భారతీయుల కలలకు రెక్కలు తొడిగాడు
మన దిగ్గజాలు
విమానాన్ని వినువీధుల్లో నడిపిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. భారతీయుల కలలకు రెక్కలు తొడిగిన వాడు ఆయన.
‘మేక్ ఇన్ ఇండియా’ ఇటీవలి రాజకీయ నినాదం కావొచ్చేమో గాని, దశాబ్దాల కిందటే దానిని ఆచరణలోకి తెచ్చిన వాడు ఆయన. భారతీయ పారిశ్రామిక రంగానికి పునాదులను పటిష్టం చేసిన వాడు ఆయన. ఒక రకంగా భారతీయ పారిశ్రామిక రంగానికి పితామహుడు అనదగ్గ ఆయనే జె.ఆర్.డి.టాటా.
ఫ్రాన్స్‌లో గడిచిన బాల్యం
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 1904 జూలై 4న పుట్టిన ఆయన పూర్తి పేరు జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా. తండ్రి రతన్‌జీ దాదాభాయ్ టాటా పర్షియన్. తల్లి సూజాన్ ఫ్రెంచి మహిళ. ఈ దంపతులకు రెండో సంతానంగా పుట్టారు జె.ఆర్.డి.టాటా. టాటా పరిశ్రమలకు మూలపురుషుడైన జెమ్‌షెడ్‌జీ టాటాకు రతన్‌జీ సోదరుడి వరుస. టాటాలు స్వతహాగానే సంపన్నులు. పారిశ్రామిక విప్లవం ఫలితాలను శరవేగంగా అందిపుచ్చుకున్న వాళ్లు. జె.ఆర్.డి.టాటా బాల్యం ఫ్రాన్స్‌లోనే గడిచింది.
భారత్‌కు తరలిన కుటుంబం
సూజాన్ ఆకస్మిక మరణం తర్వాత రతన్‌జీ 1923లో తన కుటుంబాన్ని భారత్‌కు తరలించారు. ఉన్నత విద్య కోసం జె.ఆర్.డి.టాటాను ఇంగ్లాండ్‌కు పంపారు. ఇంగ్లాండ్‌లో ఆయన గ్రామర్ స్కూల్‌లో చేరారు. ఇంజనీరింగ్‌పై ఆసక్తి గల ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదవాలనుకున్నారు. అయితే, దేశంలోని యువకులందరూ తప్పనిసరిగా సైన్యంలో కనీసం ఏడాది కాలం పనిచేయాలన్న ఫ్రాన్స్ ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆయన తిరిగి పారిస్ చేరుకోవాల్సి వచ్చింది. ఫ్రెంచి సైన్యంలో ఏడాది పాటు పనిచేశారు.
ఫ్రెంచి సైన్యంలోని లె సాఫిస్ రెజిమెంట్‌లో చేరారు. ఫ్రెంచి, ఇంగ్లిష్ భాషల్లో మంచి పట్టు ఉండటంతో త్వరలోనే కల్నల్ కార్యాలయంలో కార్యదర్శి స్థాయికి ఎదిగారు. సైన్యంలో తప్పనిసరి ఉద్యోగాన్ని ముగించుకున్నాక ఎలాగైనా మళ్లీ ఇంగ్లాండ్ వెళ్లి కేంబ్రిడ్జిలో చేరాలనుకున్నారు. అయితే, కుటుంబ సంస్థలో పనిచేయడానికి భారత్ వచ్చేయాలంటూ తండ్రి కబురు చేయడంతో చేసేది లేక భారత్‌కు వచ్చేశారు.
టాటా సంస్థతో అనుబంధం
తండ్రి పిలుపుతో భారత్ చేరుకున్న జె.ఆర్.డి.టాటా 1925లో టాటా అండ్ సన్స్ కంపెనీలో వేతనం లేని అప్రెంటిస్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1938 నాటికల్లా టాటా అండ్ సన్స్ చైర్మన్‌గా ఎదిగారు. అప్పటికి అది భారత్‌లోనే అతిపెద్ద సంస్థ. ఇక భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకుని, 1929లో ఫ్రెంచి పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరుడిగా మారారు. ఒకవైపు టాటా సంస్థలో పనిచేస్తూనే ఉన్నా, ఆయన దృష్టి అంతా విమానయానంపైనే ఉండేది. తీరికవేళల్లో విమానాన్ని నడపడం నేర్చుకున్నారు.
అప్పట్లో భారత్‌ను పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 1929లో పైలట్ లెసైన్స్ పొందారు. పైలట్ లెసైన్స్ పొందిన తొలి భారతీయుడిగా అరుదైన ఘనత సాధించిన జె.ఆర్.డి.టాటా అక్కడితో ఆగిపోలేదు. టాటా అండ్ సన్స్ సంస్థలో 1932లో టాటా ఎయిర్‌లైన్స్ ప్రారంభించారు. తర్వాతి కాలంలో అదే ఎయిర్ ఇండియాగా మారి, భారత ఉపఖండంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా చరిత్ర సృష్టించింది. ఎయిర్ ఇండియా చైర్మన్‌గా ఆయన దాదాపు ముప్పయ్యేళ్లు సేవలందించారు. వైమానిక రంగంలో ఆయన నైపుణ్యానికి గుర్తింపుగా భారతీయ వైమానిక దళం ఆయనకు పలు గౌరవ పదవులను కట్టబెట్టింది.
ఆనంద భారతమే ఆశయం
జె.ఆర్.డి.టాటా తన ఆధ్వర్యంలో టాటా గ్రూప్‌ను అపారంగా విస్తరించారు. టాటా మోటార్స్, టైటాన్ ఇండస్ట్రీస్, వోల్టాస్, ఎయిర్ ఇండియా, టాటా టీ, టీసీఎస్ వంటి సంస్థలకు పునాదులు వేశారు. వాటన్నిటినీ విజయవంతంగా లాభాల బాటలో నడిపించారు. వ్యాపార విజయాలతో సంతృప్తి చెందకుండా, ధార్మిక సేవా రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. సర్ దోరాబ్జీ టాటా ట్రస్టుకు ట్రస్టీగా సేవలందించారు. బాంబేలో టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్‌మెంట్ ఆస్పత్రిని స్థాపించారు.
ఇదే భారత్‌లోని మొట్టమొదటి కేన్సర్ ఆస్పత్రి. శాస్త్ర సాంకేతిక, సామాజిక, కళా రంగాలలో మేలైన బోధన, పరిశోధనల కోసం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి సంస్థలను స్థాపించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సహా అనేక బిరుదులు, గౌరవాలు దేశ విదేశాల్లో దక్కాయి. అలాగని, తన కంపెనీలను లాభాల బాట పట్టించడం, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం మాత్రమే ఆయన ఆశయం కాదు. భారత్ ఆర్థికశక్తిగా ఎదగడం కంటే, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించే పరిస్థితులు కల్పించడమే తన ఆశయం అంటూ ‘భారతరత్న’ పురస్కారాన్ని స్వీకరిస్తున్నప్పుడు తన మనసులోని మాటను బయటపెట్టారు.
కార్మిక సంక్షేమంలో ప్రభుత్వానికే మార్గదర్శి
కార్పొరేట్ సంస్థలకు కార్మిక సంక్షేమం పెద్దగా పట్టదు. కార్మిక సంక్షేమ చట్టాలు ఎన్ని ఉన్నా, వాటిని అవి మొక్కుబడిగా మాత్రమే పాటిస్తాయి. ఇప్పటికీ చాలా కార్పొరేట్ సంస్థలది ఇదే తీరు. అయితే, కార్మిక సంక్షేమానికి కట్టుదిట్టమైన చట్టాలేవీ లేని కాలంలో సైతం జె.ఆర్.డి.టాటా తన సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగానే పలు పథకాలను అమలు చేసేవారు. అవి ఇప్పటికీ టాటా సంస్థల్లో అమలవుతున్నాయి. ఉద్యోగి ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరిన సమయం నుంచే ‘ఆన్ డ్యూటీ’గా పరిగణించే పద్ధతికి ఆద్యుడు జె.ఆర్.డి.టాటా.
ఉద్యోగి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఒకవేళ ఎలాంటి ప్రమాదానికి గురైనా పరిహారం చెల్లించేలా ఆయన తన కంపెనీ నిబంధనలను రూపొందించారు. తర్వాత ఇవే నిబంధనలతో మన దేశంలో కార్మిక పరిహార చట్టం (వర్క్‌మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్) అమలులోకి వచ్చింది. తమ సంస్థల్లో పనిచేసే కార్మికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఉచిత వైద్యం, ప్రమాద పరిహారం తదితరమైనవి కల్పించడంలో టాటా సంస్థలు దేశంలోని మిగిలిన సంస్థలన్నింటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. పారిశ్రామికవేత్తగా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన జె.ఆర్.డి.టాటా కిడ్నీ సమస్యతో బాధపడుతూ 1993 నవంబర్ 29న జెనీవాలో తుదిశ్వాస విడిచారు. పారిస్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
జె.ఆర్.డి.టాటా చెప్పిన మాటలు
⇒ డబ్బు ఎరువులాంటిది. పోగుపెడితే ఇంకిపోతుంది. విస్తరిస్తే ఏపుగా పెరుగుతుంది.
⇒ ఏ పనినైనా అనుమానంతో కాదు, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాలి.
⇒ సాటి మనుషులకు ప్రేమగా దిశానిర్దేశం చేయగల వాళ్లే నాయకులు కాగలరు.
⇒ లోపభూయిష్టమైన ప్రాధాన్యాలు, సాధ్యంకాని లక్ష్యాలే చాలా సమస్యలకు మూలం.