ప్రశ్నార్థకంగా కుటుంబ వ్యవస్థ
రాష్ట్ర న్యాయవాది పరిషత్ సమావేశంలో హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్‌రావు
కరీంనగర్ లీగల్ : రోజురోజుకు సమాజంలో పెరిగిపోతున్న విపరీత ధోరణుల వలన భారతీయ కుటుంబ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోందని దానిని కాపాడవలసిన బాధ్యత న్యాయవాదులపైన ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ పి.నవీన్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్ హాల్‌లో శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ తొలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘భారతీయ కుటుంబ వ్యవస్థ-ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. ఇప్పటికీ మన దేశంలోనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని, అది యువతకు ఒక శిక్షణ సంస్థలా ఉపయోగపడుతోందని చెప్పారు. దీని ద్వారానే యువత తాము సమాజంలో ప్రయోజకులు కావడానికి అవసరమైన అన్ని రకాల శిక్షణలను నేర్చుకుంటున్నారన్నారు. ఇప్పుడీ భావన రానురాను క్షీణిస్తోందని ఫలితంగా దేశంలో వృద్ధజనాశ్రమాలు పెరిగిపోతున్నాయన్నారు. వృద్ధులకు, పిల్లలకు మధ్య అంతరం పెరిగి గౌరవ మర్యాదలకు భంగం ఏర్పడుతోందన్నారు. న్యాయవాదులు సామాజికస్పృహతో కుటుంబ వ్యవస్థపై గౌరవం పెంచేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా జడ్జి బి.నాగమారుతీశర్మ, న్యాయవాది పరిషత్ ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర న్యాయవాద పరిషత్ నూతన అధ్యక్షుడు కె.మోహన్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాద పరిషత్ అధ్యక్షునిగా మోహన్
కరీంనగర్ లీగల్: తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ మొదటి అధ్యక్షునిగా హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కర్రూర్ మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఆయన ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. శనివారం కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ మొదటి సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధానకార్యదర్శిగా నల్లగొండ జిల్లాకు చెందిన న్యాయవాది కె.లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఆయన కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కోశాధికారిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన గౌరీష్‌ను ఎన్నుకున్నారు.