ఆటగదరా శివ! | Nandamuri Harikrishna dies in accident | Sakshi
Sakshi News home page

ఆటగదరా శివ!

Published Thu, Aug 30 2018 4:52 AM | Last Updated on Thu, Aug 30 2018 4:28 PM

Nandamuri Harikrishna dies in accident - Sakshi

హరికృష్ణ

హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న నందమూరి హరికృష్ణ ఇంటికి వెళ్లే దారులన్నీ బుధవారం ‘జన’దిగ్బంధంతో కిక్కిరిసిపోయాయి! ప్రతి వాహనమూ పరామర్శకు బయల్దేరినట్లే కదల్లేక కదిలింది. హరికృష్ణ ఆకస్మిక శివైక్యం.. ‘ఆటగదరా శివ’ అనే వైరాగ్య భావనలోకి ఆయన అభిమానుల్ని నెట్టివేసింది!

‘‘ఈ ఏడాది నా జన్మదిన వేడుకలు వద్దు. కేరళలో వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు నిరాశ్రయులయ్యారు. ఇది మనందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. ఫ్లెక్సీలు, పుష్ప గుచ్ఛాలకు అయ్యే ఖర్చును బాధితులకు అందజేయాలని కోరుకుంటున్నా ’’... అభిమానులకు నందమూరి హరికృష్ణ రాసిన చివరి లేఖ ఇది. ఆయన వేడుకలు వద్దనుకున్నారు. అభిమాన నటుడు తీసుకున్న నిర్ణయం అభిమానులను నిరుత్సాహపరిచినా మంచి కార్యక్రమం కోసమే కదా అనుకున్నారు.

అయితే ఇలా హఠాన్మరణం పొంది, విషాదంలో ముంచెత్తుతారని ఊహించలేదు. సెప్టెంబర్‌ 2న హరికృష్ణ జన్మదినం. బుధవారం (ఆగస్ట్‌ 29) రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం పొందారు. మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారకరామారావు, బసవతారకంల పదకొండు మంది సంతానంలో హరికృష్ణ నాలుగో కుమారుడు. 1956లో నిమ్మకూరులో జన్మించిన హరికృష్ణ అక్కడే తాతయ్య లక్ష్మయ్య చౌదరి దగ్గర పెరిగారు. మనవడ్ని నటుడిగా చూడాలనే కోరిక తాతయ్యకు ఉండేది. కొడుకు దగ్గర ఆ విషయం చెప్పగా చెప్పగా చివరికి ఎన్టీఆర్‌ ‘శ్రీకృష్ణావతారం’లో చిన్ని కృష్ణుడి పాత్రను హరికృష్ణతో చేయించారు.

తండ్రి ఎన్టీఆర్‌ కృష్ణుడిగా కనిపిస్తే హరికృష్ణ చిన్ని కృష్ణుడిగా కనిపించారు. ఆ సినిమాలో నటించినప్పుడు హరికృష్ణ వయసు దాదాపు పదేళ్లు. రక్తంలోనే నటన ఉంది కాబట్టి ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆ సినిమా  తర్వాత బాల నటుడిగా ‘తల్లా? పెళ్లామా? చిత్రం చేశారు. ‘తాతమ్మ కల’ (1974) చిత్రంతో హరికృష్ణ పూర్తి స్థాయి నటుడిగా మారారు. ఇందులో తమ్ముడు బాలకృష్ణతో కలసి నటించిన హరికృష్ణ ఆ తర్వాత వెంటనే ‘రామ్‌ రహీమ్‌’లోనూ సోదరుడితో కలసి నటించారు.

అనంతరం స్వీయదర్శకత్వంలో తండ్రి నటించి, తెరకెక్కించిన భారీ చిత్రం ‘దాన వీర శూరకర్ణ’ (1977) సినిమాలో అర్జునుడి పాత్ర పోషించారు. ఈ చిత్రం తర్వాత మళ్లీ హరికృష్ణ స్క్రీన్‌పై కనిపించడానికి 20 ఏళ్లు పట్టింది. హరికృష్ణ తన రాజకీయ వారసుడని, బాలకృష్ణ తన సినీ వారసుడని అప్పట్లో ఎన్టీఆర్‌ సన్నిహితులతో అనేవారట. హరికృష్ణకు కూడా సినిమాలకన్నా రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో 1977 తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లారు.

‘శ్రీరాములయ్య’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌
1998లో మోహన్‌బాబు టైటిల్‌ రోల్‌లో ఎన్‌. శంకర్‌ దర్శకత్వం వహించిన ‘శ్రీరాములయ్య’లో చేసిన కీలక పాత్ర ద్వారా నటుడిగా హరికృష్ణ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ఆ వెంటనే ‘సీతారామరాజు’ చిత్రంలో నటించారు. హరికృష్ణ, నాగార్జున అన్నదమ్ములుగా వైవీయస్‌ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆ సమయంలో వైవీయస్‌కి, హరికృష్ణకీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఒక వ్యక్తిని నమ్మితే హరికృష్ణ ఎంతదాకా అయినా వెళతారని ఆయన సన్నిహితులు అంటుంటారు. అందుకే చౌదరితో వరుసగా మరో రెండు సినిమాలు ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ చేశారు. నిజానికి హరికృష్ణ మాస్‌ ఆర్టిస్ట్‌. పవర్‌ఫుల్‌ ఫైట్స్‌ చేసినా, పంచ్‌ డైలాగ్స్‌ చెప్పినా ఆయన ఆహార్యానికి తగ్గట్టుగా ఉండేవి.

అయినప్పటికీ ‘సీతారామరాజు’లో ‘చాంగురే.. చాంగురే..’లో వేసిన చిన్న స్టెప్స్, ‘సీతయ్య’లో ‘బస్సెక్కి వస్తావో..’, ‘సిగ్గేస్తోంది...’ పాటలకు వేసిన మాస్, క్లాస్‌ స్టెప్స్‌ ఆకట్టుకున్నాయి. అలాగే ‘సీతయ్య’లో గర్భవతిగా ఉన్న భార్య సౌందర్యకు శీమంతం చేస్తూ, ‘సమయానికి తగు సేవలు సేయనీ’ పాటలో హరికృష్ణ నటన ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ రెండు చిత్రాలకు మధ్యలో ‘శివరామరాజు’లో కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత ‘టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌’లో టైటిల్‌ రోల్‌ చేశారు. 2004లో ‘స్వామి’, 2005లో ‘శ్రావణ మాసం’ తర్వాత హరికృష్ణ సినిమాలు చేయలేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘లాహిరి లాహిరి..లో’ చిత్రానికి నంది అవార్డు, ‘శ్రీరాములయ్య’కు స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకున్నారు.

వ్యక్తిగత జీవితానికి వస్తే.. 22 ఫిబ్రవరి 1973లో లక్ష్మీకుమారిని పెళ్లాడారు హరికృష్ణ. వీరికి ఇద్దరు కుమారులు జానకి రామ్, కల్యాణ్‌ రామ్, కుమార్తె సుహాసిని. జానకి రామ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మరో భార్య శాలిని. ఈ దంపతుల తనయుడు ఎన్టీఆర్‌. తనయులకు ఓ మంచి గైడ్‌లా మాత్రమే వ్యవహరించారు హరికృష్ణ. సినిమాలు ఎంచుకునే చాయిస్‌ వాళ్లకే వదిలేశారు. వారి ఆడియో వేడుకల్లో పాల్గొంటుంటారు. ఆ మధ్య కల్యాణ్‌ రామ్‌ నటించిన ‘ఇజం’ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న హరికృష్ణ.. ‘ఒక కుమారుడు ‘టెంపర్‌’తో మంచి హిట్, ఇంకో కుమారుడు ‘పటాస్‌’తో మంచి హిట్‌ ఇచ్చారు. ఒక తండ్రికి ఇంతకన్నా ఏం కావాలి?’ అని ఉద్వేగంగా మాట్లాడారు. కుమారులు సాధించే మరెన్నో మైల్‌స్టోన్స్‌ని ఆస్వాదించాల్సిన తరుణంలో హరికృష్ణ దూరం కావడం ఆ కుటుంబానికి తీరని శోకం.                 
ఆరేళ్లకే జనంలోకి...
‘‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారథ్యం.. జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం. నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్స్‌లో ఎన్టీరామారావుగారి ముందు నడిచిన హరికృష్ణ’’ అంటూ ఇక్కడ కనిపిస్తున్న ఫొటోను దర్శకుడు క్రిష్‌ ట్వీటర్‌లో షేర్‌ చేశారు. 1962లో దేశ రక్షణ విరాళం కోసం ఎన్టీఆర్‌ పాల్గొన్న సందర్భంలో తీసిన ఫొటో ఇది. చైతన్య రథ సారధిగానే కాకుండా చిన్నప్పటి నుంచే తండ్రితో కలసి పలు కార్యక్రమాల్లో హరికృష్ణ చురుకుగా పాల్గొనేవారనడానికి ఇదో ఉదాహరణ. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ రీసెర్చ్‌లో భాగంగా క్రిష్‌ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ బయోపిక్‌లో హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్‌ కనిపించనున్నారని సమాచారం.

                      తండ్రి ముందే తనయుడు

హరికృష్ణ కోసం కథ రాయించిన తాత లక్ష్మయ్య
నిమ్మకూరులో తన దగ్గర పెరుగుతున్న మనవడు హరికృష్ణను తీసుకుని తాత లక్ష్మయ్య మద్రాసు వెళ్లారు. అప్పటికే హీరోగా దూసుకెళుతోన్న ఎన్టీఆర్‌ మద్రాసులో ఉండేవారు. మనవడ్ని పెట్టి సినిమా తీయమని కొడుక్కి చెప్పారు. అయితే ఆ తర్వాత రెండు రోజులు ఎన్టీఆర్‌ ఏమీ మాట్లాడకపోవడంతో మళ్లీ అడిగారాయన. చిరునవ్వే సమాధానం అయింది. దాంతో ప్రముఖ రచయిత డీవీ నరసరాజుని పిలిపించి, ‘నా మనవడ్ని హీరోగా పెట్టి సినిమా తీయమంటే నా కొడుకు వినడంలేదు. వీడు హీరో అయితే తన మార్కెట్‌ పోతుందనే భయం వాడికి ఉన్నట్లుంది. నా మనవడు హీరోగా నిలబడాలి.


                  లక్ష్మయ్య

మంచి కథ రాసుకు రండి’ అని హరికృష్ణ చేతుల మీదగానే  కొంత మొత్తం ఇచ్చారు. ఎన్టీఆర్‌కు హరికృష్ణను తమ్ముడిగా పెట్టి ‘తమ్ముడి పెళ్లి మామ భరతం’ అనే కథను రాసుకొచ్చారు నరసరాజు. కథ చెప్పడానికి ఇంటికి వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ ఇంట్లోనే ఉన్నారట. దాంతో అసలు విషయం చెప్పక నరసరాజుకి తప్పలేదు. ‘వాడు హీరో అయితే నా మార్కెట్‌ పోతుందని భయపడుతున్నానా’ అని పెద్దగా నవ్వారట ఎన్టీఆర్‌. ఆ స్క్రిప్ట్‌ తీసుకుని టేబుల్‌ సొరుగులో పెట్టారట. ఈ విషయాన్ని డీవీ నరసరాజు తన ఆత్మకథలో రాశారు. ఎన్టీఆర్‌ చనిపోయాక టేబుల్‌ సొరుగులో ఉన్న ఆ కథను చూసి, నరసరాజుకి బాలకృష్ణ తిరిగి ఇస్తే, ‘‘ఆ కథకు తగిన పారితోషికం నాకు అందింది. ఆ కథ మీదే’’ అని నరసరాజు చెప్పారట.

‘ఇజం’ ఆడియో వేడుకలో తనయులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ సక్సెస్‌ గురించి ఉద్వేగంగా ప్రసంగించారు హరికృష్ణ. ఆ వేడుకలో హరికృష్ణ మాటల సారాంశం ఇది.
‘‘కొన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడాలి. ఇప్పుడు నా వయసు 60 ఏళ్లు. ఈ 60 ఏళ్లలో హరికృష్ణ ఏం చేశాడు? ఏం అనుభూతులు పొందాడు? ఎవరూ అనుభవించలేనివి ఏం పొందాడు అంటే.. ఆనంద సమయాలు.. ఒక మహానుభావుని.. నందమూరి అంటేనే రామారావుగారు. ఆయన దగ్గర నేను 30ఏళ్లు పనిచేశాను. ఎన్నో అనుభూతులు ఉన్నాయి. హిమాలయ శిఖరాన్ని మరచిపోయేంత గొప్ప అనుభూతి పొందినవాడిని. ఆయనతో ఎన్నో విజయాలు, ఎన్నో పోరాటాలు చూశాం. సినిమా రంగంలో విజయం చూశాం. పార్టీ పెట్టి అందులోనూ విజయం చూశాం. సరే.. ఆయన దగ్గర్నుంచి పొందింది ఏంటీ? అంటే ఎనలేని నందమూరి వీరాభిమానులను. 59 నుంచి 60కి వచ్చే టైమ్‌లో వీరిద్దరి (కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌) హిట్‌ సినిమాలు చూశాను. ఒకటి ‘టెంపర్‌’, రెండు ‘పటాస్‌’. ఓకే అది 59. 60కి వచ్చే సరికి ‘జనతా గ్యారేజ్‌’. నా బిడ్డ జూనియర్‌ ‘మీకు 60ఏళ్లు వస్తున్నాయ్‌ కాబట్టి ఇది నా తరఫున గిఫ్ట్‌’ అన్నాడు. అది ఒక ఆనందం. 60 వచ్చిన తర్వాత మరో  బిడ్డ ‘ఇజం’ సినిమాతో హిట్‌ కొట్టబోతున్నాడు’’ అని ఉద్వేగంగా మాట్లాడారు.

ఇట్లు... మీ నందమూరి హరికృష్ణ
సెప్టెంబర్‌ 2న తన 62వ పుట్టినరోజు వేడుకలు జరపవద్దని హరికృష్ణ తన అభిమానులకు ఓ ఉత్తరం ద్వారా సందేశం ఇచ్చారు. ఈ లేఖ ఆయన మరణించిన తర్వాత బయటికొచ్చింది. ఆ లేఖ యధాతథంగా...
‘‘సెప్టెంబర్‌ 2న నా అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. అందుచేత నా జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని, వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతే కాకుండా నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.
ఇట్లు
మీ నందమూరి హరికృష్ణ


దిగ్భ్రాంతి
నందమూరి హరికృష్ణ ఇక లేడు అంటే నమ్మలేకపోతున్నాను. నేను తీసిన ‘డ్రైవర్‌ రాముడు’కు నిర్మాతగా వ్యవహరించారు. మా ఇద్దరికీ మధ్య  మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నో వేల కిలో మీటర్లు డ్రైవ్‌ చేసిన ఆయన ఇలా మరణించడం చాలా విచారకరం.
– దర్శకుడు కె. రాఘవేంద్రరావు

నందమూరి హరికృష్ణగారు మనతో లేరన్న విషయం షాకింగ్‌గా ఉంది. అకస్మాత్తుగా మా కుటుంబ సభ్యుడ్ని కోల్పోయాం అనిపిస్తోంది. నా తమ్ముడ్ని నేను మిస్‌ అయ్యాను.
– నిర్మాత అశ్వనీదత్‌

నా బ్రదర్‌ నందమూరి హరికృష్ణగారిని  నేను కోల్పోయాను. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. మాటలు రావడం లేదు. అంత బాధగా ఉంది. గ్రేట్‌ లాస్‌.
– నటుడు మోహన్‌బాబు

ఇది చాలా దుర్దినం. మిత్రుడు, ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పలకరించే నా సోదర సమానుడు హరికృష్ణ అకాల మరణం చెందటం బాధగా ఉంది. ఇలా మనందరినీ శోకంలో ముంచి వెళతారని ఊహించలేదు.
– నటుడు చిరంజీవి

హరికృష్ణగారు మరణించడం చాలా బాధగా ఉంది. దురదృష్టకరం. అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారు.       
– నటుడు వెంకటేశ్‌

‘చాలా రోజులైంది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు...’ అని కొన్ని వారాల క్రితమే హరికృష్ణగారు అన్నారు. కానీ ఇప్పుడు లేరు. మా అన్నయ్య (హరికృష్ణ)ను మిస్‌ అవుతున్నాను
– నటుడు నాగార్జున

హరికృష్ణగారు మా కుటుంబంలోని వ్యక్తి. మా ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరై ప్రత్యేక అభిమానంతో పలకరించేవారు. ఎంతో మనోబలాన్ని అందించేవారు. ఆయన లేరంటే జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది.
–  నటుడు రాజశేఖర్‌

హరికృష్ణగారి మరణం నన్ను బాధించింది. నా తమ్ముడు తారక్‌తో పాటు ఆ ఫ్యామిలీలోని అందరికీ ఈ శోక సమయంలో ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
– నటుడు మహేశ్‌బాబు

హరికృష్ణగారు ఇక లేరన్న వార్త విని బాధపడ్డాను. తారక్, కల్యాణ్‌రామ్‌లతోపాటు ఆ ఫ్యామిలీ అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.         
– నటుడు ప్రభాస్‌

ఒక విషాదకరమైన ప్రమాదంలో హరికృష్ణ గారు అకస్మాత్తుగా మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ శోకసమయంలో ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియ జేస్తున్నాను.                  
– నటుడు రామ్‌చరణ్‌

హరికృష్ణగారి మరణవార్త వెరీ వెరీ షాకింగ్‌లా ఉంది. నా బ్రదర్స్‌ తారక్, కల్యాణ్‌రామ్‌లతో పాటుగా నందమూరి ఫ్యామిలీ అందరికీ నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
– నటుడు అల్లు అర్జున్‌

నా బ్రదర్స్‌ తారక్, కల్యాణ్‌రామ్‌లు స్ట్రాంగ్‌గా ఉండాల్సిన సమయం ఇది. ఈ భయంకరమైన సమయంలో వారి కుటుంబంలోని వారందరూ ధైర్యంగా ఉండాలి.         
– నటుడు రానా

తారక్, కల్యాణ్‌రామ్‌లతో పాటు, నందమూరి ఫ్యామిలీ అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.     
– దర్శకుడు వీవీ వినాయక్‌

హరికృష్ణగారితో నాకు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం నేను షూటింగ్‌ నిమిత్తం వేరే దేశంలో ఉన్నాను. ఆయన హఠాన్మరణం విని దిగ్భ్రాంతికి గురయ్యాను. నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
– దర్శకుడు బోయపాటి శ్రీను

నందమూరి హరికృష్ణగారితో నాకు కొన్ని జ్ఞాప కాలు ఉన్నాయి. ఆయన హఠాన్మరణం షాకింగ్‌ గా ఉంది. ఈ శోక సమయంలో నా బ్రదర్స్‌ తారక్, కల్యాణ్‌రామ్‌లు ధైర్యంగా ఉండాలి.
– దర్శకుడు కొరటాల శివ


హరికృష్ణ శివ భక్తుడు. ఇక్కడ ఫొటోలో త్రిశూలం కనిపిస్తోంది కదా. రోడ్డు ప్రమాదానికి గురైన హరికృష్ణ వాహనంలోంచి పడిన త్రిశూలం ఇది.


జయశంకర్‌కృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, సాయికృష్ణ, ఎన్‌.టి.రామారావు, జయకృష్ణ, మోహన్‌కృష్ణ, బాలకృష్ణ


తనయులు జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లతో హరికృష్ణ


      బాలకృష్ణుడిగా హరికృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement