్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement