మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్య
అది కాంగ్రెస్ మార్కు పాలన అంటూ బీజేపీ విమర్శలు
న్యూఢిల్లీ: కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డానంటూ యూపీఏ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ‘ఫైవ్ డికేడ్స్ ఆఫ్ పాలిటిక్స్’అనే పేరుతో తన ఆత్మకథను షిండే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పట్లో జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ‘హోం మంత్రి కాకమునుపు కశ్మీర్‌కు చాలాసార్లు వెళ్లాను. నా స్నేహితుడు, విద్యావేత్త విజయ్ ధార్ ఇంటికి అప్పట్లో వెళ్లేవాణ్ని.
మంత్రి నయ్యాక మాత్రం ‘శ్రీనగర్‌లో దాల్ సరస్సును చూడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగు. అంతేతప్ప, మిగతా చోట్లకు మాత్రం వెళ్లకు అని విజయ్ సలహా ఇచ్చాడు. దీంతో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రినే అయినప్పటికీ కశ్మీర్ వెళ్లడానికి మాత్రం భయపడ్డా’అని చెప్పారు. ‘స్వయంగా హోం మంత్రిని అయిన నేను ఈ విషయం ఎవరికి చెప్పుకోను? ఇప్పుడెందుకు చెబుతున్నానంటే..కేవలం నవ్వుకోడానికి మాత్రమే. మాజీ హోం మంత్రి ఇలాంటి వాటిపై మాట్లాడకూడదు’అని షిండే చెప్పారు.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2012–14 సంవత్సరాల్లో షిండే హోం మంత్రిగా ఉన్నారు. షిండే వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పాలనలో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రే కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డారు. మోదీ హయాంలో మాత్రం ఏటా 2–3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్‌ను సందర్శిస్తున్నారు. రెండు పార్టీల ప్రభుత్వాలకీ ఉన్న ముఖ్యమైన తేడా ఇదే’అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment