Indian industrial sector
-
పారిశ్రామిక ఉత్పత్తి... నాలుగో నెలా నిరాశే!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా నాల్గవ నెల 2021 డిసెంబర్‌లోనూ పేలవంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 0.4 శాతంగా నమోదయినట్లు (2020 ఇదే నెలతో పోల్చి) జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రెండంకెల్లో వృద్ధి నమోదయ్యింది. అటు తర్వాత క్రమంగా బలహీనపడింది. 2020 లో బేస్ ఎఫెక్ట్ ప్రభావం క్రమంగా తొలగిపోతూ రావడం కూడా దీనికి కారణం. సెప్టెంబర్‌లో 4.4 శాతం, అక్టోబర్‌లో 4 శాతం, నవంబర్‌లో 1.3 శాతం (తొలి 1.4 శాతానికి దిగువముఖంగా సవరణ) వృద్ధి రేట్లు నమోదయ్యాయి. కొన్ని కీలక రంగాల పనితీరును పరిశీలిస్తే.. ► మైనింగ్ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది. ► విద్యుత్ ఉత్పత్తి 2.8 శాతం పెరిగింది. ► పెట్టుబడులు, భారీ యంత్రసామాగ్రి కొనుగోళ్లను ప్రతిబింబించే క్యాపిటల్ గూడ్స్ విభాగం కూడా 2021 డిసెంబర్లో క్షీణతలోనే ఉంది. క్షీణరేటు 4.6 శాతంగా నమోదయ్యింది. 2020 ఇదే నెలల్లో ఈ విభాగంలో 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది. ► రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా 2.7 శాతం క్షీణతను నమోదయ్యింది. 2020 డిసెంబర్లో ఈ విభాగంలో 6.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ► ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కు సంబంధించి విభాగంలో ఉత్పత్తి కూడా 0.6 శాతం క్షీణతలోనే ఉంది. 2020 డిసెంబర్లో ఈ విభాగం 1.9 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. తొమ్మిది నెలల్లో ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 15.2 శాతం. లో బేస్ దీనికి ప్రధాన కారణం. 2020 ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 13.3 శాతం క్షీణత నమోదయ్యింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... -
దేశీ ఐటీ, ఫార్మాపై ప్రభావం అంతంతే..
బెంగళూరు: యూరోపియన్ యూనియన్ మార్కెట్ నుంచి బ్రిటన్ వైదొలిగినప్పటికీ (బ్రెగ్జిట్) దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్ అనంతరం కూడా ఆయా సంస్థల వ్యాపారాలు యథాప్రకారమే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ టెకీలకు ఇప్పటికే బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు వేర్వేరు వీసా విధానాలు పాటిస్తున్నందున ఈ విషయంలో పెద్దగా మారేదేమీ లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, బ్రిటన్‌లో భారతీయ ఫార్మా సంస్థలు కీలకంగా ఎదిగే అవకాశం దక్కగలదని బయోటెక్ దిగ్గజం బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా తెలిపారు. ‘బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్‌తో భారత్ పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం లభించగలదని భావిస్తున్నా. ఫార్మా రంగం కూడా ఇందులో ఒకటి కాగలదు‘ అని ఆమె చెప్పారు. డిసెంబర్ 31న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుంది. -
ఎగుమతి రంగాలపై ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: ఎగుమతులకు సంబంధించి భారత్‌కు అనుకూల పరిస్థితులు ఉన్న 12–13 రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు. టెక్స్టైల్స్ తదితర రంగాలు వీటిలో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం 37 బిలియన్ డాలర్లుగా ఉన్న టెక్స్టైల్స్ రంగం ఎగుమతులు వచ్చే 10 సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్లకు చేరగలవని గోయల్ పేర్కొన్నారు. సేవల రంగం ఎగుమతులు కూడా మెరుగైన వృద్ధి రేట్లు సాధిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో మిగతా రంగాలతో పోలిస్తే అధిక స్థాయిలో ఎగుమతులకు ఆస్కారమున్న రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్ చెప్పారు. 2019–20 ఏప్రిల్– డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు సుమారు 2 శాతం, దిగుమతులు దాదాపు 9 శాతం క్షీణించిన నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసంబద్ధ పోటీ నుంచి దేశీ పరిశ్రమలను కాపాడేందుకు భారత్ కొన్ని రక్షణాత్మక విధానాలు పాటించడం తప్పనిసరిగా మారిందని చెప్పారు. ఈ–కామర్స్ సంస్థలకు వేల కోట్ల నష్టాలా.. ఎలా... బిలియన్ల డాలర్ల పెట్టుబడులతో భారత్నేమీ ఉద్ధరించడం లేదంటూ అమెజాన్‌ను గతంలో ఆక్షేపించిన గోయల్ తాజాగా ఈ–కామర్స్ కంపెనీల నష్టాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ–కామర్స్ కంపెనీలు వేల కోట్ల నష్టాలు ప్రకటిస్తుండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రూ. 5,000 కోట్ల టర్నోవరుపై ఏకంగా రూ. 6,000 కోట్ల నష్టాలు ప్రకటించిందంటే నమ్మశక్యంగా అనిపించదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ–కామర్స్ సంస్థలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని గోయల్ స్పష్టం చేశారు. అలాంటి సంస్థలను ఎప్పుడూ స్వాగతిస్తామని చెప్పారు. అమెజాన్‌పై గతంలో చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ మంత్రి తాజా వివరణనిచ్చారు. ‘ఈ–కామర్స్‌తో ఇంత మందికి ప్రయోజనం చేకూరుతుందన్న హామీలు వినడానికి ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ చట్టరీత్యా ఆమోదయోగ్యం కాని విధానాల వల్ల పది రెట్లు మంది ప్రయోజనాలు దెబ్బతినకూడదు’ అని గోయల్ చెప్పారు. -
పరిశ్రమలు మళ్లీ ‘ప్లస్’లోకి..
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక రంగం నవంబర్‌లో వెలుగురేఖలు చూసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. భారత్ పారిశ్రామిక రంగం మూడు నెలల తర్వాత వృద్ధిబాటలోకి రావడం గమనార్హం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లలో భారత్ పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధినమోదుకాకపోగా, క్షీణ రేటు నెలకొంది. మొత్తం సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ రంగం కూడా క్షీణతలో నుంచి బయటపడ్డం మొత్తం గణాంకాలకు కొంత సానుకూలమైంది. శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►2018 నవంబర్‌లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 0.2 శాతం. ►సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం 2.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2018 ఇదే నెలలో ఈ విభాగం అసలు వృద్ధిలేకపోగా –0.7 శాతం పడింది. నవంబర్ తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలనే ఇచ్చాయి. ►విద్యుత్ రంగం విషయానికి వస్తే పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. 2018 నవంబర్‌లో కనీసం 5.1 శాతం వృద్ధి నమోదయితే, 2019 ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా –5 శాతం క్షీణత నమోదయ్యింది. ►మైనింగ్ విషయంలో క్షీణ రేటు 1.7 శాతంగా ఉంది. అయితే ఈ రేటు 2018 నవంబర్‌లో పోల్చితే (–2.7 శాతం) తగ్గడం గమనార్హం. ►భారీ యంత్రపరికరాలు, పెట్టుబడులను సూచించే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో –8.6 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. పైగా 2018 నవంబర్ క్షీణత స్థాయి (–4.1 శాతం) పెరగడం ఆందోళన కలిగించే అంశం. ►ఎఫ్ఎంసీజీ (కన్జూమర్ నాన్–డ్యూరబుల్ సెగ్మెట్) వస్తువుల విభాగంలో 2 శాతం స్వల్ప వృద్ధి (2018 నవంబర్‌లో –0.3 శాతం) నమోదయ్యింది. అయితే రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి నమోదుకాలేదు. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ ఇక ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే, వృద్ధి రేటు కేవలం 0.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5 శాతంగా ఉంది. విధాన నిర్ణేతలకు ఊరట పారిశ్రామిక రంగం తాజా గణాంకాలు ఇటు మార్కెట్‌కు, అటు విధాన నిర్ణేతలకు కొంచెం ఊరటనిస్తాయి. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో క్షీణత తగ్గుముఖం పడుతుండడం ఆశాజనకమైన అంశం. –రుమ్కీ మజుందర్, ఆర్థికవేత్త, డెలాయిట్ ఇండియా బేస్ ఎఫెక్ట్ మాత్రమే.. ఇప్పుడు కనిపించిన పారిశ్రామిక వృద్ధి రేటు కేవలం బేస్ ఎఫెక్ట్ మాత్రమే. 2018 ఇదే నెలల్లో అతి తక్కువ రేటు ప్రతిబింబమిది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వరకూ (మార్చి) ఈ ఫలితాలు ఇలానే ఉండే వీలుంది. –కరణ్, మహర్షి, యాక్యురేట్ రేటింగ్స్ అండ్ రిసెర్చ్ -
భారతీయుల కలలకు రెక్కలు తొడిగాడు
మన దిగ్గజాలు విమానాన్ని వినువీధుల్లో నడిపిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. భారతీయుల కలలకు రెక్కలు తొడిగిన వాడు ఆయన. ‘మేక్ ఇన్ ఇండియా’ ఇటీవలి రాజకీయ నినాదం కావొచ్చేమో గాని, దశాబ్దాల కిందటే దానిని ఆచరణలోకి తెచ్చిన వాడు ఆయన. భారతీయ పారిశ్రామిక రంగానికి పునాదులను పటిష్టం చేసిన వాడు ఆయన. ఒక రకంగా భారతీయ పారిశ్రామిక రంగానికి పితామహుడు అనదగ్గ ఆయనే జె.ఆర్.డి.టాటా. ఫ్రాన్స్‌లో గడిచిన బాల్యం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 1904 జూలై 4న పుట్టిన ఆయన పూర్తి పేరు జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా. తండ్రి రతన్జీ దాదాభాయ్ టాటా పర్షియన్. తల్లి సూజాన్ ఫ్రెంచి మహిళ. ఈ దంపతులకు రెండో సంతానంగా పుట్టారు జె.ఆర్.డి.టాటా. టాటా పరిశ్రమలకు మూలపురుషుడైన జెమ్షెడ్జీ టాటాకు రతన్జీ సోదరుడి వరుస. టాటాలు స్వతహాగానే సంపన్నులు. పారిశ్రామిక విప్లవం ఫలితాలను శరవేగంగా అందిపుచ్చుకున్న వాళ్లు. జె.ఆర్.డి.టాటా బాల్యం ఫ్రాన్స్‌లోనే గడిచింది. భారత్‌కు తరలిన కుటుంబం సూజాన్ ఆకస్మిక మరణం తర్వాత రతన్జీ 1923లో తన కుటుంబాన్ని భారత్‌కు తరలించారు. ఉన్నత విద్య కోసం జె.ఆర్.డి.టాటాను ఇంగ్లాండ్‌కు పంపారు. ఇంగ్లాండ్‌లో ఆయన గ్రామర్ స్కూల్లో చేరారు. ఇంజనీరింగ్‌పై ఆసక్తి గల ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదవాలనుకున్నారు. అయితే, దేశంలోని యువకులందరూ తప్పనిసరిగా సైన్యంలో కనీసం ఏడాది కాలం పనిచేయాలన్న ఫ్రాన్స్ ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆయన తిరిగి పారిస్ చేరుకోవాల్సి వచ్చింది. ఫ్రెంచి సైన్యంలో ఏడాది పాటు పనిచేశారు. ఫ్రెంచి సైన్యంలోని లె సాఫిస్ రెజిమెంట్‌లో చేరారు. ఫ్రెంచి, ఇంగ్లిష్ భాషల్లో మంచి పట్టు ఉండటంతో త్వరలోనే కల్నల్ కార్యాలయంలో కార్యదర్శి స్థాయికి ఎదిగారు. సైన్యంలో తప్పనిసరి ఉద్యోగాన్ని ముగించుకున్నాక ఎలాగైనా మళ్లీ ఇంగ్లాండ్ వెళ్లి కేంబ్రిడ్జిలో చేరాలనుకున్నారు. అయితే, కుటుంబ సంస్థలో పనిచేయడానికి భారత్ వచ్చేయాలంటూ తండ్రి కబురు చేయడంతో చేసేది లేక భారత్‌కు వచ్చేశారు. టాటా సంస్థతో అనుబంధం తండ్రి పిలుపుతో భారత్ చేరుకున్న జె.ఆర్.డి.టాటా 1925లో టాటా అండ్ సన్స్ కంపెనీలో వేతనం లేని అప్రెంటిస్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1938 నాటికల్లా టాటా అండ్ సన్స్ చైర్మన్‌గా ఎదిగారు. అప్పటికి అది భారత్‌లోనే అతిపెద్ద సంస్థ. ఇక భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకుని, 1929లో ఫ్రెంచి పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరుడిగా మారారు. ఒకవైపు టాటా సంస్థలో పనిచేస్తూనే ఉన్నా, ఆయన దృష్టి అంతా విమానయానంపైనే ఉండేది. తీరికవేళల్లో విమానాన్ని నడపడం నేర్చుకున్నారు. అప్పట్లో భారత్‌ను పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 1929లో పైలట్ లెసైన్స్ పొందారు. పైలట్ లెసైన్స్ పొందిన తొలి భారతీయుడిగా అరుదైన ఘనత సాధించిన జె.ఆర్.డి.టాటా అక్కడితో ఆగిపోలేదు. టాటా అండ్ సన్స్ సంస్థలో 1932లో టాటా ఎయిర్‌లైన్స్ ప్రారంభించారు. తర్వాతి కాలంలో అదే ఎయిర్ ఇండియాగా మారి, భారత ఉపఖండంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా చరిత్ర సృష్టించింది. ఎయిర్ ఇండియా చైర్మన్‌గా ఆయన దాదాపు ముప్పయ్యేళ్లు సేవలందించారు. వైమానిక రంగంలో ఆయన నైపుణ్యానికి గుర్తింపుగా భారతీయ వైమానిక దళం ఆయనకు పలు గౌరవ పదవులను కట్టబెట్టింది. ఆనంద భారతమే ఆశయం జె.ఆర్.డి.టాటా తన ఆధ్వర్యంలో టాటా గ్రూప్‌ను అపారంగా విస్తరించారు. టాటా మోటార్స్, టైటాన్ ఇండస్ట్రీస్, వోల్టాస్, ఎయిర్ ఇండియా, టాటా టీ, టీసీఎస్ వంటి సంస్థలకు పునాదులు వేశారు. వాటన్నిటినీ విజయవంతంగా లాభాల బాటలో నడిపించారు. వ్యాపార విజయాలతో సంతృప్తి చెందకుండా, ధార్మిక సేవా రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. సర్ దోరాబ్జీ టాటా ట్రస్టుకు ట్రస్టీగా సేవలందించారు. బాంబేలో టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఆస్పత్రిని స్థాపించారు. ఇదే భారత్‌లోని మొట్టమొదటి కేన్సర్ ఆస్పత్రి. శాస్త్ర సాంకేతిక, సామాజిక, కళా రంగాలలో మేలైన బోధన, పరిశోధనల కోసం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి సంస్థలను స్థాపించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సహా అనేక బిరుదులు, గౌరవాలు దేశ విదేశాల్లో దక్కాయి. అలాగని, తన కంపెనీలను లాభాల బాట పట్టించడం, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం మాత్రమే ఆయన ఆశయం కాదు. భారత్ ఆర్థికశక్తిగా ఎదగడం కంటే, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించే పరిస్థితులు కల్పించడమే తన ఆశయం అంటూ ‘భారతరత్న’ పురస్కారాన్ని స్వీకరిస్తున్నప్పుడు తన మనసులోని మాటను బయటపెట్టారు. కార్మిక సంక్షేమంలో ప్రభుత్వానికే మార్గదర్శి కార్పొరేట్ సంస్థలకు కార్మిక సంక్షేమం పెద్దగా పట్టదు. కార్మిక సంక్షేమ చట్టాలు ఎన్ని ఉన్నా, వాటిని అవి మొక్కుబడిగా మాత్రమే పాటిస్తాయి. ఇప్పటికీ చాలా కార్పొరేట్ సంస్థలది ఇదే తీరు. అయితే, కార్మిక సంక్షేమానికి కట్టుదిట్టమైన చట్టాలేవీ లేని కాలంలో సైతం జె.ఆర్.డి.టాటా తన సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగానే పలు పథకాలను అమలు చేసేవారు. అవి ఇప్పటికీ టాటా సంస్థల్లో అమలవుతున్నాయి. ఉద్యోగి ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరిన సమయం నుంచే ‘ఆన్ డ్యూటీ’గా పరిగణించే పద్ధతికి ఆద్యుడు జె.ఆర్.డి.టాటా. ఉద్యోగి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఒకవేళ ఎలాంటి ప్రమాదానికి గురైనా పరిహారం చెల్లించేలా ఆయన తన కంపెనీ నిబంధనలను రూపొందించారు. తర్వాత ఇవే నిబంధనలతో మన దేశంలో కార్మిక పరిహార చట్టం (వర్క్‌మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్) అమలులోకి వచ్చింది. తమ సంస్థల్లో పనిచేసే కార్మికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఉచిత వైద్యం, ప్రమాద పరిహారం తదితరమైనవి కల్పించడంలో టాటా సంస్థలు దేశంలోని మిగిలిన సంస్థలన్నింటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. పారిశ్రామికవేత్తగా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన జె.ఆర్.డి.టాటా కిడ్నీ సమస్యతో బాధపడుతూ 1993 నవంబర్ 29న జెనీవాలో తుదిశ్వాస విడిచారు. పారిస్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. జె.ఆర్.డి.టాటా చెప్పిన మాటలు ⇒ డబ్బు ఎరువులాంటిది. పోగుపెడితే ఇంకిపోతుంది. విస్తరిస్తే ఏపుగా పెరుగుతుంది. ⇒ ఏ పనినైనా అనుమానంతో కాదు, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాలి. ⇒ సాటి మనుషులకు ప్రేమగా దిశానిర్దేశం చేయగల వాళ్లే నాయకులు కాగలరు. ⇒ లోపభూయిష్టమైన ప్రాధాన్యాలు, సాధ్యంకాని లక్ష్యాలే చాలా సమస్యలకు మూలం.