సాక్షి ప్రతినిధి, గుంటూరు: మాజీ మంత్రి ఆలపాటి రాజా మరోసారి రాజీనామా డ్రామా ఆడారు. తనకు సీటు లేదని తేలిపోవడంతో మరోసారి హైడ్రామాకు తెరలేపారు. తొలుత తన ఇంట్లో ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారంటూ లీకులు ఇచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు తెనాలిలో ఆత్మీయ సమావేశం అన్నారు. మళ్లీ దాన్ని రాత్రి ఏడు గంటలకు మార్చారు. ఈలోగా చంద్రబాబునాయుడి నుంచి కబురు వచ్చింది. రాజా తాడేపల్లి వెళ్లి చంద్రబాబునాయుడిని కలిశారు. ఆయన టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారో వివరించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పడంతో తెనాలి వచ్చిన ఆలపాటి రాజా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల సర్దుకుపోవాలంటూ కార్యకర్తలకు హితవు పలికారు.
మూడో జాబితాపై మండిపాటు
శుక్రవారం చంద్రబాబునాయుడు విడుదల చేసిన మూడో జాబితాపై పలువురు తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. సీటు ఇస్తామని చెప్పి చివరి నిముషంలో చంద్రబాబు మోసం చేయడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా మరోసారి హైడ్రామా నడిపారు. ఇంతకుముందు నాదెండ్ల మనోహర్‌కు టికెట్ ప్రకటించినప్పుడు కూడా ఇదే ధోరణి ప్రదర్శించారు. అనంతరం గుంటూరు పశ్చిమ, పెనమలూరు సీట్ల కోసం ప్రయత్నించారు. గుంటూరు పశ్చిమ గళ్లా మాధవికి కేటాయించారు. దింపుడు కళ్లం ఆశగా పెనమలూరు ప్రయత్నించారు. దీనికి నాదెండ్ల మనోహర్ కూడా సహకారం అందించారు. దీంతో పెనమలూరు సీటు దాదాపుగా తనకే ఖరారు అయ్యిందన్న ప్రచారం సాగింది. చివరి నిముషంలో బోడె ప్రసాద్‌కే ఈ సీటును చంద్రబాబు ఖరారు చేయడంతో ఆలపాటి రాజా వర్గం తెనాలిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో మరోసారి అధిష్టానాన్ని కలుస్తానని, అందరూ అండగా ఉంటానంటే ఒక నిర్ణయం తీసుకుందామంటూ చెప్పి వారిని పంపించేశారు.
ఉండవల్లికి నిరాశే..
బాపట్ల పార్లమెంట్ టికెట్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆ సీటును మాజీ ఐపీఎస్ తెన్నేటి కృష్ణప్రసాద్‌కు కేటాయించడంతో నిరాశ చెందారు. రాజకీయాలు ఎలా ఉంటాయో ఈ రోజే తెలిసిందంటూ ట్వీట్ చేసింది. బాపట్లను ట్యాగ్ చేస్తూ పక్కన వెన్నుపోటును సూచించేలా కత్తితో సింబల్ పెట్టి ట్వీట్ చేశారు. తెలుగుదేశంలో చేరిన సమయంలో తాడికొండ సీటు కుదరకపోతే తిరువూరు అసెంబ్లీ, బాపట్ల ఎంపీ స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరిన శ్రీదేవి. అయితే ఈ సీట్లన్నింటిలో వేరే వారిని ప్రకటించడంతో ఖంగుతిన్న శ్రీదేవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment