ధర్మాసనంపై చెరగని ముద్ర | Mangari Rajender Write About Justice | Sakshi
Sakshi News home page

ధర్మాసనంపై చెరగని ముద్ర

Published Fri, Jun 22 2018 1:45 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

Mangari Rajender Write About Justice - Sakshi

న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకోవటం సమంజసం కాదన్న చలమేశ్వర్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టుని ప్రభావితం చేయరాదని అన్నారు. ఆ విషయంలోనే ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి ఎన్నో లేఖలు రాశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే మీడియా సమావేశానికి నేతృత్వం వహించారు. మీడియా సమావేశాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు తాము గీసుకున్న పరిధిని దాటితే తప్ప ప్రజాస్వామ్య ప్రమాదం ఏమిటో అర్థం కాదు. అస్వతంత్రతలో న్యాయ వ్యవస్థ నలిగిపోతున్న ఈ సమయంలో చలమేశ్వర్‌ పదవీ విరమణ కించిత్తు బాధను కలిగించినా మరెందరో ఆయన స్ఫూర్తిని అందుకుంటారని ఆశ.

హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక పద్ధతిలో పారదర్శకత లేదని గళమెత్తడంతోపాటు, సుప్రీంకోర్టులో అమల వుతున్న ఏకపక్ష విధానాలపై ముగ్గురు సహచర న్యాయమూర్తులతో కలిసి మీడియా సమావేశం నిర్వ హించి సంచలనం సృష్టించిన సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నేడు (శుక్రవారం) పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన తన పదవీ కాలంలో ఇచ్చిన వివిధ తీర్పులు శిఖరాయమానమై నవి. ముఖ్యంగా కొలీజియం పనితీరు విషయంలో జస్టిస్‌ చలమేశ్వర్‌ అభ్యంతరాలు గమనించదగ్గవి. ఒకరిని న్యాయమూర్తిగా ఎందుకు ఎంపిక చేశారో, ఎందుకు చేయలేదో కారణాలు నమోదు చేయ కుండా నియామక ప్రక్రియ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై స్పష్టత రాని కారణంగా ఆయన కొంత కాలంపాటు కొలీజియం సమావేశా లకు కూడా హాజరుకాలేదు.

జాతీయ న్యాయమూ ర్తుల నియామక కమిషన్‌ని కొట్టివేసిన తీర్పులో చలమేశ్వర్‌ తన అస మ్మతి తీర్పుని వెలువరించారు. కొలీజియం విధానం పారదర్శకంగా లేదని వ్యాఖ్యా నించారు. న్యాయ మూర్తుల ఎంపిక విధానంలో న్యాయమూర్తుల మాటకే ప్రాధాన్యం ఉండటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పాల నలో పారదర్శక తకి అధిక ప్రాధాన్యత ఉండాలని కూడా సూచించారు. హైకోర్టు కొలీజియమ్‌ ఎంపిక చేసిన న్యాయమూర్తుల పేర్లను తిరస్కరించి మళ్లీ తిరిగి సుప్రీంకోర్టు పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల అనవసర ఊహాగానాలకి అవ కాశం ఏర్పడుతుంది. ఈ విషయంలో జవాబుదారీ తనం లేదు. ఆ రికార్డులు ఎవరికీ అందుబాటులో ఉండవు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి కూడా. అవి చూడాలని అనుకున్న వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే తప్ప చూడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితివల్ల సుప్రీంకోర్టు విశ్వసనీయత పెరగదు. అది ఈ దేశ ప్రజలకి మంచి చేయదు. న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వాన్ని పూర్తిగా దూరం పెట్టడం సరైంది కాదని ఆయన భావించారు. అయితే మెజారిటీ నిర్ణయం మరోలా ఉన్నందువల్ల చట్టాన్ని ఇంకా పరిశీలించదల్చు కోలేదని చలమేశ్వర్‌ తన అసమ్మతి తీర్పులో ప్రక టించారు.

ఆయన 19 సంవత్సరాలు న్యాయవాదిగా, ఆ తరువాత సీనియర్‌ న్యాయవాదిగా, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఆ తరువాత న్యాయమూర్తిగా పనిచేశారు. గౌహతీ, కేరళ హైకో ర్టుల ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిం చారు. 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం వేసవి సెలవులకి ముందు చివరి రోజైన గత నెల 18న చలమేశ్వర్‌ ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, మరో న్యాయమూర్తి జి.వై. చంద్రచూడ్‌లతో కలసి ధర్మాసనంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయ వాదుల సంఘం ఏర్పాటు చేయదల్చిన వీడ్కోలు సమావేశాన్ని ఆయన తిరస్కరించారు. మొన్న జన వరి 12న ముగ్గురు సహచర సుప్రీంకోర్టు న్యాయ మూర్తులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలని ఎత్తిచూపారు. ఈ కారణంవల్ల ఆయన ప్రధాన న్యాయమూర్తితోబాటు ధర్మాసనంలో ఉంటారా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. కానీ ఆయన సుప్రీంకోర్టులో కొనసాగుతున్న సాంప్రదా యాన్ని గౌరవించారు.

తన తీర్పుల ద్వారా, తన ఉత్తరాల ద్వారా, తన చర్యల ద్వారా చలమేశ్వర్‌ సుప్రీంకోర్టులోని రెండవ కోర్టు గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఆయన నేతృత్వం వహించిన మీడియా సమావేశం దేశ న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని ఎత్తిచూపిన సమా వేశం అది. ఆయన రాసిన ఉత్తరాల ప్రభావంగానీ, మీడియా సమావేశ ఫలితాలుగానీ వెనువెంటనే కన్పించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అవి సత్ఫలి తాలని ఇస్తాయి. తన ముందుకొచ్చిన భారత వైద్య మండలి(ఎంసీఐ) కేసును జస్టిస్‌ చలమేశ్వర్‌ ఒక బెంచ్‌కు పంపడం, ప్రధాన న్యాయమూర్తి మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ తానేనని చెబుతూ ఆ ఉత్తర్వులు నిలిపే యడం సంచలనం కలిగించింది. తన కేసుకి తానే న్యాయమూర్తి కాకూడదన్న ప్రాథమిక న్యాయసూ త్రానికి సుప్రీంకోర్టు తిలోదకాలు ఇచ్చింది.

ఐటీ చట్టంపై సంచలనాత్మక తీర్పు
జస్టిస్‌ చలమేశ్వర్‌ మరో న్యాయమూర్తి రోహింగ్టన్‌ ఫాలీ నారీమన్‌తో కలిసి భావ ప్రకటనా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తున్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం లోని సెక్షన్‌ 66ఏ రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడు తుంది. అలాగే ఆధార్‌ కార్డు లేని కారణంగా సబ్సి డీలు ఏ పౌరునికి నిరాకరించడానికి వీల్లేదన్న బెంచ్‌లో ఆయన భాగస్వామి.

ఇక లేఖల విషయానికి వస్తే– ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుచిత సామీప్యత ఉందని ఆరోపిస్తూ ఆయన రాసిన లేఖ శిఖరాయమానమైనది. మన హైకోర్టు న్యాయమూ ర్తుల నియామకాలలో ఆ ఇద్దరి అభిప్రాయాలు దాదాపు ఒకేలా ఉండటం బయటి రాష్ట్రాలలోని వ్యక్తులని ఆశ్చర్యానికి గురి చేసింది.

గళం విప్పిన న్యాయమూర్తులు
న్యాయ పరిపాలనలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతు న్నప్పుడు నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు చల మేశ్వర్‌ నేతృత్వంలో గొంతెత్తడం దేశ చరిత్రలో అరు దైన సంఘటన. చరిత్రాత్మక సన్నివేశం. న్యాయవ్యవ స్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని ఆ సమా వేశంలో బహిర్గతం చేశారు చలమేశ్వర్‌. న్యాయమూ ర్తులు మీడియాతో మాట్లాడకూడదన్న విమర్శలు చెలరేగాయిగానీ వారు తమ తీర్పుల గురించి మాత్రమే మాట్లాడకూడదు. న్యాయ పరిపాలన గురించి అభిప్రాయాలు వెల్లడించడంలో తప్పేం లేదు. అది న్యాయమూర్తుల నడవడికకు విరుద్ధం కాదు.

కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేశ్‌ మహేశ్వరి కొలీజియమ్‌ సిఫారస్‌ చేసిన ఓ సీనియర్‌ జిల్లా జడ్జి మీద దర్యాప్తు చేయడం న్యాయ పరిపాలనలో ప్రభుత్వ జోక్యమని చలమేశ్వర్‌ స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కర్ణాటక రాష్ట్రంలో జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తిగా పని చేస్తున్న పి.క్రిష్ణ భట్‌ని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకాన్ని నిలిపి వేసింది. కానీ ఆయనతోపాటు పంపిన ఇతరుల పేర్లను ఆమోదించింది. ఓ మహిళా న్యాయమూర్తి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు కారణాన్ని కేంద్ర ప్రభుత్వం చూపింది. ఈ విష యమై అంతకుముందే ప్రధాన న్యాయమూర్తి విచా రణ జరిపి అందులో నిజం లేదని తేల్చారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ రాసిన లేఖతో క్రిష్ణభట్‌పై విచారణ నిలిచి పోయింది. 

జస్టిస్‌ జోసెఫ్‌ నియామకం వ్యవహారం
సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రా పేరుని, ఉత్తరాఖండ్‌ ప్రధాన న్యాయమూర్తి కె.ఎం. జోసఫ్‌ పేర్లని సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇందూ మల్హోత్రా పేరుని ఆమోదించి కేఎమ్‌ జోసఫ్‌ పేరుని కొన్ని బలహీ నమైన కారణాలు పేర్కొంటూ తిరిగి పంపించింది. ఈ విషయమై చలమేశ్వర్‌ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దాంతో కొలీజియం సమావేశమై తిరిగి జస్టిస్‌ జోసెఫ్‌ పేరును సిఫార్సు చేయాలని సూత్ర ప్రాయంగా అంగీకరించింది. కానీ ఇంతవరకూ ఆ పేరును తిరిగి పంపలేదు. చలమేశ్వర్‌ పదవీ విర మణ చేసే వరకు కొలీజియం సమావేశం జరుగ లేదు. ఆయన పేరుని పరిశీలనకు పంపిస్తారో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. చలమేశ్వర్‌ మాదిరిగా కొత్తగా కొలీజియంలో చేరిన న్యాయ మూర్తి సిక్రీ మాట్లాడుతారా అన్నది వేచి చూడాలి. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నుంచి ఆయన వీడ్కోలుని తీసుకోలేదు కానీ ఆయన పనిచేసిన చివరి రెండు రోజులు సీనియర్‌ న్యాయవాదులు ఆయనకు సేవలను ఎంతగానో కొనియాడి ఆయ నను జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నాతో పోల్చారు. ఖన్నా చిత్రçపటం చలమేశ్వర్‌ నిర్వహించిన రెండవ కోర్టులో ఉంటుంది. సుప్రీంకోర్టు హాల్స్‌లో వ్రేలాడదీసిన చిత్ర పటం అదొక్కటే. భవిష్యత్తులో చలమేశ్వర్‌ చిత్రపటా నికి కూడా అక్కడ స్థానం లభించవచ్చు.

న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియ మించుకోవటం సమంజసం కాదన్న చలమేశ్వర్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీం కోర్టుని ప్రభావితం చేయరాదని అన్నారు. ఆ విష యంలోనే ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి ఎన్నో లేఖలు రాశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే మీడియా సమావేశానికి నేతృత్వం వహించారు. మీడియా సమావేశాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు తాము గీసుకున్న పరిధిని దాటితే తప్ప ప్రజా స్వామ్య ప్రమాదం ఏమిటో అర్థం కాదు. దాని నేపథ్యం బోధపడదు. అస్వతంత్రతలో న్యాయ వ్యవస్థ నలిగిపోతున్న ఈ సమయంలో చలమేశ్వర్‌ పదవీ విరమణ కించిత్తు బాధను కలిగించినా మరెం దరో ఆయన స్ఫూర్తిని అందుకుంటారని ఆశ.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా చల మేశ్వర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయంత్రం ఓ అభినందన సమావేశం జరిగింది. అప్పుడు నేను మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నాను. నేను న్యాయవ్యవస్థ మీద రాసిన ‘హాజిర్‌హై’ కవితా సంపుటిని ఇచ్చాను. దాన్ని మెచ్చుకుంటూ ఆయన నాకు ఉత్తరం రాశారు. అందులో ‘మూడు తలల రాజసింహం’ అన్న ఓ కవిత ఉంటుంది. ఈ చరణాలు అందులో ఉన్నాయి.
‘... మూడు తలల్తో రాజసింహం కుర్చీమీద నిఘా వేసుక్కూర్చుంటుంది’
ఇప్పటికీ పరిస్థితి మారలేదు. పైపెచ్చు దుర్భ రంగా తయారవుతోంది.

వ్యాసకర్త కవి, రచయిత 
మంగారి రాజేందర్‌
94404 83001

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement