సాక్షి, న్యూఢిల్లీ : కన్నడ నాట రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. క్షణక్షణానికి మారుతున్న పరిణామాలు తీవ్ర ఉత్కంఠతను రాజేస్తున్నాయి. కర్ణాటక ప్రధాన పార్టీల ఎత్తులకు పైఎత్తులు, రాజకీయాలు నాటకీయతను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కన్నడ రాజకీయాలను మరో కీలక మలుపు తిప్పింది. ఒకవైపు అసెంబ్లీలో బలనిరూపణకు ఎవరికి వారు గేమ్‌ప్లాన్‌లో మునిగి ఉండగానే, బేరసారాలు జోరుగా సాగుతుండగానే సుప్రీంకోర్టు సంచలన సూచన చేసింది. దీంతో కన్నడ రాజకీయం మరింత రసకందాయంలో పడింది.
తగిన సంఖ్యాబలం ఉన్నప్పుడు శనివారం శాసనసభలో బల నిరూపణ చేపట్టడం ఉత్తమమని సుప్రీంకోర్టు శుక్రవారం నాటి వాదనల సందర్భంగా స్పష్టం చేసింది. అంతేకాదు బీజేపీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పేర్లను ఎందుకు చెప్పలేకపోతున్నారని కూడా కోర్టు ప్రశ్నించింది. విశ్వాస పరీక్షలో గవర్నర్ నిర్ణయమే కీలకమని, ఇది ఓ నెంబర్ గేమ్ అని, ఎవరికి మెజార్టీ ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అటు తక్షణ విశ్వాస పరీక్షపై బీజేపీ నీళ్లు నములుతున్న సమయంలో ఫ్లోర్ టెస్టుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తూ చకచకా పావులు కదిపింది. ఎట్టకేలకు బీజేపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బలనీరూపణకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. అదీ కూడా ప్రో టెం స్పీకర్ (తాత్కాలిక స్పీకర్) ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. విశ్వాస పరీక్ష ఎలా నిర్వహించాలనేది ప్రోటెం స్పీకర్ నిర్ణయానికే వదిలేసింది. సభలో బలనిరూపణ పూర్తయ్యే వరకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పూర్తి భద్రత కల్పించాలని చెప్పింది. దీంతోపాటు యడ్యూరప్ప నియమించిన ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే నియామకాన్నికూడా నిలిపి వేసింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించింది. జేడీఎస్ మద్దతుతో తమకు విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రో టెం స్పీకర్ ఎంపిక, నిర్ణయం ప్రధానం.
ఇది ఇలా ఉంటే ఈ విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప అసెంబ్లీ విశ్వాసాన్ని నిరూపించుకోలేకపోతే 3రోజుల ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప చరిత్రలో నిలిచిపోతారు. ఒకవేళ విజయం సాధిస్తే దక్షిణాదిలో పాగా వేయాలన్న బీజేపీ కల సాకారమైనట్టే. కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారిన బలనిరూపణకు కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం సాయంత్రం ఏం జరగబోతుందనేది సర్వత్రా ఉత్కంఠకు గురిచేస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో హోటళ్లలో బస చేసిన కర్ణాటక ఎమ్మెల్యేలు అసెంబ్లీ బలనిరూపణ కారణంగా తిరిగి వెంటనే బెంగళూరుకు బయలుదేరాల్సి ఉంది. కీలక సమావేశం అనంతరం ఈ రోజు అర్థరాత్రి వారు కర్ణాటకకు బయలుదేరి వెళ్లనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment