న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా నాల్గవ నెల 2021 డిసెంబర్‌లోనూ పేలవంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 0.4 శాతంగా నమోదయినట్లు (2020 ఇదే నెలతో పోల్చి) జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది.
ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రెండంకెల్లో వృద్ధి నమోదయ్యింది. అటు తర్వాత క్రమంగా బలహీనపడింది. 2020 లో బేస్ ఎఫెక్ట్ ప్రభావం క్రమంగా తొలగిపోతూ రావడం కూడా దీనికి కారణం. సెప్టెంబర్‌లో 4.4 శాతం, అక్టోబర్‌లో 4 శాతం, నవంబర్‌లో 1.3 శాతం (తొలి 1.4 శాతానికి దిగువముఖంగా సవరణ) వృద్ధి రేట్లు నమోదయ్యాయి. కొన్ని కీలక రంగాల పనితీరును పరిశీలిస్తే..
► మైనింగ్ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది.
► విద్యుత్ ఉత్పత్తి 2.8 శాతం పెరిగింది.
► పెట్టుబడులు, భారీ యంత్రసామాగ్రి కొనుగోళ్లను ప్రతిబింబించే క్యాపిటల్ గూడ్స్ విభాగం కూడా 2021 డిసెంబర్‌లో క్షీణతలోనే ఉంది. క్షీణరేటు 4.6 శాతంగా నమోదయ్యింది. 2020 ఇదే నెలల్లో ఈ విభాగంలో 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది.
► రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా 2.7 శాతం క్షీణతను నమోదయ్యింది. 2020 డిసెంబర్‌లో ఈ విభాగంలో 6.5 శాతం వృద్ధి నమోదయ్యింది.
► ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ)కు సంబంధించి విభాగంలో ఉత్పత్తి కూడా 0.6 శాతం క్షీణతలోనే ఉంది. 2020 డిసెంబర్‌లో ఈ విభాగం 1.9 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం.
తొమ్మిది నెలల్లో ఇలా...
ఇక ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 15.2 శాతం. లో బేస్ దీనికి ప్రధాన కారణం. 2020 ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 13.3 శాతం క్షీణత నమోదయ్యింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్.
2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట...
మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్‌డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే...
Comments
Please login to add a commentAdd a comment