హరికృష్ణ భౌతికకాయం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు
సాక్షి, అమరావతి: ఏ విషయమైనా ముఖంమీదే మాట్లాడటం, నచ్చిందే చేయడం నందమూరి హరికృష్ణ నైజం. తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే హరికృష్ణకు ఆత్మాభిమానం అధికమని, భోళా మనిషని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుం టున్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో జరిగిన చర్చలో హరికృష్ణ పట్టుబట్టి తెలుగులో ప్రసంగించారు. అభ్యంతరాలను లెక్క చేయకుండా ట్రాన్స్‌లేషన్ కంటే ఎక్స్‌ప్రెషనే ముఖ్యమని ధైర్యంగా చాటారు. హరికృష్ణ హీరోగా నటించిన ‘సీతయ్య’ సినిమా ఆయన నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని చెబుతారు. దాదాపు రెండు దశాబ్దాలు విరామం తీసుకున్నా శ్రీరాములయ్య, సీతారామ రాజు, లాహిరి లాహిరి లాహిరి తదితర చిత్రాలతో నందమూరి అభిమానులను హరికృష్ణ అలరించారు.
మంత్రి పదవిలో ఆర్నెల్లు
హరికృష్ణ 1995 వరకూ తండ్రి వెన్నంటే ఉన్నా రాజకీయంగా క్రియాశీలంగా లేరు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హరికృష్ణను రవాణా శాఖ మంత్రిగా నియమించినా ఆర్నెల్ల లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. 1996లో హరికృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచినా మంత్రి వర్గంలో తిరిగి చోటు దక్కలేదు.
టీడీపీలో ఇమడలేక సొంత పార్టీ
తండ్రిని పదవి నుంచి దించేందుకు సహకరించి తప్పు చేశానని హరికృష్ణ పలుమార్లు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తరచూ అవమానాలు ఎదురు కావడంతో టీడీపీలో ఇమడలేక 1999 జనవరిలో ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. 1999 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించినా ఆయన పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకపోగా గుడివాడలో హరికృష్ణ స్వయంగా ఓడిపోయారు.
తండ్రిపై ఎనలేని అనురాగం
టీడీపీలో ప్రతి నాయకుడితోనూ హరికృష్ణకు అను బంధం ఉంది. తండ్రిపై వల్లమాలిన అభిమానాన్ని ఆయన పలు సందర్భాల్లో చాటుకున్నారు. ఎన్టీఆర్ చైతన్య రథానికి సారథిగా కొన్ని వేల కిలోమీటర్లు వాహనం నడిపారు. ఆయనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. రేయింబవళ్లు తిరిగి అలసిపోయినా మరో డ్రైవర్ తండ్రి వాహనాన్ని నడిపేందుకు ఒప్పుకునేవారు కాదని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఆర్నెళ్ల పాటు రవాణా శాఖ మంత్రిగా పని చేసిన సమయంలోనూ హరికృష్ణ తనకు ఏది మంచి అనిపిస్తే అదే చేసేవారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
నిమ్మకూరుపై మక్కువ
తాను పుట్టిన నిమ్మకూరు అంటే హరికృష్ణకు ప్రత్యేక అభిమానం. వీలు కుదిరినప్పుడల్లా గ్రామానికి వెళ్లేవారు. రాజ్యసభ సభ్యుడిగా ఉండగా నిమ్మకూరు అభివృద్ధికి ఎక్కువ నిధులిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపురం నియోజకవర్గంతోనూ హరికృష్ణకు అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మరణం తర్వాత హిందూపురం ఉప ఎన్నికల్లో పోటీ చేసి 62 వేల భారీ మెజారిటీతో గెలిచారు.
టీడీపీలోకి తిరిగి వచ్చినా... కుటుంబసభ్యుల ఒత్తిడితో హరికృష్ణ తిరిగి టీడీపీలో చేరినా ఆయనకు ప్రాధాన్యం దక్కలేదు. రాజ్యసభకు పంపినా పార్టీలో అవమానాలు తప్పలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా 2013 ఆగస్టు నాలుగో తేదీన హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తర్వాత మళ్లీ ఆయనకు రాజ్యసభకు వెళ్లే అవకాశమివ్వలేదు. హరికృష్ణ మూడేళ్లుగా టీడీపీ మహానాడుకు సైతం దూరంగా ఉన్నారు. రాజకీయ వ్యూహాల్లో చిక్కుకుని చివరికి స్తబ్దుగా మిగిలిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment