
న్యూఢిల్లీ: తయారీ రంగంపై కోవిడ్–19 ప్రభావం మార్చిలో తీవ్రంగా కనబడిందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) స్పష్టం చేసింది. తయారీ పీఎంఐ ఏకంగా 51.8కి పడిపోయింది. ఫిబ్రవరిలో సూచీ 54.5గా ఉంది. బిజినెస్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడం, అంతర్జాతీయ డిమాండ్ పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణం. నిజానికి పీఎంఐ 50 పాయింట్లపైన ఉంటే అది వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. దీని ప్రకారం, గడచిన 32 నెలల నుంచీ తయారీ రంగం 50 పాయింట్లపైనే కొనసాగుతోంది.
ఎన్‌సీడీల ద్వారా 25 వేల కోట్ల సమీకరణ: ఆర్‌ఐఎల్
న్యూఢిల్లీ: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్‌సీడీ) రూపంలో రూ.25,000 కోట్లు సమీకరించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ప్రకటించింది. పలు విడతలుగా ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానంలో ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.25వేల కోట్ల వరకు నిధులు సమీకరించే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్టు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది.