ఈ పరిస్థితి దేశానికి మంచిది కాదు | This situation is not good for the country | Sakshi
Sakshi News home page

ఈ పరిస్థితి దేశానికి మంచిది కాదు

Published Thu, Dec 21 2017 2:06 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

This situation is not good for the country - Sakshi

పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ‘బులేనా’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జస్టిస్‌ చలమేశ్వర్‌ చిత్రంలో వరదాచారి, ‘సాక్షి’ ఈడీ కె.రామచంద్రమూర్తి, శ్రీరమణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్య వ్యవస్థకు చెందిన నాలుగు ప్రధాన అంగాలూ గడచిన ఏడు దశాబ్దాల్లో భ్రష్టు పట్టాయని, ఇందుకు దేశంలో సంభవిస్తున్న అనేక పరిణామాలు నిదర్శనమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌జాస్తి చలమేశ్వర్‌ వ్యాఖ్యానించారు. సీనియర్‌ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ‘బులేనా’(వ్యంగ్య వ్యాఖ్యలు) పుస్తకాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టులో తనకు ప్రమేయం ఉన్న ఉదంతాలను ఆయన ప్రస్తావించారు. ‘మెడికల్‌ కాలేజీ అడ్మిషన్లలో కుంభకోణం జరిగినట్టు నిర్థారించి సీబీఐ కేసు పెట్టింది. ఈ స్కాంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఒడిశా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి ఒకరిని అరెస్టు చేసింది.

ఈ విషయంలో నిజం నిగ్గు తేల్చాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆరోపణ ఎదుర్కొంటున్న మాజీ న్యాయమూర్తి నేరం చేసి ఉంటే ఆయనకు అంటిన బురద మొత్తం న్యాయవ్యవస్థకూ అంటుకుంటుంది. కనుక ఈ విషయంలో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని నేను భావించాను. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉదయం ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఆ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ముఖ్యమైన కేసులో ఉండటంతో ఈ అంశం సీజేఐ తర్వాత అత్యధిక సీనియారిటీ కలిగిన నా ముందుకు వచ్చింది. ఐదుగురు సీనియర్‌ న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆరోపణలను విచారించాలని నిర్ణయించాను’అని చలమేశ్వర్‌ చెప్పారు. అయితే సీజేఐకి తన నిర్ణయం అభ్యంతరకరంగా తోచి దాన్ని పక్కన పెట్టి.. వేరే బెంచ్‌ ఏర్పాటు చేశారని, అయితే అందులో తన పేరు లేదని చెబుతూ ‘జస్టిస్‌ చలమేశ్వర్‌ను తొలగించిన చీఫ్‌ జస్టిస్‌’అంటూ ఓ తెలుగు పత్రిక (సాక్షి కాదు) శీర్షిక పెట్టిందని అన్నారు.

న్యాయస్థానాల పనితీరు గురించి అవగాహన లేకుండా వార్త రాయడం జర్నలిజంలో లోపిస్తున్న నిష్ఠకూ, ప్రబలుతున్న సంచలనాత్మకతకూ నిదర్శనమని జస్టిస్‌ చలమేశ్వర్‌ వ్యాఖ్యానించారు. ‘కొంత కాలం కిందట ఓ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు 60 పేజీల లేఖ రాశారు. ఆ లేఖ చాలా రోజులు వెలుగు చూడలేదు. ఆయన భార్య ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల గోష్ఠి పెట్టి లేఖ ప్రతులను పంచారు. ఇంతవరకూ ఆ లేఖను ఒక్క పత్రికగానీ, జాతీయ స్థాయి టీవీ చానళ్లుగానీ ప్రస్తావించలేదు. దేశంలో మీడియా పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది’అని విమర్శించారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రాజకీయ పార్టీ స్పందించలేదని, అన్ని వ్యవస్థలూ దిగజారాయనడానికి ఇది నిదర్శనమని, ఈ పరిస్థితి దేశానికి క్షేమకరం కాదని హెచ్చరించారు. పత్రికలు, టీవీ చానళ్లకు లేని స్వేచ్ఛ ఇంటర్నెట్‌కు ఉందని, ఐటీ చట్టం సెక్షన్‌ 66(ఎ) చెల్లదంటూ తానూ, జస్టిస్‌ నారీమన్‌ కలసి తీర్పు ఇచ్చామని, 22 ఏళ్ల తన అనుభవంలో సంతృప్తినిచ్చిన తీర్పుల్లో అది ఒకటని చెప్పారు. సీనియర్‌ పాత్రికేయులు వరదాచారి, ఉడయవర్లు, రామచంద్రమూర్తి, శ్రీరమణ పుస్తకం గురించి, రచయిత గురించి మాట్లాడారు. పుస్తకం వెలుగు చూడటానికి దోహదం చేసినవారందరికీ పొత్తూరి ధన్యవాదాలు చెప్పారు.

రోడ్డుపై నడుచుకుంటూ పుస్తకావిష్కరణ సభకు
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలను చవి చూశారు. ‘బులేనా’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన జస్టిస్‌ చలమేశ్వర్‌ ఉదయం 11 గంటల సమయంలో ప్రెస్‌క్లబ్‌ సమీపానికి చేరుకున్నారు. అయితే నగరంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఖైరతాబాద్, పంజగుట్ట సర్కిల్‌ మధ్యలో సుమారు గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో పుస్తకావిష్కరణ గడువు దగ్గర పడటంతో వాహనం నుంచి దిగి రోడ్డుపై నడుచుకుంటూ ఆయన ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement