Nifty: కొనుగోళ్లు కొనసాగాయ్‌..! | Nifty ends above 14,600, Sensex gains 424 pts led by pharma, financials | Sakshi
Sakshi News home page

Nifty: కొనుగోళ్లు కొనసాగాయ్‌..!

Published Fri, May 7 2021 6:03 AM | Last Updated on Fri, May 7 2021 8:39 AM

Nifty ends above 14,600, Sensex gains 424 pts led by pharma, financials - Sakshi

ముంబై: వ్యాక్సినేషన్‌ వేగవంతంపై ఆశలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో రెండోరోజూ కొనుగోళ్లు కొనసాగాయి. మెటల్, ఆటో, ఐటీ, ఆర్థిక రంగాల షేర్లు రాణించడంతో గురువారం సెన్సెక్స్‌ 272 పాయింట్లు పెరిగి 48,950 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 107 పాయింట్లు ఎగసి 14,725 వద్ద నిలిచింది. కోవిడ్‌ టీకా తయారీ వేగవంతం కోసం వర్తక సంబంధిత మేధో హక్కుల నిబంధనలను రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం మద్దతు తెలిపింది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్‌ లాంటి వర్ధమాన దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందనే ఆశలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు తెరతీశారు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి.

డాలర్‌ మారకంలో రూపాయి విలువ 13 పైసలు బలపడటం కలిసొచ్చింది. మార్చి క్వార్టర్‌ ఫలితాలు అంచనాలకు మించి నమోదు అవుతుండటంతో మెటల్‌ షేర్లు మెరిశాయి. ఐటీ, ఆటో రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. అయితే ఫార్మా, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 334 పాయింట్లు ర్యాలీ చేసి 49వేల పైకి 49,011 స్థాయిని అందుకుంది. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 14,744 వద్దకు చేరుకుంది. నాలుగు రోజుల వరుస విక్రయాల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు తొలిసారి నికర కొనుగోలుదారులుగా మారి రూ.1,223 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.633 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

‘కేసుల పెరుగుదలతో నిరాశలో కూరుకుపోయిన మార్కెట్‌ వర్గాలకు వ్యాక్సినేషన్‌ వేగవంతానికి యూఎస్‌ తీసుకున్న చర్యలు ఊరటనిచ్చాయి. అయితే ఐదురోజుల పతనం తర్వాత వ్యాధి సంక్రమణ రేటు పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది.  ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించవచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. రానున్న రోజుల్లో్ల నిఫ్టీ 14,800 –14,900 స్థాయి పరిధిలో కీలకమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’

ఐపీవోకు నిర్మా గ్రూప్‌ కంపెనీ రెడీ
న్యువోకో విస్టాస్‌ ప్రాస్పెక్టస్‌ దాఖలు
సిమెంట్‌ రంగ కంపెనీ న్యువోకో విస్టాస్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా కర్సన్‌భాయ్‌ పటేల్‌కు చెందిన నిర్మా గ్రూప్‌.. సిమెంట్‌ కంపెనీ రూ. 5,000 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 1,500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్‌ నియోగీ ఎంటర్‌ప్రైజెస్‌ మరో రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని అమ్మకానికి ఉంచనుంది. పబ్లిక్‌ ఇష్యూ నిధులలో రూ. 1,500 కోట్లను నిర్ణీత రుణాల చెల్లింపులతోపాటు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో న్యువోకో విస్టాస్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement