ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో భారత స్టాక్ మార్కెట్‌పై బేర్ ట్రేడర్లు నెమ్మదిగా పట్టు సాధిస్తున్నారు. ముడిచమురు ధరల సెగలు, అధిక వ్యాల్యుయేషన్ ఆందోళనలను ఆసరా చేసుకొని ట్రేడర్లు నాలుగో రోజూ అమ్మకాలు జరిపారు. దీంతో నాలుగు రోజుల్లోనే సెన్సెక్స్ 1265 పాయింట్లు, నిఫ్టీ 333 పాయింట్లను కోల్పోయాయి. ఈ క్రమంలో నిఫ్టీ 15 వేల స్థాయిని, సెన్సెక్స్ 51 వేల స్థాయిని పోగొట్టుకున్నాయి. ఇక శుక్రవారం విషయానికొస్తే.., మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కోవిడ్–19 కేసులు మళ్లీ అధికమవుతుండటం వల్ల, ఆర్థిక రికవరీపై ప్రభావం పడొచ్చన్న భయాలను మార్కెట్‌ను వెంటాడాయి.
దీనికి తోడు బలహీన అంతర్జాతీయ సంకేతాలు జతకలవడంతో అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 435 పాయింట్ల నష్టంతో 50,889 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 137 పాయింట్లు పతనమై 14,981 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల కోల్పోయి 50,624 వద్ద, నిఫ్టీ 221 పాయింట్ల మేర నష్టపోయి 14,898 స్థాయిని ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకాయి. మార్కెట్ భారీ పతనంతో బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.1.88 లక్షల కోట్లు తగ్గి రూ.204 లక్షల కోట్లకు చేరింది. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్లును కోల్పోయింది.
‘‘ దేశీయ మార్కెట్లో అనిశ్చితి పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాల కారణంగా కన్సాలిడేషన్ కొనసాగింది. ఆర్థిక రికవరీ వేగంగా జరుగుతున్న తరుణంలో భారత పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 5.76 శాతం నుంచి 6.13 శాతానికి ఎగసింది. ఒక శాతం కన్నా తక్కువగా ఉండే అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 1.29 శాతానికి పెరగింది. మరోవైపు కమోడిటీ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక గణంకాలు నిరుత్సాహపరిచాయి. ఈ ప్రతికూలాంశాలన్నీ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంట్ విశ్లేషకుడు రస్మిక్ ఓజా అభిప్రాయపడ్డారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రెండు శాతం నుంచి నాలు గు శాతం పతనం కావడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2% నష్టపోయింది.
► మునుపటి సెషన్‌లో ఎనిమిది శాతం లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచిన ఓఎన్‌జీసీ షేరులో లా భాల స్వీకరణ చోటుచేసుకుంది. చివరికి ఐదు శాతం నష్టపోయి రూ.105 వద్ద స్థిరపడింది.
► పెట్రో కెమికల్ వ్యాపారాన్ని వేరు చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోందనే వార్తలతో రిలయన్స్ కంపెనీ షేరు ఒకశాతం లాభంతో రూ.2,080 వద్ద ముగిసింది.
► నష్టాల మార్కెట్లోనూ బీఎస్‌ఈలో అదానీ పోర్ట్స్, గెయిల్, హిందాల్కో, హెచ్‌పీసీఎల్, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, టాటా పవర్‌తో సహా 249 షేర్లు ఏడాది గరిష్టాన్ని అందుకున్నాయి.
► మార్కెట్లో అనిశ్చితి సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ 3.30 శాతం నుంచి 22.25 స్థాయికి చేరుకుంది.
ప్రభుత్వ బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ...
ప్రైవేటీకరణ ఆశలతో ఈ వారం ఆరంభం నుంచి బేరిష్ ట్రెండ్‌కి ఎదురీదుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు సైతం నష్టాలను చవిచూశాయి. ఈ రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మహారాష్ట్ర బ్యాంక్, ఐఓబీ, యూకో బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు 10 శాతం నుంచి ఐదు శాతం నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ, పీఎన్‌బీ బ్యాంక్ షేర్లు ఐదుశాతం నుంచి మూడున్నర శాతం పతనమయ్యాయి. ఫలితంగా గడిచిన రెండు రోజుల్లో 12 శాతం ర్యాలీ చేసిన పీఎస్‌యూ ఇండెక్స్ శుక్రవారం ఒక్కరోజే ఐదు శాతం క్షీణించింది.
Comments
Please login to add a commentAdd a comment