Indian family system
-
‘స్వలింగ వివాహం’పై ధర్మాసనం: సుప్రీం
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వాలా వద్దా అనే అంశానికి ఒకవైపు రాజ్యాంగం ప్రసాదించిన మానవహక్కులు, మరోవైపు ప్రత్యేక శాసనాలు, ఇంకోవైపు ప్రత్యేక వివాహ చట్టం ఉన్నాయి. ఇంతటి ప్రధానమైన అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనమే తేల్చాలి’’ అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వివాహాలను అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభిప్రాయాన్ని వెల్లడించడం తెల్సిందే. ‘‘భారతీయ కుటుంబ వ్యవస్థకు స్వలింగ వివాహాలు పూర్తి విరుద్ధం. వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతుల్యతను ఇవి భంగపరుస్తాయి’ అంటూ ఆదివారం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ‘‘ఈ అంశంలో శాసన అంశాలు, మానవ హక్కులు ఇమిడి ఉన్నాయి. దీనిని రాజ్యాంగ ధర్మాసనమే పరిష్కరిస్తుంది’ అంటూ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఏప్రిల్ 18వ తేదీకి వాయిదావేసింది. ‘స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఎదురయ్యే సమస్యల గురించీ ఆలోచించాలి. ఇద్దరు తండ్రులు లేదా కేవలం ఇద్దరు తల్లులు మాత్రమే జంటగా జీవించే కుటుంబంలో ఎదిగే పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది ? ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన పార్లమెంట్ ఇలాంటి విషయాలను సమీక్షించాల్సి ఉంది. ఈ కేసు తీర్పు మొత్తం భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే కేసులో భాగస్వామ్య పక్షాల వాదోపవాదనలను విస్తృతస్థాయిలో వినాలి’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఒక న్యాయవాది కోరగా రాజ్యాంగ ధర్మాసనాల విచారణలన్నీ ప్రత్యక్ష ప్రసారాలు అవుతున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. -
మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పది
హైదరాబాద్: భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పదని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్(తాత్కాలిక) రాఘవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. దోమలగూడ రామకృష్ణమఠంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో నిర్వహించే బాలసంస్కార్– 2019 శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ జస్టిస్ చౌçహాన్ జ్యోతి వెలిగించి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల సంస్కార్లో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ నుంచి వచ్చాం, ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్లాలి అనే మాటలను మనిషి అర్థం చేసుకుంటే జీవిత పరమార్థం తెలుస్తుందన్నారు. దేశంలో ఇంకా కొనసాగుతున్న ఆంగ్లేయుల గులామితత్వం పోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను కంప్యూటర్లు, సెల్ఫోన్లకు, కార్టూన్ ప్రోగ్రాంలకు అలవాటుపడకుండా చూడాలన్నారు. రామాయణం, భారతం, నీతికథలు చదివేలా ప్రోత్సహించాలని, అప్పుడే వారిలో జ్ఞానం,విలువలు పెరుగుతాయని చెప్పారు. మొఘలాయిలు, ఆంగ్లేయులు ప్రపంచంలోని అనేక దేశాలను ఆక్రమించి ఆయా దేశాల చరిత్రను, సంస్కృతిని నాశనం చేసినా భారత దేశ నాగరికతను, సంస్కృతి, సంప్రదాయాలను ఏం చేయలేక పోయారన్నారు. దేవుళ్లకు అభిషేకాల పేరుతో పాలు, ఆహార పదార్థాలను వృథా చేయకుండా మురికివాడల్లోని పేదలకు, ఆస్పత్రుల్లోని రోగులకు అందించే సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తించినట్లే మనిషి కూడా తన ధర్మాన్ని నిర్వహించాలని, ప్రతి వ్యక్తిలోనూ క్రమశిక్షణ, పరోపకారం ముఖ్యమన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారు వివాహం జరిగిన ఏడాది, రెండేళ్ల లోపే విడాకుల కోసం కోర్టులకు వస్తున్నారని, నిరుపేద, మధ్యతరగతి వారు మాత్రం గొడవల్లేకుండా ఏళ్లుగా కాపురం చేస్తూ కుటుంబ వ్యవస్థను కాపాడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద, హ్యూమన్ ఎక్స్‌లెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద, ఏవీఎస్ మూర్తి, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నార్థకంగా కుటుంబ వ్యవస్థ
రాష్ట్ర న్యాయవాది పరిషత్ సమావేశంలో హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్‌రావు కరీంనగర్ లీగల్ : రోజురోజుకు సమాజంలో పెరిగిపోతున్న విపరీత ధోరణుల వలన భారతీయ కుటుంబ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోందని దానిని కాపాడవలసిన బాధ్యత న్యాయవాదులపైన ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ పి.నవీన్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్ హాల్లో శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ తొలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘భారతీయ కుటుంబ వ్యవస్థ-ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. ఇప్పటికీ మన దేశంలోనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని, అది యువతకు ఒక శిక్షణ సంస్థలా ఉపయోగపడుతోందని చెప్పారు. దీని ద్వారానే యువత తాము సమాజంలో ప్రయోజకులు కావడానికి అవసరమైన అన్ని రకాల శిక్షణలను నేర్చుకుంటున్నారన్నారు. ఇప్పుడీ భావన రానురాను క్షీణిస్తోందని ఫలితంగా దేశంలో వృద్ధజనాశ్రమాలు పెరిగిపోతున్నాయన్నారు. వృద్ధులకు, పిల్లలకు మధ్య అంతరం పెరిగి గౌరవ మర్యాదలకు భంగం ఏర్పడుతోందన్నారు. న్యాయవాదులు సామాజికస్పృహతో కుటుంబ వ్యవస్థపై గౌరవం పెంచేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా జడ్జి బి.నాగమారుతీశర్మ, న్యాయవాది పరిషత్ ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర న్యాయవాద పరిషత్ నూతన అధ్యక్షుడు కె.మోహన్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాద పరిషత్ అధ్యక్షునిగా మోహన్ కరీంనగర్ లీగల్: తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ మొదటి అధ్యక్షునిగా హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కర్రూర్ మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఆయన ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. శనివారం కరీంనగర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ మొదటి సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధానకార్యదర్శిగా నల్లగొండ జిల్లాకు చెందిన న్యాయవాది కె.లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఆయన కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కోశాధికారిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన గౌరీష్ను ఎన్నుకున్నారు.