టాటా సియారా , బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ చైతన్య రథానికి సారథిగా, మంత్రిగా, అన్న టీడీపీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, సినిమా నటుడిగా బహు ముఖ పాత్రలు పోషించిన నందమూరి హరికృష్ణ.. స్వతహాగా కొత్తవారిని అంత త్వరగా నమ్మే వ్యక్తికాదు. కొత్త వారితో అంతగా కలసిపోలేరు. సుదీర్ఘ పరిచయంతో ఆత్మీయులుగా మారితే తప్ప వేరెవరితోనూ తన మనసులో మాటను పంచుకునే వారు కాదు. కానీ ఆ ముగ్గురు కలిస్తే మాత్రం.. ఆయన మనసులో మాటలన్నీ ఊటలై వచ్చేవి. విషయం, నిర్ణయం ఏదైనా వారితో చర్చించాకే చేసేవారు. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ జస్టిస్ చలమేశ్వర్, దాసరి జై రమేశ్, పీఎన్వీ ప్రసాద్‌లే ఆ ముగ్గురు. స్నేహమంటే ఎంతో విలువనిచ్చే హరికృష్ణ ముక్కుసూటితనం అనేక మార్లు ఆయనను ఇబ్బందుల పాలు జేసింది. అబిడ్స్‌లోని ఎన్టీఆర్ ఎస్టేట్‌లో ఎక్కువ సమయం గడిపే హరికృష్ణ.. మిత్రులతోనూ అక్కడే చర్చలు, భోజనాలు చేసేవారు.
వాహనాలు, పెంపుడు జంతువులంటే ఇష్టం
హరికృష్ణకు వాహనాలు, పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. ఆయన వద్ద అరుదైన జాతి ఆవులతోపాటు, కుక్కలు ఉండేవి. పుంగనూరు ఆవుల కోసం ఆయన మాదాపూర్, ఎల్బీనగర్‌లలోని గోశాలలను తరచూ సందర్శించేవారు. తన అన్ని వాహనాలకు 3999 ఫ్యాన్సీ నంబర్ వచ్చేలా ప్లాన్ చేసేవారని, వాహనాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతారు. సొంత డ్రైవింగ్‌లో ప్రయాణమంటే ఆయనకు ఎంతో ఇష్టమని, ఎంత రాత్రయినా సరే హైదరాబాద్ చేరేందుకే మొగ్గు చూపేవారని చెబుతారు.
‘మా పని అయిపోయిందనుకున్నా’
‘1995లో హిందూపురం ఉప ఎన్నికల ఫలితాల రోజు రాత్రి హరికృష్ణతో కలిసి హైదరాబాద్‌కు బయల్దేరాం. మార్గమధ్యలో గేదె అడ్డం వచ్చింది.. అప్పుడే మా పని అయిపోయిందనుకున్నా. కానీ హరికృష్ణ చాకచక్యంతో వాహనాన్ని కట్ చేసి మాకేం కాకుండా చూశారు.. ఆయన డ్రైవింగ్ అంటే అంత నమ్మకం’’అని పీఎన్వీ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన లేరంటే నమ్మలేకున్నా.. మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment