చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విలపిస్తున్న మృతుల బంధువులు
చిలకలూరిపేట, యడ్లపాడు: వారంతా వ్యవసాయ కూలీలు...రెక్కాడితేగాని డొక్కాడని నిరు పేదలు. రోజుమాదిరిగానే ఉదయాన్నే కూలి పనులకు ఆటోలో బయలుదేరారు. కొద్దిసేపట్లోనే మృత్యువు వారిలోని ముగ్గురిని తన ఒడిలోకి చేర్చుకోగా.. మరో 13 మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన 16 మంది వ్యవసాయ కూలీలు గ్రామం నుంచి ఆటోలో మిర్చి కోతల నిమిత్తం నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి శుక్రవారం బయలుదేరారు. ఆటో మార్గమధ్యంలోని గణపవరం డొంకనుంచి లింగంగుంట్ల గ్రామం వద్ద నరసరావుపేట రహదారిలోకి ప్రవేశిస్తోంది... సరిగ్గా అదే సమయంలో చిలకలూరిపేట వైపునకు ఆర్టీసీ బస్సు వస్తున్న క్రమంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఆటోపైకి ఎక్కడంతో కూలీలంతా ఆటోలో చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు. ఇది గమనించిన స్థానికులు పరుగున వచ్చి బస్సులోని జనాన్ని కిందకు దించి, ఆటోపై నుంచి బస్సును పక్కకు తొలగించారు. ఈ ఘటనలో ఆటోలో డ్రైవర్ పక్కనే కూర్చున్న ఏకసిరి హనుమాయమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారిని 108 వాహనం సహాయంతో చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందులో గన్నవరపు శివపార్వతి(60) చికిత్స పొందుతూ మృతి చెందింది.
తీవ్రంగా గాయపడిన షేక్ హజరత్‌వలి, సరుగుల కోటేశ్వరమ్మలను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ హజరత్‌వలి (60) కన్నుమూశాడు. కోటేశ్వరమ్మ పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఆటో డ్రైవర్ షేక్ సుభానితో పాటు గాయపడిన పాలెపు రజిని, ఎస్.పార్వతి, షేక్ వలిమా, బేతంచర్ల మల్లేశ్వరి, పాలెపు శారద, షేక్ జాన్‌బీ, షేక్ ఖాదర్‌బీ, షేక్ మహబూబ్‌బీ, షేక్ మస్తాన్‌బీ, గోరంట్ల శివకుమారి, షేక్ బాజీలకు చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా వేలూరు గ్రామానికే చెందిన వారు కావడంతో ఆ గ్రామస్తులతో ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం నిండిపోయింది. మృతుల బంధువుల రోదనలతో విషాదఛాయలు అలు ముకున్నాయి. చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సహృదయత చాటుకున్న మల్లెల...
సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్‌నాయుడు ఆస్పత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. మృతి చెందిన కుటుంబాలకు తన వ్యక్తిగతంగా ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున రూ.3 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.20వేలు చొప్పున అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వసాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఒక్కొక్కరిదీ ఓ విషాద గాథ...
► శివపార్వతికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురికీ వివాహాలు అయ్యాయి. భర్త నాలుగేళ్ల కిందట కిడ్నీ వ్యాధితో మృతి చెందాడు. ఒక్కదానినే అన్న బాధను దిగమింగుకుని కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంది. సంక్రాంతి పండుగకు కుమార్తెలు రాకపోవడంతో దిగులుగా ఫోన్లు చేయడంతో గత ఆదివారం నాడు వచ్చి అంతా అమ్మను పలకరించారు. ఆరోజు తల్లి తమపై చూపించిన ఆప్యాయతే చివరిదని గ్రహించలేకపోయామంటూ కుమార్తెలు తలుచుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. గాయాలతో ఆస్పత్రికి వచ్చాకా కడసారి చూస్తూనే కన్నుమూసిందయ్యా అంటూ రోదించారు.
► ఏకసిరి హనుమాయమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు జరిగినా అంతా కలిసే ఉంటారు. అందరికీ ఒకటే కట్టు, ఒకటే మాట. అందరూ పనులకు వెళ్లొద్దన్నా.. ఊరికే కూర్చుంటే ఏమోస్తుంది నలుగురితో కలిసినట్టు ఉంటుంది. వచ్చే కూలి కుటుంబానికి కొంత చేదోడు వాదోడుగా ఉంటుందంటూ కొద్దికాలంగా గ్రామస్తులతో కలిసి మిరప కోతలకు వెళ్తుంది. ఇంటి పెద్దదిక్కు దూరమైందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
► మృతుడు షేక్ హజరత్‌వలి, సాబిరా దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తాపీపనులు చేస్తూనే అందరికీ వివాహాలు చేశాడు. ఎవరి కుటుంబాలు వారివి అయ్యాయి. ప్రస్తుతం ఆయనకు భార్య పని చేసే పరిస్థితి లేదు. తనకు 70 ఏళ్లు రావడంతో తాపీ పనులు చేయలేక వ్యవసాయ పనులకు వెళ్తూ భార్యను పోషించుకుంటున్నాడు. కొద్దికాలం కిందట కొడు కు, ఇప్పుడు భర్త చనిపోవడంతో సాబిరా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment