ఆధార్‌ రాజ్యాంగబద్ధమే | SUPREME COURT'S JUDGEMENT ON AADHAAR | Sakshi
Sakshi News home page

ఆధార్‌ రాజ్యాంగబద్ధమే

Published Thu, Sep 27 2018 3:10 AM | Last Updated on Thu, Sep 27 2018 11:44 AM

 SUPREME COURT'S JUDGEMENT ON AADHAAR - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఆధార్‌ పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని దీని ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందనేది పూర్తి అవాస్తవమని పేర్కొంది. 12 అంకెల ఆధార్‌ నెంబర్‌ను తప్పనిసరి చేసే సేవలను పరిమితం చేస్తూ బుధవారం తీర్పునిచ్చింది. బ్యాంకు అకౌంట్లు, మొబైల్‌ కనెక్షన్లు, స్కూల్‌ అడ్మిషన్లకు ఆధార్‌ తప్పనిసరి కాదని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 తీర్పుతో స్పష్టం చేసింది.

ఈ తీర్పులో జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒక్కరే ఆధార్‌ చట్టంపై భిన్నమైన తీర్పు చెప్పారు. మిగిలిన వారంతా ఆధార్‌ రాజ్యాంగబద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని కోర్టు తెలిపింది. ఆదాయపు పన్ను (ఐటీ) దాఖలు, పాన్‌ (పీఏఎన్‌) నెంబరు కేటాయింపులో ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది. పలువురు న్యాయ నిపుణులు ఈ తీర్పు సమతూకంగా ఉందని అభిప్రాయపడ్డారు.

సెక్షన్‌ 57 అసంబద్ధం: సుప్రీం
టెలికాం కంపెనీలతోపాటు, కార్పొరేట్‌ సంస్థలకు బయోమెట్రిక్‌ ఆధార్‌ డేటాను పొందేందుకు అనుమతించిన ఆధార్‌ (ఆర్థిక, ఇతర సబ్సిడీలు, పథకాలు, సేవల లబ్ధి కల్పించే) చట్టం – 2016లోని సెక్షన్‌ 57ను సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆధార్‌ డేటా ఆర్నెల్ల కంటే ఎక్కువరోజులు దాచుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. జస్టి‹స్‌ చంద్రచూడ్‌ భిన్నమైన తీర్పునిచ్చారు. ఆధార్‌చట్టాన్ని పార్లమెంటులో ద్రవ్యబిల్లుగా ఆమోదించడాన్ని ఆయన తప్పుబట్టారు.

అయితే సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతోపాటుగా ధర్మాసనంలోని ఇతర జడ్జీలు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఖన్విల్కర్‌లు దీంతో విభేదించారు. ఆధార్‌ బిల్లును ద్రవ్యబిల్లుగా లోక్‌సభ ఆమోదించడాన్ని సమర్థించారు. ఆధార్‌ ద్వారా సమాజంలో వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని.. ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరేందుకు వీలుంటుందని ఈ నలుగురు పేర్కొన్నారు. ఆధార్‌ ఓ ప్రత్యేకమైన వ్యవస్థ అని.. దాన్ని అలాగే ఉంచేందుకు ప్రయత్నించాలని కేంద్రానికి సూచించారు. ‘ఆధార్‌ పేదలకు గౌరవాన్ని కల్పిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛకన్నా గౌరవం దక్కడం ముఖ్యం’ అని 1,448 పేజీల తీర్పులోని కొన్ని అంశాలను చదువుతూ జస్టిస్‌ సిక్రీ పేర్కొన్నారు. ఓ మంచి పని జరుగుతున్నప్పుడు కాస్తంత చెడు జరగటం సహజమేనన్నారు.

‘పౌరులపై నిఘా పెంచేందుకే ఆధార్‌ను ప్రభుత్వం ప్రతిచోటా తప్పనిసరి చేస్తోందని పిటిషనర్ల వాదన. వ్యక్తిగత గోప్యత హక్కుకు విఘాతం కలుగుతోందంటున్నారు. ప్రభుత్వం ఆధార్‌ వ్యవస్థ భద్రతను మరింత కట్టుదిట్టంగా మార్చాలి’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్నట్లుగా.. జాతీయ భద్రత పేరుతో ఆధార్‌ డేటాను సేకరించే అంశాన్ని కిందిస్థాయి ఉద్యోగులకు కట్టబెట్టడం సరికాదని పేర్కొంది. కనీసం జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారికి అధికారాన్ని అప్పజెప్పాలంది. ఆధార్‌ చట్టబద్ధతపై మాజీ హైకోర్టు న్యాయమూర్తి కేఎస్‌ పుట్టుస్వామి సహా 31 మంది పిటిషనర్లు వేసిన వ్యాజ్యాలను గతంలోనే (మే 10వ తేదీ) విచారణ పూర్తిచేసిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

బీజేపీకి చెంపపెట్టు: కాంగ్రెస్‌
ప్రైవేటు సంస్థల చేతికి ఆధార్‌ డేటాను అందించే ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడాన్ని కాంగ్రెస్‌ స్వాగతించింది. ‘ఈ చట్టంలోని సెక్షన్‌ 57ను కోర్టు తప్పుబట్టడం హర్షదాయకం. ప్రైవేటు సంస్థలు ఆధార్‌ డేటాను తీసుకోవడం ఆపేస్తాయి’ అని ట్విట్టర్‌లో పార్టీ పేర్కొంది. ప్రైవేటు సంస్థలనుంచి ఆధార్‌ హక్కులను తొలగించడం.. అధికార బీజేపీకి చెంపపెట్టు అని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ వ్యాఖ్యానించారు.  

మోదీ ప్రభుత్వ విజయమిది: బీజేపీ
ఆధార్‌ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు.. పేదలకు, పేదల పక్షపాత మోదీ ప్రభుత్వానికి దక్కిన విజయంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధార్‌ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలన్నీ భగ్నమయ్యాయన్నారు.ఈ తీర్పు చారిత్రకమని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ఆధార్‌ ద్వారా ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లీకేజీలు అరికట్టడంతో ప్రతిఏటా రూ.90వేల కోట్లు ఆదా అవుతున్నాయని ఆయన వెల్లడించారు.   

నిఘా అవాస్తవం: యూఐడీఏఐ
ఆధార్‌ ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడం, నిరంతరం వారిపై నిఘా ఉంటుందన్న వార్తల్లో వాస్తవం లేదని యూఐడీఏఐ (యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) పునరుద్ఘాటించింది. ఆధార్‌ ద్వారా కల్పించే కనీస వివరాల ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం కలగదు. సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని వెల్లడించింది. పౌరులపై నిఘా ఉంచడం కూడా ఆధార్‌ వల్ల సాధ్యం కాదు. ఈ డేటాను కాపాడేందుకు కూడా ఆధార్‌ వద్ద పటిష్టమైన భధ్రతావ్యవస్థ ఉంది. పరిమిత ప్రభుత్వం రాజ్యాంగపరమైన విశ్వాసాన్ని ఆధార్‌ చట్టం కల్పిస్తోంది’ అని యూఐడీఏఐ సీఈవో అజయ్‌ అన్నారు.

ద్రవ్యబిల్లు కాదు: జస్టిస్‌ చంద్రచూడ్‌
రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగొద్దనే ప్రభుత్వం ద్రవ్యబిల్లుగా మార్చి లోక్‌సభ ఆమోదంతో సరిపెట్టిందని జస్టిస్‌ చంద్రచూడ్‌ తన తీర్పులో వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 110లోని పలు నిబంధనలు.. ఆధార్‌ చట్టాన్ని ద్రవ్యబిల్లుగా పరిగణించడానికి పూర్తి వ్యతిరేకమన్నారు. ఆధార్‌ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ‘మొబైల్‌ ఫోన్లు భారతీయుల జీవనంలో భాగమైపోయాయి. దీన్ని ఆధార్‌తో జతపర్చడం వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛలకు విఘాతం కలిగిస్తుంది. మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు వెంటనే వినియోగదారుల ఆధార్‌ డేటాను తొలగించాలి. బ్యాంకు అకౌంట్లను తెరిచేవారూ ఆధార్‌ వివరాలను పొందుపర్చడం సరికాదు. అంటే బ్యాంకు అకౌంట్‌ తెరిచే ప్రతి వ్యక్తిపై నిఘా పెట్టేందుకు ఆయనేమైనా ఉగ్రవాదా?’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు.

వివిధ ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో ఉండే ఆధార్‌ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆధార్‌ ద్వారా సమాచార గోప్యతకు భంగం కలిగిస్తుందంటూ యూఐడీఏఐ కూడా అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు. ఆధార్‌ లేకుండా భారత్‌లో జీవించడం దాదాపు కష్టమేననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పౌరుడి ప్రతి వివరాన్ని ఆధార్‌తో జతపరుస్తూ పోతే.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘన జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరుల డేటాకు భద్రతనిచ్చేందుకు యూఐడీఏఐకు సంస్థాపరమైన బాధ్యతలేమీ లేవన్నారు. వ్యక్తిగత గోప్యతను కాపాడలేని పక్షంలో ఇతర హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుందని.. దీనికి భద్రత కల్పించే సరైన చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటు వ్యవస్థదేనన్నారు.



వాడివేడిగా వాదనలు.. అయినా!
ఆధార్‌ చట్టబద్ధతపై విచారణ సందర్భంగా కోర్టు గదిలో.. కోర్టు బయటా వాడివేడి చర్చలు జరిగాయని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇవేవీ ఆధార్‌కు వ్యతిరేకంగానో, అనుకూలంగానో నిర్ణయం తీసుకునేలా తమపై ప్రభావితం చేయలేదని స్పష్టం చేసింది. ఆధార్‌తో అనుసంధానమైన భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగానే వ్యవహరించామని తీర్పు సందర్భంగా పేర్కొంది. మేధావుల దగ్గర్నుంచి.. సామాన్య ప్రజల వరకు ఇంటర్వ్యూలు, కథనాలు, గల్లీ చర్చల్లో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని కోర్టు తెలిపింది.

‘ఇరువర్గాల భావోద్వేగాలు, ఆవేశకావేశాలు, బాధలన్నింటినీ విచారణ సందర్భంగా అర్థం చేసుకున్నాం. పౌరులకు కల్పించిన హక్కులు, దేశభద్రతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకునే మేం తీర్పును వెలువరించాం’ అని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘విచారణ సందర్భంగా ఆధార్‌కు వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించిన అంశాలను పేర్కొన్నారు. ఆధార్‌కు వ్యతిరేకంగా పిటిషన్‌ వేసిన వారేమో.. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందని వాదించారు’ అని జస్టిస్‌ సిక్రీ వెల్లడించారు.


వ్యక్తిగత సమాచారం భద్రమే

ఆధార్‌ కార్డు దారుల వ్యక్తిగత సమాచార భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని చట్టం ఇక నుంచి భద్రంగా ఉంచుతుందని,ప్రభుత్వంకాని, ప్రైవేటు సంస్థలు కాని దాన్ని పొందలేవని అభిప్రాయపడింది.

అక్రమ వలసదారులకు వద్దు
అక్రమ వలసదారులకు ఆధార్‌ కార్డులు జారీ కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడం కోసం అక్రమ వలసదారులు ఆధార్‌ కార్డులు పొందుతున్నారంది.


‘భద్రతా కారణాలు’ చెల్లవు
ఆధార్‌ చట్టంలోని 33వ సెక్షన్‌ను కోర్టు కొట్టివేసింది. దేశ భద్రత దృష్ట్యా వ్యక్తుల ఆధార్‌ సమాచారాన్ని బలవంతంగా  సేకరించడానికి ఈ సెక్షన్‌ ప్రభుత్వానికి అధికారం కల్పించింది.ఇప్పుడీ సెక్షన్‌ను కొట్టివేయడంతో భద్రతా కారణాలు చెప్పి ఆధార్‌ వివరాలు లాక్కోవడం కుదరదు.

పాన్‌–ఆధార్‌ లింక్‌..
ఆధార్‌తో పాన్‌ నంబర్‌ అనుసంధానం 50 శాతానికి పైగా పూర్తయింది. ఆధార్‌తో పాన్‌ లింక్‌ను కోర్టు బుధవారం సమర్థించిన నేపథ్యంలో తాజాగా విడుదల అయిన నివేదికలో ఈ విషయం తేలింది. సోమవారం నాటికి 21,08,16,676 పాన్‌ నంబర్‌లు ఆధార్‌కు అనుసంధానం అయ్యాయి. ఇప్పటివరకు జారీ చేసిన 41.02 కోట్ల పాన్‌ కార్డుల్లో 40.01 కోట్ల కంటే ఎక్కువ కార్డులు వ్యక్తిగతమైనవి కాగా మిగతావి పన్ను చెల్లించే కంపెనీలు, ఇతర విభాగాల పేరిట ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనుసంధానం గడువును ఆదాయపన్ను శాఖ గతంలో ఐదుసార్లు పొడిగించింది.

ఆధార్‌ కేసు నడిచిందిలా...
ఆధార్‌ రాజ్యాంబద్ధతపై న్యాయస్థానంలో దాఖలైన కేసు తొమ్మిదేళ్లు నడిచింది.ఆధార్‌ను వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ సందర్భంగా కోర్టులు భిన్న వ్యాఖ్యలు చేశాయి. చివరకు ఆధార్‌ రాజ్యంగబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు కొనసాగిన క్రమమిది


► 2009, జనవరి: యుఐడీఏఐ ఏర్పాటు.  
► 2010, సెప్టెంబర్‌: తొలి ఆధార్‌ నెంబరు కేటాయింపు.
► డిసెంబర్‌: పార్లమెంటులో ఆధార్‌ బిల్లు.
► 2011 సెప్టెంబర్‌: 10కోట్లకు చేరిన ఆధార్‌ పొందిన వారి సంఖ్య.
► డిసెంబర్‌: ఆధార్‌ బిల్లుపై స్టాండింగ్‌ కమిటీ రిపోర్టు.
► 2012, నవంబర్‌: ఆధార్‌ చట్టబద్ధతను సవాలు చేస్తూ రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కేఎస్‌ పుట్టుస్వామి, మరికొందరు సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు.
►  2013, నవంబర్‌: ఈ కేసులో ప్రతివాదులుగా చేరాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం ఆదేశం.
► 2015, అక్టోబర్‌: ఆధార్‌ స్వచ్ఛందమేనంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
► 2016, మార్చి 3: మళ్లీ లోక్‌సభకు ఆధార్‌ బిల్లు–2016. ఆర్థిక బిల్లుగా దీనికి ఆమోదం. ఆధార్‌ పొందిన వారి సంఖ్య 98 కోట్లు.
► సెప్టెంబర్‌: అమల్లోకి వచ్చిన ఆధార్‌ చట్టం.
► 2017,మే: ఆధార్‌ బిల్లును ఆర్థిక బిల్లుగా పరిగణించడంపై సుప్రీంలో కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ పిటిషన్‌.
►  2017, ఆగస్టు 24: వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ధర్మాసనం రూలింగ్‌.
► 2018, జనవరి 17: ఆధార్‌ కేసు విచారణను ప్రారంభించిన సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం.
► సెప్టెంబర్‌ 26: ఆధార్‌ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు. చట్టంలోని కొన్ని నిబంధనలను కొట్టివేత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement