గత 5 రోజుల్లో సెన్సెక్స్ 3,817 పాయింట్లు, నిఫ్టీ 1,159 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీలు 6% కుదేలవడంతో రూ.19.50 లక్షల కోట్లు ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.9.31 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. దీనితో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు చేరింది.
ముంబై: స్టాక్ మార్కెట్‌పై సోమవారం బేర్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూలతలను ఆసరా చేసుకొని వరుసగా ఐదో పంజా విసిరింది. బేర్ ఉగ్రరూపం దాల్చడంతో స్టాక్ సూచీలు రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీతో సెన్సెక్స్ 1,546 పాయింట్లు నష్టపోయి 58 వేల దిగువన 57,492 వద్ద స్థిరపడింది. నిప్టీ 468 పాయింట్లు క్షీణించి 17,149 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల ఇండెక్సులు ఆరుశాతం వరకు క్షీణించాయి. ముఖ్యంగా మధ్య, చిన్న తరహా షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు ఏకంగా నాలుగు శాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లూ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో సిప్లా, ఓఎన్‌జీసీ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,751 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ. 75 కోట్ల షేర్లను కొన్నారు.
ఇంట్రాడేలో 9 నెలల కనిష్టానికి...
సెన్సెక్స్ ఉదయం 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 59,023 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 17,575 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి గంటగంటకూ అమ్మకాల ఉధృతి పెరగడంతో సూచీలు అంతకంతా నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2053 పాయింట్లు నష్టపోయి 56,984 వద్ద, నిఫ్టీ 620 పాయింట్లు కోల్పోయి 16,997 వద్ద తొమ్మిది నెలల కనిష్టాన్ని తాకాయి. బీఎస్‌ఈ ఎక్సేంజీలో 872 షేర్లు షార్ట్ సర్క్యూట్‌ను తాకాయి. మూడువేలకు పైగా స్టాకులు నష్టాలపాలయ్యాయి. అయితే చివరి గంటలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడంతో సూచీలు 57 వేలు, నిఫ్టీ 17 వేలు స్థాయిలని నిలుపుకోలిగాయి.
పతనానికి కారణాలు
► అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మన మార్కెట్ ప్రతికూల సంకేతాలను అందుకుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం ప్రారంభానికి(నేటి నుంచి) ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. రష్యా–ఉక్రెయిన్ దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం, క్రూడ్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడం, కోవిడ్ తాజా విజృంభణ ప్రపంచ మార్కెట్లలోని సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
► జొమాటో, పేటీఎం పేలవం..
గతేడాది చివర్లో ఎక్సే్చంజీల్లో లిస్టయిన స్టార్టప్, టెక్ తరహా కంపెనీల భారీ పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బుల్ మార్కెట్ జోరులో లిస్టింగ్‌లో అదరగొట్టడంతో పాటు కొత్త తరం ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు చేయడంతో ఈ షేర్ల వ్యాల్యుయేషన్లు భారీగా పెరిగాయి. అయితే సంబంధిత కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. ఆల్‌టైమ్‌హై నుంచి కొంతకాలంగా పేటీఎం 60 శాతం, జొమాటో 50 శాతం, నైకా 30 శాతం, పాలసీ బజార్ 40 శాతం చొప్పున క్షీణించాయి.
► దేశీయ పరిణామాలు
దేశవ్యాప్తంగా రోజుకు సగటున మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని రా ష్ట్రాల ఆంక్షల కొనసాగింపు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
భారీగా నష్టపోయిన రిలయన్స్
డిసెంబర్ క్వార్టర్‌లో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించినప్పటికీ.., దేశీయ అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4% నష్టపోయి రూ. 2,377 వద్ద స్థిరపడింది. మార్కెట్ నష్టాల ట్రెండ్ అనుగుణంగా షేరులో లాభాల స్వీకరణ జరిగినట్లు నిపుణులు తెలిపారు. షేరు 4% పతనంతో ఆర్‌ఐఎల్ ఒక్కరోజే రూ.68,404 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది.
► మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో వొడాఫోన్ ఐడియా ఎనిమిది శాతం నష్టపోయి రూ.11 వద్ద స్థిరపడింది. ఒక దశలో పది శాతం పతనమై రూ.10.75 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
► న్యూ ఏజ్(కొత్త తరం) జొమాటో, నైనా షేర్లు 20 శాతం చొప్పున క్షీణించాయి.
► మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 20.84 శాతం ఎగసి 22.83 స్థాయికి చేరుకుంది.
ఐపీవోకు మాన్యవర్ రెడీ
సంప్రదాయ దుస్తుల బ్రాండ్ మాన్యవర్ మాతృ సంస్థ వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీవోలో భాగంగా కంపెనీ దాదాపు 3.64 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. కంపెనీ ఐపీవోకు అనుమతించమంటూ గతేడాది సెప్టెంబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ రవీ మోడీ ఫ్యామిలీ ట్రస్ట్ 1.81 కోట్ల షేర్లు.
అదే బాటలో డ్రీమ్‌ఫోక్స్
ఎయిర్‌పోర్ట్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 2.18 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ దేశీయంగా గ్లోబల్ నెట్‌వర్క్‌ల క్రెడిట్, డెబిట్ కార్డులుగల వినియోగదారులకు విమానాశ్రయ సంబంధ లాంజ్‌లు, ఆహారం, పానీయాలు, హోటళ్లు, బదిలీ తదితర పలు సేవలను అందిస్తోంది.
రూపాయి 3 వారాల కనిష్టం
డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు వారాల కనిష్టానికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో గత శుక్రవారం ముగింపుతో పోల్చితే 17పైసలు బలహీనపడి 74.60 వద్ద ముగిసింది. అధిక క్రూడ్ ధరలు, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి, ఫారిన్స్ ఫండ్స్ వెనక్కు మళ్లడం, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల వంటి అంశాలు దీనికి నేపథ్యం. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ).
నేటి బోర్డు మీటింగ్స్
మారుతీ సుజుకీ, సిప్లా, ఫెడరల్ బ్యాంక్, ఇక్రా, యూనిటెడ్ స్పిరిట్స్, మాక్స్ ఇండియా, పిడిలైడ్ ఇండస్ట్రీస్, రేమాండ్, సింఫనీ, స్టార్ సిమెంట్
ఐదోరోజు అమ్మకాలే? రూ.19.50 లక్షల కోట్లు హాంఫట్ !
Published Tue, Jan 25 2022 1:05 AM | Last Updated on Tue, Jan 25 2022 8:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment