ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య విధాన ప్రకటన తర్వాత సూచీల జీవితకాల గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ జరిగింది. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రెండుశాతం పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ మిశ్రమ సంకేతాలు అందాయి. ఫలితంగా సూచీలు ఈ వారంలో తొలిసారి నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సరికి శుక్రవారం సెన్సెక్స్ 215 పాయింట్లను కోల్పోయి 54,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్లు క్షీణించి 16,238 వద్ద ముగిశాయి. ఫార్మా, ఇన్ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో విక్రయాలు జరిగాయి.
మెటల్, ఆటో, ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు ఆర్థికవేత్తల అంచనాలకు తగ్గట్లే ఉన్నప్పటికీ.., భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరగవచ్చనే ఆందోళనలను వ్యక్తం చేసింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చర్యలను క్రమంగా ఉపసంహరించుకోవచ్చనే అంచనాలతో బుల్స్ వెనకడుగేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 423 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 113 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. పలు దేశాల్లో డెల్టా వేరియంట్ కోవిడ్ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రెండు పైసలు బలపడి రూ.74.15 వద్ద స్థిరపడింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలు కలిసిరావడంతో ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1,691 పాయింట్లు, నిఫ్టీ 475 పాయింట్లను ఆర్జించాయి.
రిలయన్స్–ఫ్యూచర్ షేర్లకు ‘సుప్రీం’ షాక్...
ఫ్యూచర్ రిటైల్‌ను కొనగోలు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కుదుర్చుకున్న డీల్‌ను తప్పుబడుతూ సుప్రీం కోర్టు అమెజాన్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో రిలయన్స్ షేర్లు 2% నష్టంతో రూ.2089 వద్ద ముగిశాయి. అలాగే ఫ్యూచర్ రిటైల్ షేరు 10% పతనమై రూ.52.55 లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యింది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రెజెస్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ కంపెనీల షేర్లు కూడా 10% లోయర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యాయి. ఫ్యూచర్ కన్జూమర్ షేరు తొమ్మిది శాతం నష్టంతో రూ.7 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment