అప్పుల సాకుతో హామీలకు పాతర | Kishan Reddy Fiers On CM Revanth Reddy: Telangana | Sakshi
Sakshi News home page

అప్పుల సాకుతో హామీలకు పాతర

Published Sun, Mar 9 2025 5:20 AM | Last Updated on Sun, Mar 9 2025 5:20 AM

Kishan Reddy Fiers On CM Revanth Reddy: Telangana

మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్ర అప్పులపై సీఎం పచ్చి అబద్ధాలు 

మీరు హామీలిచ్చి మమ్మల్ని అమలుచేయాలంటే ఎలా? 

డీలిమిటేషన్‌పై స్టాలిన్, రేవంత్‌లవి బోగస్‌ మాటలు 

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అప్పుల సాకు చూపి ఎన్నికల హామీలను ఎగ్గొట్టే పథకం వేశారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.7.50 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎం గతంలో అనేకమార్లు చెప్పారు. ఇటీవల ఢిల్లీలో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాను సీఎం అయ్యాక కూడా రూ.3.5 లక్షల కోట్ల అప్పే ఉందని అనుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు అప్పుల పేరు చెప్పి హామీల అమలుపై చేతులెత్తేశారు’అని ధ్వజమెత్తారు. 

బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం 
బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానం కానందువల్లే గ్యారంటీలు అమలు చేయకుండా సాకులు వెతుకుతున్నారని ఆరోపించారు. ఇష్టారీతిన హామీనిచ్చా, పథకాలు ప్రకటించి.. వాటిని కేంద్రం పూర్తిచేయాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై మాకేమీ తొందరలేదు. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ ద్వారా వచ్చే ఎన్నికల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం’అని ప్రకటించారు. కాజీపేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పారు.

జాతీయ రహదారిగా ట్రిపుల్‌ఆర్‌ 
ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌రోడ్డు (ట్రిపుల్‌ఆర్‌)ను జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ‘తెలంగాణలో రూ.6,280 కోట్ల ఖర్చుతో 285 కి.మీ. మేర 10 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. వీటిని పార్లమెంటు సమావేశాల తర్వాత గడ్కరీ ప్రారంభిస్తారు. రూ.961 కోట్లతో 51 కి.మీ. రోడ్డు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగంపై గడ్కరీతో చర్చించాను. రూ.18,772 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ రోడ్డు విషయంలో ఇంకా మూడు పనులు జరగాల్సి ఉంది.

పీపీపీ అప్రయిజల్‌ కమిటీ, కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం నోట్, నిధులకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరగాలి. దీనికి త్వరలోనే కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది’అని కిషన్‌రెడ్డి వివరించారు. పెండింగ్‌ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూ సేకరణ జరిపి అప్పగించాలని కోరారు. వరంగల్‌ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొత్తం భూమి ఇవ్వలేదని చెప్పారు. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణపై రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. జనాభా తగ్గినా తెలంగాణలో కానీ.. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో కానీ ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని స్పష్టంచేశారు.  

ఒక దేశం–ఒక ఎన్నిక దేశ భవిష్యత్‌ ఎజెండా 
తెలంగాణలో ‘వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌’పై రాజకీయాలకు అతీతంగా చర్చలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత నుంచి సంతకాల సేకరణ నిర్వహించాలని తీర్మానించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను పార్టీ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని శనివారం జరిగిన సమావేశంలో ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు.

ఒకదేశం–ఒక ఎన్నిక అనేది బీజేపీ ఎజెండా కాదని దేశ భవిష్యత్‌ ఎజెండా అని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, పార్లమెంట్‌ ఎన్నికలు మరో సారి జరగడం వల్ల రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, ప్రజల సమయం వృథా అవుతోందని.. పాలన, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారించడానికి వీలులేకుండా పోతోందని అన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వన్‌నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌పై నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ, ఎంపీ ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement