భారత్ ఒక బిగ్ మార్కెట్. 2018 నాటికి ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంతవరకు ఆరో స్థానంలో వున్న ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టేసింది. ఈ యేడాది భారత్ ఐదో స్థానానికి చేరుకోగలదని లండన్‌కు చెందిన ఐహెచ్‌ఎస్ మార్కిట్ లిమిటెడ్ (గ్లోబర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్) అంచనా వేస్తోంది. భారత్ 2019–23 మధ్య కాలంలో ఏడాదికి సగటున ఇంచుమించు 7% వృద్ధిరేటు నమోదు చేయగలదని, రానున్న రెండు దశాబ్దాల్లో ఏడాదికి సగటున 75 లక్షల మంది ఆర్థిక కార్యకలాపాల్లోకి ప్రవేశించే అవకాశముందని ఆ సంస్థ చెబుతోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.5% వృద్ధిరేటు సాధించగలదని ప్రపం చ బ్యాంకు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలపరచుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు భావిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించని ప్రభుత్వాలపై వేలెత్తి చూపుతున్నాయి. భారత్ పట్ల ట్రంప్ ప్రభుత్వ వైఖరి మారాలని డెమోక్రాట్లు కోరుతున్నారు. బ్రెగ్జిట్‌ను దృష్టిలో వుంచుకుని భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేయాలంటోంది యూకే పార్లమెంటరీ నివేదిక.
వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం
భారత్‌తో సంప్రదింపులు జరపడానికి బదులు వివిధ అంశాలకు సంబంధించి ఆ దేశంపై ట్రంప్ సర్కారు ఒత్తిడి తీసుకువస్తోందనే అభిప్రాయం బలం పుంజుకుంటోందని అంటున్నారు అమెరికా దిగువసభ విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు ఇలియట్ ఇంజల్. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైకేల్ పాంపియోకు సోమవారం ఆయన లేఖ రాశారు. భారత్ సహా ఆసియాలో పాంపియో జరుపుతున్న పర్యటన నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్‌పీ) రద్దు చేయడాన్ని, ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోరాదంటూ మన దేశంపై ఆంక్షలు విధించడాన్ని ఈ లేఖ ప్రధానంగా ప్రస్తావించింది. పాంపియో తన భారత్ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇలియట్ సూచించారు. భారత్ విషయంలో పాలకుల మాటలకు – చేతలకు మధ్య పొంతన లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం పట్ల అమెరికా అవలంభిస్తోన్న అస్థిర వైఖరి – దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన ఇరుదేశాల భాగస్వామ్యాన్ని దెబ్బ తీసిందని వ్యాఖ్యానించారు.
ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట
ప్రపంచ పోటీలో అంతకంతకూ వృద్ధి చెందుతున్న భారతదేశంతో పోల్చుకుంటే బ్రిటన్ వెనకబడిందని, పెరుగుతున్న భారత్ పలుకుబడికి సరితూగగలిగేలా తన వ్యూహం సరిచేసుకోవడంలో విఫలమయ్యిందని తాజాగా వెలువడిన బ్రిటిష్ పార్లమెంటరీ పరిశీలన నివేదిక పేర్కొంది. ‘బిల్డింగ్ బ్రిడ్జెస్ : రీఅవేకనింగ్ యూకే – ఇండియా టైస్’ శీర్షికన వెలువడిన ఈ నివేదికను ‘యూకె – ఇండియా వీక్ 2019’ సందర్భంగా బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. భారతీయ యాత్రికులు, విద్యార్థులు, వృత్తి నిపుణులకు ప్రయోజనకరమైన వీసా, వలస విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నివేదిక వివరించింది.
ద్వైపాక్షిక సంబంధాల ద్వారా బ్రిటన్ తగిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని వ్యాఖ్యానించింది. భారత్‌తో తన సంబంధాలను సరిచేసుకునేందుకు ఆచరణయోగ్యమైన కొన్ని చర్యలను బ్రిటన్ తీసుకోవాలని, ప్రత్యేకించి చదువు – ఉద్యోగం – సందర్శన కోసం భారతీయులు సులభంగా బ్రిటన్ వచ్చేందుకు వీలు కల్పించాలని నివేదిక పేర్కొంది. వీసాల విషయంలో ప్రజాస్వామ్య రహిత చైనా కంటే కఠిన నిబంధనలను బ్రిటన్ అమలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment