న్యూఢిల్లీ : కర్ణాటకలో బీజేపీ శనివారం బలనిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్ధానం ఆదేశించిన నేపథ్యంలో ధర్మాసనం తీర్పును చారిత్రక విజయంగా వర్ణించారు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్. ఈ సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం కర్ణాటకలో ఏర్పడిన హంగ్ పరిస్థితుల దృష్ట్యా సర్కారియా కమిషన్ సూచనలను తెరపైకి తీసుకురావడం వల్ల మేలు జరుగుతుందని తెలిపారు.
సర్కారియా కమిషన్ మూడో పేరాలో పేర్కొన్న ‘అతిపెద్ద రాజకీయ పార్టీ అంశం’ లోతుగా పరిశీలించడానికి అవకాశం దొరికిందన్నారు. సర్కారియా కమిషన్ సూచించిన ఈ ‘అతిపెద్ద రాజకీయ పార్టీ అంశానికి’ ఉన్న న్యాయబద్దతను పరిశీలించడానికి గాను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను 10 వారాల పాటు వాయిదా వేసిందని తెలిపారు. ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించి, మార్గదర్శకాలను రూపొందిస్తే ఇక భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడకుండా చూడవచ్చని పేర్కొన్నారు.
కాగా కర్ణాటక అసెంబ్లీలో బీజేపీని శనివారం బలనిరూపణ చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన బలపరీక్ష నిర్వహించాలని, చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించాలని బీజేపీ అడగడాన్ని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం... యడ్యూరప్ప ఎటువంటి విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి వీలులేదని ఆదేశాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment