వెంటాడిన కరోనా భయం | Sensex plunges 562 pts on 2nd Covid wave,Nifty ends barely above 14,700 | Sakshi
Sakshi News home page

వెంటాడిన కరోనా భయం

Published Thu, Mar 18 2021 1:41 AM | Last Updated on Thu, Mar 18 2021 1:42 AM

Sensex plunges 562 pts on 2nd Covid wave,Nifty ends barely above 14,700 - Sakshi

ముంబై: భారత్‌లో రెండోదశ కరోనా కేసుల విజృంభణ స్టాక్‌ మార్కెట్‌ను కలవరపరిచింది. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.., కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేయడం ఈక్విటీ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ఏడాదిలోనే అత్యధికంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 29 వేల మందికి వ్యాధి సోకడంతో లాక్‌డౌన్‌ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. అలాగే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధాన ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు.

అంతర్జాతీయంగా మండుతున్న ముడిచమురు ధరల సెగలు కూడా మార్కెట్‌ను తాకాయి. అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు తలెత్తడంతో బుధవారం సెన్సెక్స్‌ 562 పాయింట్లను కోల్పోయి 50 వేల దిగువున 49,801 వద్ద ముగిసింది. నిఫ్టీ 189 పాయింట్లను నష్టపోయి 14,721 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. ఈ నాలుగు ట్రేడింగ్‌ సెషన్‌లో సెన్సెక్స్‌ 1,478 పాయింట్లు, నిఫ్టీ 454 పాయింట్లను కోల్పోయాయి. ఆర్థిక, బ్యాంకింగ్‌ షేర్లలో తలెత్తిన అమ్మకాలు సూచీల భారీ పతనాన్ని శాసించాయి. సెన్సెక్స్‌ సూచీలో మొత్తం 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు, నిఫ్టీ–50 ఇండెక్స్‌లో కేవలం రెండు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మార్కెట్‌ పతనంతో బుధవారం ఒక్కరోజే రూ.3.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.

ఫలితంగా బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.203.67 లక్షల కోట్లకు దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2626 కోట్ల విలువైన షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.562 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పెరుగుతున్న యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ నియంత్రణకు ఫెడ్‌ ఎలాంటి చర్యలు చేపట్టనుందోనని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ట్రేడ్‌ కదలాడాయి.  ‘‘దేశవ్యాప్తంగా పడగ విప్పుతున్న కరోనా కేసులు మార్కెట్‌ వర్గాలను భయపెట్టాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ విధాన నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 73 పాయింట్లు పెరిగి 50,436 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 14,947 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

లక్ష్మీ ఆర్గానిక్‌ ఐపీవో భల్లేభల్లే
స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ చేపట్టిన పబ్లిక్‌ ఇష్యూ సూపర్‌ సక్సెస్‌ను సాధించింది. ఇష్యూ చివరి రోజు బుధవారానికి ఏకంగా 106 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ దాదాపు 3.26 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా.. 347 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి.  షేరుకి రూ. 129–130 ధరలో చేపట్టిన ఐపీవో ద్వారా లక్ష్మీ ఆర్గానిక్‌ రూ. 600 కోట్లు సమకూర్చుకుంది.

క్రాఫ్ట్స్‌మ్యాన్‌ ఆటోమేషన్‌ ఓకే
క్రాఫ్ట్స్‌ మ్యాన్‌ ఆటోమేషన్‌ చేపట్టిన పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు బుధవారానికి 3.81 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. కంపెనీ దాదాపు 38.7 లక్షల షేర్లను ఆఫర్‌ చేయగా.. 1.47 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. షేరుకి రూ. 1488–1490 ధరలో చేపట్టిన ఐపీవో ద్వారా రూ. 824 కోట్లు సమకూర్చుకుంది.

ఐపీవోకు ఆదిత్య బిర్లా ఏఎంసీ...
ఆదిత్య బిర్లా క్యాపిటల్‌.. తన అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఫండ్స్‌ సేవల సంస్థ) ఐపీవోకు వెళ్లేందుకు ఆమోదం తెలియజేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement