గుంటూరు: అతివేగంగా కారు నడపడం వల్ల ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి గుంటూరులో జరిగింది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుంటూరు ఈస్ట్ ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత కుమారుడు సుభాష్ మంగళవారం రాత్రి చుట్టుగుంట నుంచి మార్కెట్ యార్డు వైపు అతివేగంతో వాహనంలో వెళుతున్నాడు.
ఈక్రమంలో ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టడంతో షేక్ నసీరుద్దీన్, మన్సూర్, సాగర్ అనే వ్యక్తులు గాయపడ్డారు. నసీరుద్దీన్ అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో తొలుతగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాహనం ఢీకొట్టిన క్రమంలో ద్విచక్ర వాహనంపై క్షతగాత్రులు గాలిలో ఎగిరి ఢీకొట్టిన కారుపై పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం ప్రమాదం తీవ్రతను తెలియజేస్తోంది.
యువతులను తప్పించి ..?
టీడీపీ కార్పొరేటర్ పోతురాజు సమత కుమారుడు సుభాష్‌తో కారులో కొంత మంది యువతులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కారును సుభాష్ డ్రైవ్ చేశాడా, లేక యువతులు నడిపారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత క్షణాల వ్యవధిలోనే వారిని ఆటో ఎక్కించి పంపివేశారని సమాచారం. వాహనం సుభాష్ నడిపాడా, మద్యం మత్తులో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. నిందితుడిని కనీసం స్టేషన్‌కు కూడా తీసుకురాలేదని సమాచారం. వాహనాన్ని మాత్రం స్టేషన్‌కు తరలించి నిందితుడిని వదిలివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై వెస్ట్ ట్రాఫిక్ సీఐ అక్కేశ్వరరావును వివరణ కోరగా పూర్తి స్థాయిలో విచారించి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment