ఐదు కంపెనీలను కొంటున్న బీఎస్ లిమిటెడ్
⇒ ఈ కంపెనీల విలువ రూ. 937 కోట్లుగా అంచనా
⇒ విద్యుత్ సరఫరా ఇన్‌ఫ్రా రంగంలో అతిపెద్ద కంపెనీగా అవతరణ
⇒ ఈ ఏడాది 7% వృద్ధితో రూ. 75 కోట్లకు చేరిన నికరలాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ సరఫరా, పంపిణీలకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యాపారంలో ఉన్న బీఎస్ లిమిటెడ్ భారీ కొనుగోళ్లకు తెరతీసింది. వ్యాపార విస్తరణలో భాగంగా మొత్తం ఐదు కంపెనీలను రూ. 937 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు బీఎస్ లిమిటెడ్ ప్రకటించింది.
విద్యుత్ సరఫరా, పంపిణీకి కావల్సిన స్తంభాలు, స్టీల్ స్ట్రక్చర్స్, ట్రాన్సిమిషన్ హార్డ్‌వేర్, యాంటీ థెప్ట్ పరికరాలను తయారు చేసే ఐదు సంస్థలను కొనుగోలు చేయడానికి బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అగర్వాల్ స్టీల్స్ స్ట్రక్చర్స్ ఇండియా, డురాఫాస్ట్ ఆటోమోటివ్, ఎన్‌హెచ్‌ఎస్ మెటల్స్, రాజేష్ సంథి ఇన్‌ఫ్రాస్, మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను బీఎస్ లిమిటెడ్ కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోళ్లకు ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతి లభించాల్సి ఉంది.
ఈ కంపెనీల కొనుగోళ్ల ద్వారా విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాల వ్యాపారంలో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందించే సంస్థగా బీఎస్ లిమిటెడ్ చేరిందని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేష్ అగర్వాల్ తెలిపారు. దీంతో రైల్వే విద్యుద్దీకరణతో పాటు పెద్ద బిడ్డింగ్‌ల్లో పాల్గొనే సామర్థ్యం కంపెనీకి సమకూరిందన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అగర్వాల్ తెలిపారు.
ఆదాయంలో 15 శాతం వృద్ధి
మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నికర లాభంలో 15% వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 70 కోట్లుగా ఉన్న నికరలాభం సమీక్షా కాలంలో రూ. 75 కోట్లకు చేరిం ది. ఇదే కాలానికి ఆదాయం రూ. 15% వృద్ధితో రూ. 2,321 కోట్ల నుంచి రూ. 2,673 కోట్లకు పెరిగింది.