IHS
-
ఏప్రిల్‌లో స్తంభించిన తయారీ
న్యూఢిల్లీ: తయారీ పరిశ్రమ ఉత్పత్తి ఏప్రిల్‌లో దాదాపు మార్చి స్థాయిలోనే నిలిచింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో 55.5 వద్ద ఉంది. మార్చిలో ఇండెక్స్ 55.4 వద్ద (ఎనిమిది నెలల కనిష్ట స్థాయి) ఉంది. దాదాపు యథాతథ స్థితికి కరోనా వైరెస్ సెకండ్‌వేవ్ సృష్టించిన అనిశ్చితి వాతావరణమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. సూచీ 50లోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఆపై వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. తాజా సమీక్షా నెల్లో కొత్త ఆర్డర్లలో వృద్ధి నమోదుకాలేదు. ముడి పదార్థాల ధరల స్పీడ్... 2014 జూలై తరువాత ఎన్నడూ లేనంత వేగంగా ముడి పదార్థాల ధరలు పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియన్నా డి లిమా పేర్కొన్నారు. కాగా ఏప్రిల్‌లో వరుసగా ఎనిమిదవ నెల ఎగుమతుల ఆర్డర్లు పెరిగినట్లు డి లిమా వెల్లడించారు. భారతీయ వస్తువులకు అంతర్జాతీయ డిమాండ్ దీనికి ప్రధాన కారణమని తెలిపారు. ఇక తయారీ రంగంలో వరుసగా 13వ నెలా ఉపాధి అవకాశాలు తగ్గాయని వెల్లడించారు. తయారీకి సంబంధించి పీఎంఐ సూచీ 50పైన కొనసాగడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. -
డిసెంబర్లో నెమ్మదించిన ‘సేవలు’
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం డిసెంబర్లో మందగించింది. ఇందుకు సంబంధించి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 52.3గా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ సూచీ 53.7 వద్ద ఉంది. అమ్మకాల్లో వృద్ధి మందగించడం దీనికి ప్రధానకారణమని ఆర్థిక సమాచార సేవల దిగ్గజ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీనా డీ లిమా పేర్కొన్నారు. నిజానికి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీని ప్రాతిపదికన డిసెంబర్ వరకూ వరుసగా మూడవనెల బిజినెస్ యాక్టివిటీ సూచీ వృద్ధి ధోరణిలోనే ఉంది. బలహీన వ్యాపార ఆశావాద పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్లో ఉపాధి కల్పన తగ్గిందని, అమ్మకాలు మూడు నెలల కనిష్టానికి పడ్డాయనీ పోలీనా డీ లిమా వివరించారు. బ్రిటన్ కొత్త స్ట్రెయిన్, దీనితో తిరిగి గ్లోబల్ కోవిడ్–19 ప్రయాణపు ఆంక్షలు, డిమాండ్ పరిస్థితులపై ఆయా అంశాల ప్రతికూల ప్రభావం, 2020 చివరిలో భారత్ సేవల రంగాన్ని నెమ్మదింపజేసి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సేవలు, తయారీ రెండూ కలిపినా తగ్గుదలే! కాగా సేవలు, తయారీ రెండు రంగాలూ కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా నవంబర్‌తో పోల్చితే డిసెంబర్లో 56.3 నుంచి 54.9కి పడిపోయింది. ‘‘అయితే 2021లో ఉత్పత్తి పెరుగుతుందన్న ఆశావహ అంచనాలను కంపెనీలు కొనసాగిస్తున్నాయి. అయితే 2021 తొలి కాలంలో సవాళ్లు కొనసాగుతాయి. అయితే అటు తర్వాత సుస్థిర రికవరీ కొనసాగుతుంది. కోవిడ్–19 లభ్యత ఒకసారి ప్రారంభమైన తర్వాత మరింతగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి’’ అని పోలీనా డీ లిమా పేర్కొన్నారు. -
కొత్త ఏడాదిలో తొలి నష్టం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో భారత స్టాక్ మార్కెట్ కొత్త ఏడాదిలో తొలిసారి నష్టాలతో ముగిసింది. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరుతో పాటు ఐటీ, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల పదిరోజుల రికార్డు ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ డిసెంబర్లో 52.3గా నమోదై మూడునెలల కనిష్టానికి చేరుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ట్రేడింగ్ ఆద్యంతం స్థిరంగా అమ్మకాలు జరగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఫలితంగా సెన్సెక్స్ 264 పాయింట్లను కోల్పోయి 48,174 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 14,164 వద్ద నిలిచింది. మార్కెట్ పతనంలోనూ మెటల్, ప్రైవేట్ రంగ బ్యాంక్, రియల్టీ, మీడియా షేర్లు రాణించాయి. మెరుగైన ఆర్థిక గణాంకాల నమోదుతో వ్యవస్థలో చురుగ్గా కార్యకలాపాలు జరగవచ్చనే అంచనాలతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. క్యూ3లో కొన్ని ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధి గణనీయంగా పెరిగిందని గణాంకాలు వెలువడంతో ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్ మారకంలో రూపాయి 6 పైసలు బలపడటం కాస్త కలిసొచ్చే అంశంగా ఉంది. మరోవైపు పలు దేశాల ఈక్విటీ సూచీలు గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం జరిగింది. ఫలితంగా ఆసియాలో జపాన్‌తో సహా ప్రధాన దేశాల మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా పతనంలో ప్రారంభమై క్రమంగా నష్టాలను పూడ్చుకున్నాయి. టీసీఎస్ షేర్ల బైబ్యాక్.. టాటా దరఖాస్తు రూ. 9,997 కోట్లు టీసీఎస్ షేర్ల బైబ్యాక్ ప్రక్రియలో ఆ కంపెనీ ప్రమోటర్ టాటా సన్స్ భారీ స్థాయిలో దరఖాస్తు చేసింది. టీసీఎస్ కంపెనీ రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ (తిరిగి కొనుగోలు) చేయనున్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా మొత్తం 5.33 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.3,000 ధరకు టీసీఎస్ కొనుగోలు చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా టీసీఎస్‌లో ఏకైక అత్యధిక వాటా గల టాటా సన్స్ కంపెనీ 3.33 కోట్ల షేర్లకు టెండర్ వేసింది. వీటి విలువ రూ.9,997 కోట్లని అంచనా. గత నెల 18న మొదలైన ఈ షేర్ల బైబ్యాక్ ఈ నెల 1న ముగసింది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి టీసీఎస్ నగదు నిల్వలు రూ.58,500 కోట్లు. టీసీఎస్ 2017, 2018ల్లో రూ.16,000 కోట్ల మేర షేర్లను బైబ్యాక్ చేసింది. -
డిసెంబర్లో ‘తయారీ’ మరింత పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్లో మరింత పటిష్టమైంది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) డిసెంబర్లో 56.4కు ఎగసింది. నవంబర్‌లో ఇది 56.3 వద్ద ఉంది. పీఎంఐ సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా భావించడం జరుగుతుంది. ఆ లోపు నమోదయితే క్షీణతగా భావిస్తారు. తయారీకి సంబంధించి పీఎంఐ సూచీ 50పైన కొనసాగడం ఇది వరుసగా ఐదవనెల. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డం, రికవరీ, డిమాండ్ పరిస్థితులు బాగుండడం, ఉత్పత్తి పెంపు ద్వారా నిల్వలు మెరుగుపరచుకోడానికి కంపెనీల యత్నాలు వంటి అంశాలు తయారీ రంగం పురోగతికి కారణమని ఐహెచ్ఎస్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. అయితే ఉపాధి అవకాశాలు డిసెంబర్‌లోనూ మెరుగుపడలేదని ఆయన వివరించారు. ఉపాధి కల్పన క్షీణతలో ఉండడం ఇది వరుసగా తొమ్మిదవసారి. కాగా ముడి సరుకు ధరల పెరుగుదల తీవ్రంగానే ఉందని, డిసెంబర్లో ఇది 26 శాతానికి చేరిందని పోలియానా డీ లిమా తెలిపారు. రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)తో పోల్చితే మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో తయారీ రంగం మెరుగుపడిందని ఆయన పేర్కొంటూ, సూచీ 51.6 నుంచి 57.2కు చేరిందని అన్నారు. వరుసగా 36 నెలలు సూచీ 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగిన తయారీ, కరోనా కఠిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఏప్రిల్‌లో 50 పాయింట్ల దిగువకు క్షీణతలోకి జారిపోయింది. తిరిగి ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చింది. -
కరోనా కాటు: వ్యాపార సెంటిమెంట్ బేజారు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభం ప్రపంచంతోపాటు భారత ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ దశల లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో భారతీయ వ్యాపార సెంటిమెంట్ గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా దిగజారింది. తొలిసారి ప్రతికూలంగా మారింది. డిమాండ్ క్షీణత లాభాలపై వ్యాపారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ అనిశ్చితి, ఆర్థిక మందగమనంతో ప్రపంచంలోనే అతి దారుణమైన దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటోందని సోమవారం విడుదల చేసిన తాజా సర్వేలో తేలింది.(గుడ్‌న్యూస్: కరోనా డ్రగ్ ధర తగ్గింది) ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా బిజినెస్ ఔట్లుక్ సర్వే ఫలితాల ప్రకారం జూన్‌లో మునుపెన్నడూ లేని స్థాయికి బిజినెస్ సెంటిమెంట్ పడిపోయింది. బిజినెస్ యాక్టివిటీ నికర బ్యాలెన్స్ జూన్ మాసంలో మైనస్ 30 శాతానికి పడిపోయింది. ఇది ఫిబ్రవరిలో 26 శాతం పుంజకుంది. ఇదే ఈ దశాబ్దంలో అతి తక్కువ నమోదు, అలాగే రికార్డు పతనమని సంస్థ ఎకనామిక్స్ డైరెక్టర్ ఆండ్రూ హార్కర్ అన్నారు. 2009 చివరిలో సిరీస్ ప్రారంభమైనప్పటి నుండి వ్యాపార సెంటిమెంట్ ప్రతికూల దృక్పథంలోకి మారడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి స్పలంగా పుంజుకునే అవకాశం కనిపిస్తోందన్నారు. -
సేవలు కుదేలు...
ముంబై: కరోనా వైరస్ కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ దెబ్బతో దేశీయంగా సేవల రంగం కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏప్రిల్‌లో చరిత్రాత్మక కనిష్ట స్థాయికి తగ్గిపోయాయి. సేవల రంగం తీరుతెన్నులను ప్రతిబింబించే ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ గత నెల ఏకంగా 5.4 పాయింట్లకు క్షీణించడం ఇందుకు నిదర్శనం. 2005 డిసెంబర్లో దీన్ని మొదలుపెట్టినప్పట్నుంచీ చూస్తే ఈ స్థాయికి పడిపోవడం ఇదే ప్రథమం. లాక్డౌన్ కారణంగా డిమాండ్ పడిపోయి, వ్యాపారాలు మూతబడి, దాదాపుగా లావాదేవీలన్నీ నిల్చిపోవడం ఇందుకు కారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మార్చిలో ఈ సూచీ 49.3గా ఉంది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ (పీఎంఐ) సూచీ ప్రమాణాల ప్రకారం.. ఇండెక్స్ 50 పాయింట్లకు పైన ఉంటే వృద్ధిని, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. ‘సూచీ ఏకంగా 40 పాయింట్లు పడిపోవడమనేది.. లాక్‌డౌన్‌ను కఠినతరంగా అమలు చేయడంతో సేవల రంగం పూర్తిగా స్తంభించిపోయిందనడానికి నిదర్శనం‘ అని ఐహెచ్ఎస్ మార్కిట్ ఆర్థికవేత్త జో హేస్ తెలిపారు. కాంపోజిట్ కూడా డౌన్.. ఇక సేవలతోపాటు తయారీ రంగ ఉత్పాదకతను కూడా ప్రతిబింబించే కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ సూచీ కూడా ఏప్రిల్‌లో 7.2 పాయింట్లకు పడిపోయింది. మార్చిలో ఇది 50.6 పాయింట్లుగా నమోదైంది. 2005లో ఈ గణాంకాలు సేకరించడం ప్రారంభించినప్పట్నుంచీ ఇంత భారీగా క్షీణత నమోదు కావడం ఇదే తొలిసారని హేస్ వివరించారు. విదేశీ విక్రయాలు పూర్తిగా నిల్చిపోయాయి. ఇందుకు సంబంధించిన సూచీ 0.0 పాయింట్లకు క్షీణించింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకున్న కఠిన చర్యలతో కీలక విదేశీ మార్కెట్లలో డిమాండ్ పడిపోయిందని వ్యాపార సంస్థలు వెల్లడించాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక నష్టం భారత్‌లో చాలా భారీగానే ఉన్నట్లు ఈ గణాంకాల ద్వారా తెలుస్తోందని హేస్ చెప్పారు. అయితే, గడ్డుకాలాన్ని గట్టెక్కామనే ఆశావహ అభిప్రాయం నెలకొందని, లాక్‌డౌన్‌పరమైన ఆంక్షలను క్రమంగా ఎత్తివేసే కొద్దీ పరిస్థితులు మెరుగవుతాయనే అంచనాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఉద్యోగాల కోత కూడా ఉన్నప్పటికీ సర్వేలో పాల్గొన్న 90 శాతం సంస్థలు .. ఉద్యోగుల సంఖ్యను దాదాపు అదే స్థాయిలో కొనసాగిస్తున్నట్లు వెల్లడించాయని పేర్కొన్నారు. ఇక మార్చితో పోలిస్తే ముడివస్తువులు, ఉత్పత్తుల ధరలు తగ్గాయని తెలిపారు. మరోవైపు, తాజా సర్వే డేటా ప్రకారం ఏప్రిల్‌లో వ్యాపార విశ్వాసం మరింతగా క్షీణించింది. -
ఏప్రిల్‌లో తయారీ రంగం కుదేలు
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం ఏప్రిల్‌లో దారుణ పతనాన్ని చవిచూసింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో ఏకంగా 27.4కు పడిపోయింది. అసలు ఈ గణాంకాలు ప్రారంభమైన 15 సంవత్సరాల్లో ఇంతవరకూ ఎప్పుడూ ఇంత తీవ్ర పతనాన్ని తయారీ రంగం ఎదుర్కొనలేదు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ సూచీ 50 పాయింట్ల పైనుంటే దానిని వృద్ధి ధోరణిగా భావిస్తారు. ఆ దిగువనకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. గడచిన 32 నెలల్లో ఎప్పుడూ క్షీణతలోకి సూచీ జారలేదు. మార్చిలోసైతం 51.8గా నమోదయ్యింది. కాగా కోవిడ్–19 సంక్షోభం ఒక కొలిక్కి రావడంతోటే దేశంలో డిమాండ్ తిరిగి పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిస్ట్ ఇలియోట్ ఖేర్ వ్యక్తం చేశారు. -
మార్చిలో తయారీకి కరోనా దెబ్బ: పీఎంఐ డౌన్
న్యూఢిల్లీ: తయారీ రంగంపై కోవిడ్–19 ప్రభావం మార్చిలో తీవ్రంగా కనబడిందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) స్పష్టం చేసింది. తయారీ పీఎంఐ ఏకంగా 51.8కి పడిపోయింది. ఫిబ్రవరిలో సూచీ 54.5గా ఉంది. బిజినెస్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడం, అంతర్జాతీయ డిమాండ్ పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణం. నిజానికి పీఎంఐ 50 పాయింట్లపైన ఉంటే అది వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. దీని ప్రకారం, గడచిన 32 నెలల నుంచీ తయారీ రంగం 50 పాయింట్లపైనే కొనసాగుతోంది. ఎన్సీడీల ద్వారా 25 వేల కోట్ల సమీకరణ: ఆర్ఐఎల్ న్యూఢిల్లీ: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) రూపంలో రూ.25,000 కోట్లు సమీకరించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రకటించింది. పలు విడతలుగా ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో ఎన్సీడీల జారీ ద్వారా రూ.25వేల కోట్ల వరకు నిధులు సమీకరించే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్టు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. -
ఈసారి 5 శాతంలోపే వృద్ధి
న్యూఢిల్లీ: ఉద్దీపన చర్యల ప్రభావం పూర్తి స్థాయిలో ప్రతిఫలించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ ఒక నివేదికలో పేర్కొంది. బలహీన ఆర్థిక రంగ పరిస్థితులు.. భారత వృద్ధి వేగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని తెలిపింది. మొండిబాకీల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు కొత్తగా రుణాలివ్వలేని పరిస్థితి కూడా ఇందుకు కారణం కానుందని పేర్కొంది. అటు బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థల్లో నెలకొన్న సంక్షోభం .. వాటికి రుణాలిచ్చిన బ్యాంకులకు కూడా వ్యాపించే రిస్కులు పొంచి ఉన్నాయని, రుణ వృద్ధిపై ఇవి కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ తెలిపింది. ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల తయారీ రంగానికి, పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చే చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని వివరించింది. 2019–20 వృద్ధి అంచనాలను ఇటీవలే ఆర్బీఐ 6.1% నుంచి 5%కి కుదించిన నేపథ్యంలో తాజా ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
భారత్‌తో బంధానికి తహతహ
భారత్ ఒక బిగ్ మార్కెట్. 2018 నాటికి ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంతవరకు ఆరో స్థానంలో వున్న ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టేసింది. ఈ యేడాది భారత్ ఐదో స్థానానికి చేరుకోగలదని లండన్‌కు చెందిన ఐహెచ్ఎస్ మార్కిట్ లిమిటెడ్ (గ్లోబర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్) అంచనా వేస్తోంది. భారత్ 2019–23 మధ్య కాలంలో ఏడాదికి సగటున ఇంచుమించు 7% వృద్ధిరేటు నమోదు చేయగలదని, రానున్న రెండు దశాబ్దాల్లో ఏడాదికి సగటున 75 లక్షల మంది ఆర్థిక కార్యకలాపాల్లోకి ప్రవేశించే అవకాశముందని ఆ సంస్థ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.5% వృద్ధిరేటు సాధించగలదని ప్రపం చ బ్యాంకు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలపరచుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు భావిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించని ప్రభుత్వాలపై వేలెత్తి చూపుతున్నాయి. భారత్ పట్ల ట్రంప్ ప్రభుత్వ వైఖరి మారాలని డెమోక్రాట్లు కోరుతున్నారు. బ్రెగ్జిట్‌ను దృష్టిలో వుంచుకుని భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేయాలంటోంది యూకే పార్లమెంటరీ నివేదిక. వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం భారత్‌తో సంప్రదింపులు జరపడానికి బదులు వివిధ అంశాలకు సంబంధించి ఆ దేశంపై ట్రంప్ సర్కారు ఒత్తిడి తీసుకువస్తోందనే అభిప్రాయం బలం పుంజుకుంటోందని అంటున్నారు అమెరికా దిగువసభ విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు ఇలియట్ ఇంజల్. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైకేల్ పాంపియోకు సోమవారం ఆయన లేఖ రాశారు. భారత్ సహా ఆసియాలో పాంపియో జరుపుతున్న పర్యటన నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) రద్దు చేయడాన్ని, ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోరాదంటూ మన దేశంపై ఆంక్షలు విధించడాన్ని ఈ లేఖ ప్రధానంగా ప్రస్తావించింది. పాంపియో తన భారత్ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇలియట్ సూచించారు. భారత్ విషయంలో పాలకుల మాటలకు – చేతలకు మధ్య పొంతన లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం పట్ల అమెరికా అవలంభిస్తోన్న అస్థిర వైఖరి – దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన ఇరుదేశాల భాగస్వామ్యాన్ని దెబ్బ తీసిందని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట ప్రపంచ పోటీలో అంతకంతకూ వృద్ధి చెందుతున్న భారతదేశంతో పోల్చుకుంటే బ్రిటన్ వెనకబడిందని, పెరుగుతున్న భారత్ పలుకుబడికి సరితూగగలిగేలా తన వ్యూహం సరిచేసుకోవడంలో విఫలమయ్యిందని తాజాగా వెలువడిన బ్రిటిష్ పార్లమెంటరీ పరిశీలన నివేదిక పేర్కొంది. ‘బిల్డింగ్ బ్రిడ్జెస్ : రీఅవేకనింగ్ యూకే – ఇండియా టైస్’ శీర్షికన వెలువడిన ఈ నివేదికను ‘యూకె – ఇండియా వీక్ 2019’ సందర్భంగా బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. భారతీయ యాత్రికులు, విద్యార్థులు, వృత్తి నిపుణులకు ప్రయోజనకరమైన వీసా, వలస విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నివేదిక వివరించింది. ద్వైపాక్షిక సంబంధాల ద్వారా బ్రిటన్ తగిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని వ్యాఖ్యానించింది. భారత్‌తో తన సంబంధాలను సరిచేసుకునేందుకు ఆచరణయోగ్యమైన కొన్ని చర్యలను బ్రిటన్ తీసుకోవాలని, ప్రత్యేకించి చదువు – ఉద్యోగం – సందర్శన కోసం భారతీయులు సులభంగా బ్రిటన్ వచ్చేందుకు వీలు కల్పించాలని నివేదిక పేర్కొంది. వీసాల విషయంలో ప్రజాస్వామ్య రహిత చైనా కంటే కఠిన నిబంధనలను బ్రిటన్ అమలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
డబ్ల్యూఈఎఫ్‌లో మహిళా దిగ్గజాల హవా
దావోస్: ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పలువురు మహిళా వ్యాపార దిగ్గజాలు కూడా పాల్గొంటున్నారు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ నీతా అంబానీతో పాటు ఆమె కుమార్తె ఈషా అంబానీ కూడా ఉన్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డెరైక్టర్‌గా ఈషా పాల్గొంటున్నారు. అటు ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య కూడా ఇందులో ఉన్నారు. వీరితో పాటు షాను హిందుజా, సంజనా గోవిందన్ జయదేవ్, ప్రియా హీరనందానీ వాందేవాలా, వందన్ గోయల్ మొదలైన వారు ఉన్నారు. మొత్తం 2,500 మంది డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొంటుండగా ఇందులో 17 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. గడిచిన 2-3 ఏళ్లలో మహిళల సంఖ్య ఇదే స్థాయిలో ఉండటం గమనార్హం.ఇందులోనూ భారత్ నుంచి హాజరవుతున్న వారి సంఖ్య మరీ తక్కువ. ఈ విషయంలో చైనా, అమెరికా పరిస్థితి మెరుగ్గా ఉంది. మరోవైపు, ఈసారి సదస్సులో యువ మహిళా వ్యాపారవేత్తలు మాత్రం చెప్పుకోతగ్గ ఉన్నారు. గ్లోబల్ షేపర్స్ గ్రూప్‌లో 50 మంది యువ లీడర్లు ఉండగా.. అందులో సగభాగం పైగా మహిళలే ఉన్నారు. వినియోగదారులకు 1.5 ట్రిలియన్ డాలర్లు: ఐహెచ్ఎస్ తగ్గుతున్న చమురు ధరల వల్ల దాదాపు 1.5 టిలియన్ డాలర్ల సంపద వినియోగదారులకు బదిలీ అవుతుందని ప్రముఖ ప్రపంచ విశ్లేషణా, సమాచార సేవల సంస్థ ఐహెచ్ఎస్ పేర్కొంది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాల ప్రారంభం రోజు ఐహెచ్ఎస్ ఈ ప్రకటన చేసింది. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూర్చే అంశాల్లో ఇదొకటని సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ నారీమన్ బెహ్రావాష్ అన్నారు.