సాక్షి, హైదరాబాద్:‘‘ముస్లింలు మెజారిటీ ప్రజలుగా ఉన్న కశ్మీరీల అభిప్రాయాలను, మనోభావాలను ఏడు దశాబ్దాలుగా పరిగణనలోకి తీసుకోలేదు. సమస్య పరిష్కారంలో ఇంతటి కాలయాపనకు అదే కారణం. వారి అభిప్రాయాలను గౌరవించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. కాలయాపనకు ఇకనైనా స్వస్తి పలకాలి. శాంతి చర్చలకు ఉద్యుక్తమవాలి. ముందు కశ్మీర్ సమస్యను తీవ్రవాద దృష్టితో చూడటం మానాలి. ఎందుకంటే సమస్యను రాజకీయంగానే పరిష్కరించగలం. కశ్మీర్‌పై నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలి. ఇది చాలా అవసరం’’అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్‌నూ భాగస్వామిని చేస్తూ (థర్డ్‌పార్టీగా చేర్చుతూ) సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించడం విశేషం! పలు సామాజికాంశాలపై డాక్టర్ రెడ్డీస్ సారథ్యంలో సుదీర్ఘ కాలంగా సాగుతోన్న ‘మంథన్’ఐదో ఆవిర్భావ సదస్సు సోమవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఇందులో భాగంగా ‘కశ్మీర్– నేడు, ముందున్న దారి’(కశ్మీర్ నౌ అండ్ వే అహెడ్) అనే అంశంపై యశ్వంత్ మాట్లాడారు. పరిస్థితులను అదుపు చేసే పేరుతో కశ్మీర్‌లో మూడు రకాల పోలీసు వ్యవస్థలను అమలు చేస్తున్నాం. నిజానికి అంత అవసరం లేదు. అసలు కశ్మీరీలపై సైనిక జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది’’అని అభిప్రాయపడ్డారు. కశ్మీర్ సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలంటూ బీజేపీ, పీడీపీ జట్టు కట్టిన సందర్భంగా 2015లో చేసుకున్న ఒప్పందం అమలును ఇప్పటికీ వేగవంతం చేయలేదని ఆయన ఆరోపించారు.
వ్యవస్థలు సరిగా ఉన్నప్పుడే న్యాయం: జస్టిస్ చలమేశ్వర్
మన చట్టాలు అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఉన్నా వాటి అమలులోనే లోపాలున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆవేదన వెలిబుచ్చారు. ‘రూల్ ఆఫ్ లా’అంశంపై ఆయన మాట్లాడారు. వ్యవస్థల పనితీరులో లోపం చట్టాల అమలుపైనా ప్రభావం చూపుతుందన్నారు. ‘‘వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. విలువలతో కూడిన, నిజాయితీపరులైన న్యాయమూర్తుల వల్ల నిష్పాక్షిక తీర్పులు వెలువడుతాయి’’అని అభిప్రాయపడ్డారు.
శాస్త్రీయ దృక్పథమే కొలమానం– ప్రొఫెసర్ మహాజన్
శాస్త్రీయ దృక్పథమే అభివృద్ధికి కొలమానమని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుచేతా మహాజన్ అభిప్రాయపడ్డారు. ‘మేకింగ్, అన్‌మేకింగ్ ఆఫ్ ద నేషన్’అనే అంశంపై ఆమె మాట్లాడారు. ‘‘స్వేచ్ఛాయుత వాతావరణంలో భావ ప్రకటన, భిన్నాభిప్రాయాల కలబోత వల్లే అభివృద్ధి సాధ్యం. చరిత్రే ఇందుకు రుజువు. మతోన్మాదం ఏదైనా ప్రమాదకరమే. అయితే చరిత్రను వక్రీకరించే ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ప్రధాని స్థాయి వాళ్లు సైన్స్ సదస్సుల వేదికపైనే అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడటం, అదే మన చరిత్ర అనడం తగదు’’అని అన్నారు.
సత్యం... శక్తిమంతం – నిఖిల్ డే
సత్యానికి ఎలాంటి అధికారపు దన్నూ అవసరం లేదని, దానికదే శక్తిమంతమని ప్రముఖ మేధావి నిఖిల్ డే అభిప్రాయపడ్డారు. ‘ట్రాన్సపరెన్సీ ఆఫ్ అకౌంటబిలిటీ’పై ఆయన మాట్లాడారు. పాలకులు వెచ్చించే ప్రతి పైసా ప్రజలదేనని, కాబట్టి దానికి వారు జవాబుదారీగా ఉండాలని అన్నారు. ‘‘అలాగే ప్రతి ఖర్చునూ పారదర్శకంగా ఉంచాలి కూడా. డిజిటల్ యుగంలో అది సాధ్యమే. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది పేదలే. ప్రభుత్వాలు ఆ స్పృహతో మసలుకోవాలి’’అన్నారు. చివరికి నిరసన తెలియజేసేందుకు సైతం ప్రదేశాలను కాపాడుకోవాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. జవాబుదారీతనం చట్టం కోసం పోరాడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
..లేదంటే తర్వాతి వంతు మనదే – రవీశ్‌కుమార్
అక్లాక్, కల్‌బుర్గి హత్యలను నిరసిస్తూ తమ అవార్డులను వెనక్కిచ్చేసిన సాహిత్యకారులను దోషులుగా చూసే దారుణ పరిస్థితులు దాపురించాయని ప్రముఖ జర్నలిస్టు రవీశ్ కుమార్ ఆవేదన వెలిబుచ్చారు. ‘గాంధీ అండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ట్రూత్, ఆల్టర్‌నేటివ్ ట్రూత్స్’అనే అంశంపై ఆయన ఉపన్యసించారు. ‘‘దేశభక్తి, జాతీయత ఏ ఒక్కరి సొత్తూ కాదు. వాటి పేరిట మీడియా సృష్టిస్తున్నదంతా నకిలీ దేశభక్తే. నిజానికి దేశభక్తి పేరుతో ప్రజల్లో భయాన్ని సృష్టించి, ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారు. జైల్ భరోతో నాడే బ్రిటిష్ వారిని తరిమికొట్టి భయాన్ని పారదోలాడు మహాత్ముడు. అదే స్ఫూర్తితో మనమూ భయాన్ని పారదోలి నిశ్శబ్దాన్ని ఛేదించాలి. లేదంటే రేపు దాడులకు గురయ్యేవారిలో మనమూ ఉంటాం’’అని హెచ్చరించారు. రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ‘వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్’గురించి తక్షశిల ఫౌండేషన్ సభ్యుడు నితిన్ పాయ్ హృద్యంగా వివరించారు. గేయ రచయిత, హాస్య నటుడు వరుణ్ గ్రోవర్ ప్రదర్శన ఆలోచింపజేసింది. కార్యక్రమానికి చందనా చక్రవర్తి సంధానకర్తగా వ్యవహరించారు.