బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప బల నిరూపణకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం బల నిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాలను బీజేపీ పాటిస్తుందన్నారు. మెజార్టీ సాధించేంతా ఎమ్మెల్యేల మద్దతు తమకుందని స్పష్టం చేశారు. బలపరీక్షలో 100 శాతం నెగ్గుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు అసెంబ్లీ సమావేశం నిర్వహించేలా చీఫ్ సెక్రటరీతో చర్చిస్తానన్నారు.
సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నాం..
రేపే బలనిరూపణ చేసుకోవాలనే ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ శోభా కరాండ్లజే అన్నారు. రేపు అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. బల నిరూపణకు తమ పార్టీ సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల పిటిషన్లను విచారించిన జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ భూషణ్, జస్టిస్ బాబ్డేలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ శనివారం బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు బలపరీక్ష జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment