న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వాలా వద్దా అనే అంశానికి ఒకవైపు రాజ్యాంగం ప్రసాదించిన మానవహక్కులు, మరోవైపు ప్రత్యేక శాసనాలు, ఇంకోవైపు ప్రత్యేక వివాహ చట్టం ఉన్నాయి. ఇంతటి ప్రధానమైన అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనమే తేల్చాలి’’ అని వ్యాఖ్యానించింది.
ఇలాంటి వివాహాలను అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభిప్రాయాన్ని వెల్లడించడం తెల్సిందే. ‘‘భారతీయ కుటుంబ వ్యవస్థకు స్వలింగ వివాహాలు పూర్తి విరుద్ధం. వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతుల్యతను ఇవి భంగపరుస్తాయి’ అంటూ ఆదివారం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ‘‘ఈ అంశంలో శాసన అంశాలు, మానవ హక్కులు ఇమిడి ఉన్నాయి. దీనిని రాజ్యాంగ ధర్మాసనమే పరిష్కరిస్తుంది’ అంటూ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఏప్రిల్ 18వ తేదీకి వాయిదావేసింది. ‘స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఎదురయ్యే సమస్యల గురించీ ఆలోచించాలి.
ఇద్దరు తండ్రులు లేదా కేవలం ఇద్దరు తల్లులు మాత్రమే జంటగా జీవించే కుటుంబంలో ఎదిగే పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది ? ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన పార్లమెంట్ ఇలాంటి విషయాలను సమీక్షించాల్సి ఉంది. ఈ కేసు తీర్పు మొత్తం భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే కేసులో భాగస్వామ్య పక్షాల వాదోపవాదనలను విస్తృతస్థాయిలో వినాలి’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఒక న్యాయవాది కోరగా రాజ్యాంగ ధర్మాసనాల విచారణలన్నీ ప్రత్యక్ష ప్రసారాలు అవుతున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment